సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినీ రంగప్రవేశం చేసిన మహేష్ బాబు ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన సూపర్ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఏకంగా ఇండియాస్ టాప్ డైరెక్టర్ రాజమౌళితో ప్రస్తుతం మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సైలెంట్ గా ప్రారంభించారు కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా వైలెంట్ గా ఉండబోతుందని ఇప్పటికే రాజమౌళి సన్నిహితులు చెబుతున్నారు.
సూపర్ స్టార్.. ఈ పేరును వెనక ఉంచుకుని ముందుకు దూకాడు మహేష్ బాబు. కానీ ఆ స్టార్డమ్ రావడానికి మాత్రం చాలా కాలం పట్టింది. కాదు చాలా కష్టపడ్డాడు. తండ్రి సంపాదించిన పేరు ఎవరికైనా ఈజీగానే వస్తుంది. కానీ ఆ ఇమేజ్ రావాలంటే కష్టం. ఆ కష్టం అనుభవించాడు కాబట్టే.. మహేష్ బాబు ముందు సూపర్ స్టార్ చేరినప్పుడు ఎవరూ పెద్దగా విమర్శించలేదు. ఇంకా చెప్పాలంటే కృష్ణ గారి తర్వాత ఆ టైటిల్ అతనికి యాప్ట్ అనేశారు కూడా. అది నిజమే అని ప్రతి సినమాతో ప్రూవ్ చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ రాజకుమారుడి పుట్టిన రోజు ఇవాళ.
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా.. అన్నయ్య రమేష్ బాబు నటించిన నీడ సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి వచ్చాడు. ఆ తర్వాత పోరాటం, బజారు రౌడీ, ముగ్గురు కొడుకులు, గూఢ ఛారి117, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు లాంటి సినిమాలు చేశాడు మహేష్. అన్ని సినిమాల్లోనూ చాక్లెట్ బాయ్ లుక్స్ తో తండ్రికి తనయుడుగా చిచ్చరపిడుగు అనిపించుకున్నాడు.
అయితే సినిమాల వల్ల మహేష్ చదువు పాడవుతుందని, చదువు పూర్తయ్యాక మళ్లీ సినిమాల్లోకి రావచ్చు అంటూ మహేష్ ని కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉంచారు కృష్ణ . అయితే మహేష్ బాబు కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఒక్కడు. గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో చార్మినార్ సెట్టింగ్ ఓ హైలెట్ అయితే, మహేష్ బాబు పెర్ఫామెన్స్ మరో హైలెట్. కబడ్డీ ప్లేయర్ లా యూత్ రిప్రజెంటేటివ్ గా కనిపించిన మహేష్ బాబు యాక్టింగ్ కు ఫుల్ మార్కులు పడ్డాయి. ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. ఇక అప్పటి వరకు కృష్ణ అభిమానులే ప్రిన్స్ ఫ్యాన్స్ అన్న లైన్ పోయి, తనకంటూ సొంత ఫాలోయింగ్ ని మహేష్ కి ఏర్పడిందీ ఒక్కడు సినిమాతోనే. హిట్స్ ఉన్నాయి. ఫ్లాప్స్ వచ్చినా అధైర్య పడకుండా దూసుకెళ్తున్నాడు. కానీ మహేష్ బాబు ఇంకేదో సాధించాలి. అభిమానులంతా గర్వపడేలా, స్టార్ వార్ లో దుమ్ముదులిపేలా ఓ హిట్ కావాలి. అది ఫలానా హీరోకి ఫలానా సినిమా ఉందే.. అలా అని అంతా అనుకునేలా ఉండాలి.. అనుకుంటున్న టైమ్ లో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన పోకిరి అభిమానుల ఆకలిని తీర్చింది. ఆ టైమ్ కు ఉన్న అన్ని రికార్డులను తిరగరాస్తూ మహేష్ ని టాప్ రేసులో నిలిపింది పోకిరి..పోకిరి దెబ్బకు రికార్డుల దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది.
