IRAN-AMERICA Deal EXPLAINED: మిడిల్ ఈస్ట్‌లో రగులుతున్న యుద్ధానికి ముగింపు పడనుందా? అమెరికా.. ఇరాన్ మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదరబోతోందా? మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు చెక్ పెడుతూ.. ఇరు దేశాలు ఒక అవగాహనా ఒప్పందానికి దాదాపుగా అంగీకరించాయి. 60 రోజుల పాటు కాల్పుల విరమణ.. ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు.. హార్మూజ్ జలసంధిలో రాకపోకలు.. అలాగే ఇరాన్‌కు ఏకంగా 300 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడుల ప్యాకేజీ.. ఇలా ఎన్నో కీలక అంశాలు ఈ ఒప్పందంలో ముడిపడి ఉన్నాయి. అసలు అమెరికా – ఇరాన్ మధ్య జరగబోయే ఈ డీల్‌ను ఎలా వర్కౌట్ చేశారు…?
సంతకం చేయలేదు..ఖరారు కాలేదు:
అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కోసం గత కొద్ది వారాలుగా పశ్చిమాసియా దౌత్యవేత్తలు.. మధ్యవర్తులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. యుద్ధానికి ముగింపు పలికేలా ఇరు వర్గాలు ఇప్పుడు ఒక ముసాయిదా అవగాహనా ఒప్పందానికి వచ్చాయి. ప్రస్తుత తాత్కాలిక కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగించేందుకు ఇరు దేశాలు సిద్ధమయ్యాయి. ఈ 60 రోజుల్లో ఇరాన్ అణు కార్యక్రమంపై అత్యంత కీలక చర్చలు జరగనున్నాయి. అయితే ఈ ముసాయిదాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా సంతకం చేయలేదని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. కొన్ని కీలక పదాలపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని, ఒప్పందంపై ఎప్పుడు సంతకం చేస్తారో ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. అటు ఇరాన్ మీడియా కూడా ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని, ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తేనే ఈ డీల్ పూర్తయినట్లు అని తేల్చి చెప్పింది. పాకిస్తాన్, ఖతార్ దేశాలు ఈ చర్చల్లో ప్రధానంగా మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాయి.
ఒకవేళ ఈ ఒప్పందం ఖరారైతే… భవిష్యత్తులో ఇరాన్ అణు కార్యక్రమం.. అమెరికా ఆంక్షల ఎత్తివేతపై చర్చలకు మార్గం సుగమం అవుతుంది. ఈ డీల్ లో ప్రధానంగా హార్మూజ్ జలసంధి వివాదానికి పరిష్కారం చూపనున్నారు. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం హార్మూజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. 30 రోజుల్లోగా ఇరాన్ తన సముద్రపు మందుపాతరలను పూర్తిగా తొలగించాలి.
వాణిజ్య నౌకల రాకపోకలు మొదలైతే అమెరికా కూడా తన నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేస్తుంది. అలాగే ఇరాన్ వద్ద ఉన్న 970 పౌండ్ల శుద్ధి చేసిన యురేనియం నిల్వల భవితవ్యంపై ఈ 60 రోజుల వ్యవధిలో చర్చిస్తారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని తయారు చేయబోనని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు.. మరో 10 టన్నుల తక్కువ-స్థాయి అణు పదార్థాల నిర్వహణపై కూడా ఇరు దేశాల ప్రతినిధులు ఒక స్పష్టతకు రావాల్సి ఉంటుంది.
ఆంక్షలను ఎత్తివేస్తున్నారు:
అమెరికా విధించిన కఠిన ఆంక్షల ఎత్తివేత కూడా ఈ చర్చల్లో ప్రధాన ఎజెండాగా ఉండబోతోంది. విదేశీ బ్యాంకుల్లో ఫ్రీజ్ అయిన ఇరాన్ నిధులను విడుదల చేసేందుకు అమెరికా అంగీకరించే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్‌కు చెందిన సుమారు 24 బిలియన్ డాలర్ల నిధులు వివిధ దేశాల బ్యాంకుల్లో నిలిచిపోయాయి. వీటిలో కనీసం 20 బిలియన్ డాలర్లను తిరిగి పొందేందుకు ఇరాన్ గట్టిగా ప్రయత్నిస్తోంది. అలాగే ఇరాన్‌కు నిత్యావసర వస్తువులు.. మానవతా సహాయం అందేలా ఒక మెకానిజంను రూపొందించనున్నారు. ఇక ఇజ్రాయెల్ హిజ్బుల్లాల మధ్య లెబనాన్ లో జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికే అంశం కూడా ఈ ఒప్పందంలో ప్రత్యేకంగా ఉంది. దీనిపై ట్రంప్.. నెతన్యాహు మధ్య ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిగాయి. హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రం చేయడంతో ఈ నిబంధన అమలు అత్యంత కీలకం కానుంది.
ఈ ఒప్పందంలో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న మరో ముఖ్యమైన అంశం.. ఇరాన్ కోసం ఏర్పాటు చేయనున్న భారీ పెట్టుబడుల ఫండ్. తుది ఒప్పందం కుదిరితే.. ఇరాన్ పునర్నిర్మాణ కార్యక్రమం కోసం ఏకంగా 300 బిలియన్ డాలర్ల అంతర్జాతీయ ఫండ్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ అంతర్జాతీయ పెట్టుబడుల ఫండ్‌కు అమెరికా తన వంతు సహకారం అందించనుంది. అమెరికాకు చెందిన బహుళజాతి చమురు.. ఇంధన సంస్థలు ఇరాన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు.. జాయింట్ వెంచర్లు ప్రారంభించేందుకు కూడా అవకాశం కలుగుతుంది.
అయితే.. ఇరు దేశాల మధ్య ఇంకా కొన్ని విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా కేవలం 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ గురించి మాట్లాడుతుండగా.. ఇరాన్ మాత్రం యుద్ధం శాశ్వతంగా ముగిసినట్లు డిక్లరేషన్ ఉండాలని పట్టుబడుతోంది. అలాగే.. అమెరికా తన నావికా దిగ్బంధనాన్ని దశలవారీగా ఎత్తివేస్తామని చెబుతుంటే.. 30 రోజుల్లోనే పూర్తిగా ఎత్తివేయాలని ఇరాన్ షరతు పెడుతోంది. ఈ సవాళ్లను దాటితేనే మిడిల్ ఈస్ట్ లో శాశ్వత శాంతి వికసిస్తుంది.
:ఫణి కుమార్ (NTV DIGITAL)
