Israel – Palestine War: ప్రపంచ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే అత్యంత భీకరమైన సంఘర్షణల్లో ఒకటి… ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధం. 2023 అక్టోబర్ 7న మొదలైన ఈ యుద్ధానికి రెండేళ్లు. ఈ మారణహోమంలో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పోరు కేవలం గాజాకే పరిమితం కాలేదు. మధ్యప్రాచ్యమంతటా విస్తరించింది. అయితే, ఇప్పుడీ యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్టు కనిపిస్తోంది. అసలు ఈ యుద్ధానికి మూలాలేంటి? ఇరుదేశాలకూ జరిగిన నష్టం ఎంత? మధ్యలో చోటు చేసుకున్న ట్విస్టులేంటి? ట్రంప్ జోక్యం ఎంతవరకు పని చేసింది?
ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య యుద్ధం గురించి తెలుసుకోవాలంటే మనం చరిత్ర లోతుల్లోకి వెళ్లాలి. శతాబ్దాల నాటి గాయాలను, దశాబ్దాలుగా జరుగుతున్న ఘర్షణలను తెలుసుకోవాలి. ఇజ్రాయెల్ -పాలస్తీనా మధ్య యుద్ధం ఒక్కరోజులో మొదలవలేదు. దీని మూలాలు వందల ఏళ్ల క్రితం ఉన్నా, ఆధునిక సంఘర్షణకు కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. 1948లో ఇజ్రాయెల్ ఆవిర్భవించినప్పటి నుండి ఈ రెండు దేశాల మధ్య భూ పంపకాలపై వివాదం ఉంది. ముఖ్యంగా 1967 యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేంను ఆక్రమించుకుంది. ఇది పాలస్తీనియన్లలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. దీనికి తోడు, 2007 నుండి ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్‌ను పూర్తిగా దిగ్బంధించింది. ఇది అక్కడి ప్రజల జీవితాన్ని దుర్భరం చేసింది. హమాస్ లాంటి మిలిటెంట్ గ్రూపుల ప్రతీకారేచ్ఛకు ఆజ్యం పోసింది. 2023లో జరిగిన ఘర్షణలు పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీశాయి.
Read Also: Mahesh Babu : AMB క్లాసిక్ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కు ముహుర్తం ఫిక్స్ !
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన మెరుపుదాడి ఆ రెండు దేశాల చరిత్రనే కాదు.. మధ్యప్రాచ్య భౌగోళిక ముఖచిత్రాన్నే మార్చేసింది. ఆ దాడికి ప్రతీకారంగా గాజాను భూస్థాపితం చేసేందుకు ఇజ్రాయెల్ భీకర యుద్ధానికి దిగింది. 2023 అక్టోబర్ 7.. శనివారం… ఇది ఇజ్రాయెల్ చరిత్రలో అత్యంత చీకటి రోజు. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై ‘ఆపరేషన్ అల్-అక్సా స్టోర్మ్’ పేరుతో మెరుపుదాడి చేశారు. గాజా నుండి ఒకేసారి 5వేలకు పైగా రాకెట్లు ప్రయోగించారు. అదే సమయంలో, మిలిటెంట్లు సరిహద్దు కంచెను ఛేదించుకుని ఇజ్రాయెల్ భూభాగంలోని చొరబడ్డారు. పౌర నివాసాలు, సైనిక స్థావరాలపై విరుచుకుపడ్డారు. 12 వందల మందికి పైగా ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 250 మందిని హమాస్ బందీలుగా పట్టుకుని గాజాకు తీసుకెళ్లింది. ఈ ఘటనతో రగిలిపోయిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెంటనే యుద్ధం ప్రకటించారు. హమాస్‌ను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ‘ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్’ను మొదలుపెట్టారు.
Read Also: CP Sajjanar: వాహనదారులకు బిగ్ అలర్ట్.. డ్రైవింగ్లో అలా చేస్తే కఠిన చర్యలే..