ఆ తర్వాత వరుసగా మూడు ఫ్లాపులు రావడంతో మహేష్ ఈ సారి ప్రయోగాలు చేయకుండా ఈసారి మాస్ బాట పట్టాడు. దూకుడు మూవీతో వచ్చి దుమ్ము దులిపాడు. శ్రీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దూకుడులో పోలీస్ ఆఫీసర్ గా, ఎమ్మెల్యేగా సరికొత్త లుక్ తో తన పెర్ఫార్మెన్స్ కట్టిపడేశారు మహేష్. ఈ మూవీతో చాలా వరకూ తన రికార్డులు తనే బద్దలు కొట్టాడు. నిజానికి ముందు నుంచి మహేష్ బాబు హీరోయిజాన్ని నమ్ముకుంది తక్కువ, స్టోరీనే నమ్మాడు. తన చుట్టే సినిమా అంతా తిరగాలని అనుకోలేదు. తొలినాళ్లలో అలా చేసినా.. తర్వాత ప్రతి విజయంతో కథకే ఇంపార్టెన్స్ ఇవ్వడం పెంచాడు. అందుకే వెంకటేష్ తో కలిసి మల్టీస్టారర్ మూవీ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చేశాడు. టాలీవుడ్ లో 20 ఏళ్ల తర్వాత వచ్చిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఇలాంటి ట్రెండ్ సెట్టింగ్ మల్టీస్టారర్ తో ఆ రోజుల్లో కృష్ణ గారు చేసిన మల్టీస్టారర్స్ ను నాటి తరం ప్రేక్షకులకు మరోసారి గుర్తు వచ్చేలా చేశాడు.ఇక ఆ తరువాత రెండు ఫ్లాపులు రావడంతో నెక్ట్స్ ప్రాజెక్ట్సు పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు మహేష్ బాబు.
ఇలా ఒకటికి రెండు సార్లు ఆలోచించి షూటింగ్స్ ని పోస్ట్ పోన్ చెయ్యడంతో మహేష్ భయపడుతున్నాడనే టాక్ వచ్చింది. కానీ ఎవరేమన్నా పట్టించుకోలేదు. ఖచ్చితంగా హిట్ కొట్టి తీరాలనే డిసైడ్ అయ్యాడు. కొరటాల శివ డైరెక్షన్లో శ్రీమంతుడులా వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. 150 కోట్లకు పైగా కలెక్షన్లతో టాలీవుడ్ లో వందకోట్ల క్లబ్ లో చేరిన రెండో హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు మహేశ్. ఆ వెంటనే భరత్ అనే నేను, మహర్షితో రెండు భారీ హిట్లు ఇచ్చిన మహేష్.. తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ చిత్రంతో హాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆర్మీ ఆఫీసర్ గా ఈ చిత్రంలో నటించిన మహేష్… యాక్టింగ్, లుక్స్, డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్, కామెడీతో పాటు డాన్సుల్లోనూ జోష్ చూపించి అభిమానులననే కాదు అందర్నీ మెస్మరైజ్ చేశారు. 2020 సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ పోటీగా అల వైకుంఠపురములో అనే మరో సినిమా ఉన్నప్పటికీ 250 కోట్ల వరకు కలెక్ట్ చేయడం విశేషం. ఇక తరువాత గుంటూరు కారంతో వచ్చి మరో హిట్ అందుకున్నాడు. ఇక మహేష్ బర్త్ డే సందర్భంగా ఇవాళ అతడు మూవీ 4కె వెర్షన్ ని రీ రిలీజ్ చేశారు. ఓపెనింగ్స్ కూడా అదిరిపోయే రేంజ్ లో వస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ మరింత జోష్ లో ఉన్నారు. ఇక ఆయన పుట్టిన రోజు సంధర్భంగా రాజమౌళి సినిమా నుంచి ఒక స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
