మనమంతా రాత్రివేళ ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో లడాఖ్‌లో ఒక జవాన్ మంచు తుఫానులో నిలిబడి ఉంటాడు. రాజస్థాన్ ఎడారిలో మరో జవాన్ 45 డిగ్రీల వేడిలో గస్తీ కాస్తుంటాడు. సముద్రం మధ్యలో నౌకపై ఇంకొకరు కంటిపాపలా దేశాన్ని కాపాడుతుంటారు.
మనకు ఈ దేశం సురక్షితంగా అనిపించడానికి కారణం రాజకీయ నాయకుల స్పీచులు కాదు..సరిహద్దుల్లో మన కోసం ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడుతున్న త్రివిధ దళాల యోధులు. మరోవైపు ఇండియా సరిహద్దులు ఇప్పుడు ప్రశాంతంగా లేవు. ఓవైపు చైనా నుంచి థ్రెట్ ఉంది.. మరోవైపు పాకిస్థాన్ ఏ సమయంలో ఎలాంటి ఉగ్రచర్యలకు పాల్పడుతుందో ఎవరికీ తెలియదు. ఇటు యుద్ధాలు ఇక బుల్లెట్లతో, బాంబులతో మాత్రమే కాదు.. డ్రోన్లు, సైబర్ దాడులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో జరుగుతున్నాయి.
ఇలాంటి సమయంలో ఫిబ్రవరి ఒకటిన నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న యూనియన్ బడ్జెట్‌పై దేశం చూపు నెలకొంది. 2026 బడ్జెట్ ముందు దేశం ఎదుర్కొంటున్న అసలైన ప్రశ్న ఇదే.. రేపటి యుద్ధానికి భారత్ నిజంగా సిద్ధంగా ఉందా?
ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి ముందుగా ఒక నిజాన్ని అర్థం చేసుకోవాలి. డిఫెన్స్ బడ్జెట్ అంటే కేవలం కొత్త ఆయుధాల కొనుగోలు కాదు. అది ఒక పెద్ద వ్యవస్థను నడిపే ఖర్చు.
ప్రస్తుతం కేంద్ర బడ్జెట్‌లో రక్షణ రంగానికి కేటాయింపులు సుమారు 6.8 లక్షల కోట్ల రూపాయలగా ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ మొత్తం ఖర్చుల్లో సుమారు 13 శాతం. వినడానికి పెద్ద సంఖ్యలా అనిపిస్తుంది కానీ లోతుగా చూస్తే మరో నిజం బయటపడుతుంది. ఈ మొత్తం డబ్బులో పెద్ద భాగం పెన్షన్లు, జీతాలు, రోజువారీ నిర్వహణ ఖర్చులకు వెళ్తోంది. సరిహద్దుల్లో ఉన్న సైనికులకు ఆహారం, ఇంధనం, యూనిఫార్మ్స్, పాత ఆయుధాల మెయింటెనెన్స్, ట్రాన్స్‌పోర్ట్ లాంటివి తప్పనిసరి ఖర్చులగా మారాయి. ముఖ్యంగా పెన్షన్ భారం సంవత్సరానికోసారి పెరుగుతోంది. ఇది న్యాయమే. దేశం కోసం ప్రాణాలు పెట్టిన వాళ్లకు అది వారి హక్కు. కానీ ఈ ఖర్చుల తర్వాత మిగిలేది చాలా తక్కువ. అదే ఆధునికీకరణకు ఉపయోగించే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్.
ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. యుద్ధాలు మారిపోయాయి. కానీ ఆయుధాల అప్‌డేషన్ వేగం అంతగా పెరగలేదు. భారత సైన్యంలో ఇప్పటికీ చాలా యూనిట్లు పాత ఆర్టిల్లరీ సిస్టమ్స్, పాత ట్యాంకులు, పాత కమ్యూనికేషన్ టెక్నాలజీతోనే పనిచేస్తున్నాయి.
