మూడు నెలలు…తెగిపడిన వేలాది తలలు..! మధ్యప్రాచ్యం మీద మూడు నెలల పాటు ఆకాశం నుంచి బాంబుల వర్షం కురిసింది. మనుషుల జీవితాలు తగలబడిపోయాయి. నగరాలు పూర్తిగా ఖాళీ అయ్యాయి. ఈ యుద్ధం మొదలైన రోజు నుంచి ప్రపంచం మొత్తం టీవీల్లో మ్యాపులు చూసింది.. మిస్సైళ్ల రేంజ్‌లు చూసింది.. ఎవరు గెలుస్తారని చర్చించింది. కానీ నేలమీద మాత్రం తల్లులు తమ పిల్లల శవాలను వెతికాయి. వేల కుటుంబాలు ఒక్క రాత్రిలో శరణార్థులయ్యాయి. 
ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నం:
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు ప్రారంభించడంతో మొదలైన ఈ యుద్ధం క్రమంగా మిడిల్‌ఈస్ట్ దేశాలను మంటల్లోకి నెట్టింది. మొదట ఇది పరిమిత దాడుల్లా కనిపించినా కొద్ది రోజులకే చమురు కేంద్రాలు పేలిపోయాయి. గ్యాస్ ఫీల్డులు మంటల్లో కాలిపోయాయి. సముద్ర మార్గాలు మూసుకుపోయాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా వణికిపోయింది.
ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శాంతి ఒప్పందం దాదాపు సిద్ధమైందని చెబుతున్నారు. ఇటు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ మళ్లీ తెరవొచ్చని సమాచారం వస్తోంది కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది.
మూడు నెలల్లో సర్వనాశనం:
ఈ మూడు నెలల్లో వేల మంది చనిపోయారు లక్షల మంది జీవితాలు నాశనమయ్యాయి. అంతర్జాతీయ మీడియా యుద్ధ గణాంకాల ప్రకారం ఫిబ్రవరి 28 నుంచి మే 20 వరకు ఇరాన్‌లో 3,468 మంది చనిపోయారు. 26,500 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు లెబనాన్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం అక్కడ 3042 మంది మరణించారు. 9300 మందికి పైగా గాయపడ్డారు. హెజ్బొల్లా క్షిపణి దాడుల తర్వాత ఇజ్రాయెల్ భారీ స్థాయిలో వైమానిక దాడులు ప్రారంభించింది. దక్షిణ లెబనాన్, బెకా వ్యాలీ ప్రాంతాలు పూర్తిగా యుద్ధభూములుగా మారిపోయాయి. లెబనాన్ అధికారుల ప్రకారం దాదాపు 12 లక్షల మంది తమ ఇళ్లను వదిలి పారిపోవాల్సి వచ్చింది. ఇరాక్‌లో 118 మంది చనిపోగా.. ఇజ్రాయెల్‌లో 26 మంది మరణించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. సిరియాలో కూడా మరణాలు నమోదయ్యాయి. ఈ యుద్ధం నుంచి అమెరికా సైన్యం కూడా తప్పించుకోలేకపోయింది.
అమెరికా అధికారిక వివరాల ప్రకారం 13 మంది అమెరికన్ సైనికులు చనిపోయారు. 381 మంది గాయపడ్డారు. కానీ ఈ యుద్ధం కేవలం ప్రాణాలనే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గుండెను కూడా ఛిద్రం చేసింది. ఎందుకంటే ప్రపంచ చమురు సరఫరాలో కీలక ప్రాంతమైన మధ్యప్రాచ్యమే ఈ యుద్ధానికి కేంద్రంగా మారింది. సౌదీ అరేబియాలో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు కేంద్రాల్లో ఒకటైన రాస్ తనూరా దాడికి గురైంది. సామ్‌రెఫ్, సాటోర్ప్ రిఫైనరీలు కూడా దెబ్బతిన్నాయి.
ఇరాన్‌లో దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా భావించే సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది. యూఏఈలో హబ్షాన్, షా గ్యాస్ సౌకర్యాలు ధ్వంసమయ్యాయి. కువైట్‌లో మీనా అల్ అహ్మది రిఫైనరీ, బహ్రెయిన్‌లో బాప్‌కో సిత్రా, ఖతార్‌లో లఫాన్, ఇరాక్‌లో ఎర్బిల్ లానాజ్, ఇజ్రాయెల్‌లో హైఫా రిఫైనరీలు ఈ యుద్ధంలో దెబ్బతిన్నాయని అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. దీంతో లక్షల బ్యారెల్ల చమురు, గ్యాస్ ఉత్పత్తి సామర్థ్యం ఒక్కసారిగా దెబ్బతిన్నది. దాని ప్రభావం వెంటనే ప్రపంచ మార్కెట్లపై పడింది.
అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషణల ప్రకారం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 110 డాలర్లకు పైగా చేరింది. భారత క్రూడ్ బాస్కెట్ ధర గత ఏడాదితో పోలిస్తే 55 శాతం పెరిగిందని ఆర్థిక నివేదికలు చెబుతున్నాయి. చమురు ధర పెరిగితే ప్రభావం కేవలం పెట్రోల్ బంక్ దగ్గరే ఆగిపోదు. రవాణా ఖర్చులు, కూరగాయల ధరలు, విమాన టికెట్లు, ఎరువుల ధరలు పెరుగుతాయి. చివరకు అన్నం ధర కూడా పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్ నిపుణుల ప్రకారం ఈ యుద్ధం కారణంగా ఎరువుల ధరలు దాదాపు రెట్టింపు అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆహార భద్రతపై కూడా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి.
ఇండియాపై ఎఫెక్ట్:
ఇండియా లాంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఈ పరిస్థితి పెద్ద ప్రమాదంగా మారింది. విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి అత్యవసర ఆర్థిక చర్యలపై కేంద్ర ప్రభుత్వం చర్చించిందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్‌ను కన్సిడర్ చేయడంతో పాటుఅవసరం లేని దిగుమతులను తగ్గించడం లాంటి ప్రతిపాదనలు కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం.అయితే ఈ యుద్ధం ప్రపంచానికి మరో భయంకరమైన నిజాన్ని గుర్తుచేసింది. యుద్ధాలు మొదలు పెట్టేది రాజకీయ నాయకులే కానీ వాటి ధర చెల్లించేది సాధారణ ప్రజలే. వార్ అనేది రాజకీయ నాయకులకు పవర్ గేమ్. ఆయుధ కంపెనీలకు అది బిజినెస్ కానీ నేలమీద మాత్రం అది ఆకలి, శవాలు, శరణార్థుల బతుకులు.
ఇప్పుడు శాంతి ఒప్పందం గురించి మాట్లాడుతున్నారు కానీ వేల మంది చనిపోయిన తర్వాత వచ్చే శాంతి నిజంగా శాంతేనా? లేదా మరో యుద్ధానికి ముందు వచ్చే చిన్న విరామమా? మొత్తంగా చూస్తే ఈ మూడు నెలల్లో ప్రపంచం ఓ విషయాన్ని క్లియర్‌కట్‌గా అర్థం చేసుకుంది. చమురు కోసం జరిగే యుద్ధాల్లో చివరకు కాలిపోవేది మనుషుల జీవితాలేనని తెలుసుకుంది.