ఇజ్రాయెల్ యుద్ధం కేవలం పాలస్తీనా, గాజాలకే పరిమితం కాలేదు. కార్చిచ్చులా మధ్యప్రాచ్యమంతటా వ్యాపించింది. లెబనాన్, సిరియా, ఇరాన్, ఖతర్ లాంటి ప్రాంతాలకు కూడా ఇది విస్తరించింది. గాజాపై ఇజ్రాయెల్ భీకరమైన వైమానిక, భూతల దాడులు కొనసాగిస్తున్న సమయంలోనే, ఈ పోరు ప్రాంతీయంగా విస్తరించింది. ఇజ్రాయెల్‌కు ఉత్తరాన ఉన్న లెబనాన్‌లోని హెజ్బొల్లా దాడులు మొదలుపెట్టడంతో, సరిహద్దుల్లో ఉద్రిక్తత పెరిగింది. దీనికి తోడు సిరియా నుండి ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద గ్రూపుల జోక్యాన్ని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్, సిరియాలోని స్థావరాలపైనా దాడులు చేసింది. ముఖ్యంగా 2024 సెప్టెంబర్‌లో ఇజ్రాయెల్ ఒక అనూహ్య వ్యూహాన్ని అమలు చేసింది. హెజ్బొల్లా కార్యకర్తలు వినియోగించే పేజర్లు, వాకీ-టాకీలను పేల్చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది హెజ్బొల్లా కార్యకర్తలు మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. ఇది హెజ్బొల్లా కమాండ్ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసింది. ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా అధినేత ‘హసన్ నస్రల్లా’ సహా కీలక కమాండర్లు హతమయ్యారు. అంతేకాక.. హమాస్ ముఖ్య నేతలు కూడా చనిపోయారు. ఇది యుద్ధంలో ఇజ్రాయెల్‌కు వ్యూహాత్మక విజయాన్ని అందించింది. ఈ ఏడాది జూన్ లో ఇరాన్ అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ కు చెందిన పలువురు అగ్రశ్రేణి నాయకులు, అధికారులు చనిపోయారు. సెప్టెంబర్ 9న ఖతర్ లోని ఓ భవనంలో హమాస్ నేతలు సమావేశమయ్యారనే సమాచారంతో దానిపై ఇజ్రాయల్ దాడి చేసింది. అయితే ఇజ్రాయెల్ ప్లాన్ ఫెయిల్ అయింది. ట్రంప్ జోక్యంతో ఖతర్ కు ఇజ్రాయెల్ సారీ చెప్పింది.
Read Also: Nandyal District: రౌడీషీటర్‌కు 6 నెలల పాటు జిల్లా బహిష్కరణ.. కలెక్టర్ ఉత్తర్వులు..
ఇజ్రాయెల్ యుద్ధం ధాటికి గాజా పూర్తిగా నేలమట్టమైంది. ప్రపంచం చూస్తుండగానే జనసంద్రంగా ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు శిథిలాల సముద్రంగా మారిపోయింది. ఈ యుద్ధంలో అత్యంత దారుణంగా నష్టపోయింది ‘గాజా స్ట్రిప్’. ఇజ్రాయెల్ దాడుల వల్ల సుమారు 66వేల మందికి పైగా పాలస్తీనియన్లు ఇక్కడ మరణించారు. వీళ్లలో ఎక్కువమంది సాధారణ ప్రజలే. చనిపోయిన వాళ్లలో పిల్లలే అధికం. గాజాలోని 70శాతానికి పైగా నివాస భవనాలు, ఆసుపత్రులు, మౌలిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 23 లక్షల మంది నివసిస్తున్న ఈ ప్రాంతంలో చాలామంది నిరాశ్రయులయ్యారు. ఆహారం, నీరు, మందులు అందక ఆకలితో అలమటించారు. అంటు వ్యాధులు ప్రబలి చనిపోయారు. మానవతా సాయం అందించేందుకు ఎన్నో సంస్థలు ముందుకొచ్చినా ఇజ్రాయెల్ దాడుల వల్ల అవి సహాయం చేయలేకపోయాయి. ఇజ్రాయెల్ మాత్రం యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చేసింది.
Read Also: Mahesh Babu : AMB క్లాసిక్ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కు ముహుర్తం ఫిక్స్ !
రెండేళ్ల పాటు కొనసాగిన పోరు చివరకు దౌత్యపరమైన మలుపు తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ నేపథ్యంలో యుద్ధం చివరి దశకు చేరుకుంది. గాజాలో శాశ్వత పరిష్కారం కోసం ట్రంప్ 20 పాయింట్ల పీస్ ప్లాన్‌ను ప్రతిపాదించారు. ఈ ప్రణాళికకు ఇజ్రాయెల్ సహా పలు అరబ్ దేశాలు మద్దతు తెలిపాయి. అంతర్జాతీయ ఒత్తిడితో పాటు తమ ముఖ్య నేతలు చనిపోవడంతో హమాస్ కూడా తలొగ్గింది. బందీలను విడుదల చేసేందుకు, కాల్పుల విరమణకు అంగీకారం తేలిపింది. తన పీస్ ప్లాన్‌ను హమాస్ ఒప్పుకోకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. దీంతో హమాస్ దిగిరాక తప్పలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో, త్వరలోనే బందీలు విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే ఇజ్రాయెల్ కూడా వందలాదిమంది ఖైదీలను విడుదల చేసేందుకు అంగీకరించింది.
Read Also: Nandyal District: రౌడీషీటర్‌కు 6 నెలల పాటు జిల్లా బహిష్కరణ.. కలెక్టర్ ఉత్తర్వులు..
యుద్ధం ముగిసిపోతుందన్న వార్త ఆశాజనకంగా ఉన్నా.. గాజాలో జరిగిన విధ్వంసం, కోల్పోయిన ప్రాణాలు, మిగిల్చిన గాయం మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పుడే అసలు సవాలు మొదలు కానుంది. యుద్ధం ఆగిపోయినా, గాజా శిథిలాల నుంచి మళ్లీ పుడుతుందా? పాలస్తీనా ప్రజలకు శాంతియుత భవిష్యత్తు సాధ్యమవుతుందా? ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందం కాగితాలకే పరిమితమవుతుందా? .. లాంటి అనేక ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.