ఎయిర్ ఫోర్స్‌కు అవసరమైన స్క్వాడ్రన్ల సంఖ్య కంటే ప్రస్తుతం ఉన్నవి తక్కువే. నేవీకి కావాల్సిన సబ్‌మేరిన్లు ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. మరో కీలక అంశం.. భారత్ GDPలో రక్షణ ఖర్చు వాటా. ప్రస్తుతం అది దాదాపు 2 శాతం కంటే తక్కువ స్థాయిలోనే ఉంది. భద్రతా నిపుణులు మాత్రం భారత్ లాంటి దేశానికి కనీసం 2.5 శాతం పరిధిలో ఖర్చు అవసరమని చెబుతున్నారు. ముఖ్యంగా రెండు ఫ్రంట్‌లపై థ్రెట్ ఉన్న దేశానికి ఇది కీలకం. ఈ లోటును తగ్గించడానికి ప్రభుత్వం ఒక దారి ఎంచుకుంది. అదే ఆత్మనిర్భర్ భారత్. బయట దేశాలపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో భారత్‌కు ఇప్పటికే అనుభవమే. ఒక సంక్షోభ సమయంలో స్పేర్ పార్ట్స్ రాకపోతే, ఆయుధాలు ఉన్నా ఉపయోగం ఉండదు. అందుకే దేశంలోనే ట్యాంకులు, గన్స్, మిసైల్స్, డ్రోన్లు తయారు చేయాలనే దిశగా పాలసీ మారింది.
గత బడ్జెట్‌ల్లో ఒక స్పష్టమైన సంకేతం కనిపించింది. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌లో 75 శాతం వరకు దేశీయ పరిశ్రమల నుంచే కొనుగోళ్లకు కేటాయింపులు జరిగాయి. DRDOకి ప్రత్యేకంగా నిధులు వెళ్లాయి. స్టార్టప్‌ల కోసం iDEX లాంటి ప్రోగ్రామ్స్‌తో పాటు డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ కూడా గత కొన్నేళ్లలో గణనీయంగా పెరిగాయి. భారత్‌లో తయారైన పేట్రోల్ బోట్స్, మిసైల్స్, రాడార్లు ఇప్పుడు ఇతర దేశాలకు వెళ్తున్నాయి. ఇది కేవలం సైనిక బలం కాదు. ఆర్థిక బలం కూడా. కానీ ఇక్కడ కూడా ఒక హెచ్చరిక ఉంది. డబ్బు కేటాయించడం ఒక్కటే సరిపోదు. ఆ డబ్బు సమయానికి ఖర్చవుతుందా? ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా పూర్తవుతాయా? మార్చి 31కి ముందు ఖర్చు కాలేదని నిధులు వెనక్కి వెళ్లిపోతున్నాయా? ఇలాంటి సమస్యలే సైన్యాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే కొంతమంది నిపుణులు నాన్-లాప్సబుల్ డిఫెన్స్ ఫండ్ అవసరమని సూచిస్తున్నారు.
ఎందుకంటే భవిష్యత్ యుద్ధాలు మరింత భిన్నంగా ఉండబోతున్నాయి. డ్రోన్లు, సైబర్ అటాక్స్, శాటిలైట్ వార్, AI ఆధారిత నిర్ణయాలతో ఇప్పటికే యుద్ధాలు జరుగుతున్నాయి . అందుకే 2026 బడ్జెట్‌పై త్రివిధ దళాలు మాత్రమే కాదు, దేశ భవిష్యత్తు కూడా ఆధారపడింది. మరి చూడాలి ఫిబ్రవరి ఒకటి బడ్జెట్ మన జవాన్లకు నిజంగా కావాల్సిన బలాన్ని ఇస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!
ALSO READ: బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్లకు న్యాయం జరుగుతుందా? పన్ను నిబంధనలు మారతాయా?