NTV Telugu Site icon

India – Canada Row : కెనడా, ఇండియా మధ్య గొడవేంటి..? ఖలిస్తాన్ కథేంది?

India Canada Row

India Canada Row

భారత్, కెనడాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కెనడాలో సిక్కు నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో అక్కడి భారత రాయబారి ప్రమేయం ఉందని ఆ దేశం ఆరోపించింది. ఇందుకు బలమైన ఆధారాలు సమర్పించాలని భారత్ కోరింది. ఇప్పటికే దానికి సంబంధించిన ఆధారాలన్నీ ఇచ్చేశామంటోంది కెనడా. అసలు కెనడాకు, ఇండియాకు మధ్య గ్యాప్ ఎందుకొచ్చిందనే విషయం తెలియాలంటే చరిత్రలోకి వెళ్లాలి..

భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దిగజారిపోయాయి. కెనడా దౌత్య సిబ్బందిని భారత్ బహిష్కరించింది. కెనడాలోని భారత సిబ్బందిని కూడా వెనక్కు రావాలని ఆదేశించింది. సిక్కు వేర్పాటువాది, ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడా మధ్య చిచ్చురేపింది. నిజ్జర్ హత్య కేసులో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మను అనుమానితుడిగా చేర్చింది కెనడా ప్రభుత్వం. ఆయన్ను విచారించాల్సి ఉందంటూ భారత విదేశాంగ శాఖకు సమాచారం ఇచ్చింది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజ్జర్ హత్యకేసులో తమ దౌత్యాధికారులను ఇరికించడంపై మోదీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలో విదేశాంగ శాఖ కెనడా దౌత్యవేత్తను పిలిపించుకుని నిరసన తెలిపింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే కెనడా హైకమిషనర్ తో పాటు ఆరుగురు దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరించింది. అక్టోబర్‌ 19వ అర్ధరాత్రిలోపు దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది. మరోవైపు కెనడాలో విధులు నిర్వర్తిస్తున్న భారత దౌత్యవేత్తతో పాటు ఇతర అధికారులు, సిబ్బందిని కూడా భారత్ వెనక్కు రావాలని కోరింది. సిక్కు వేర్పాటువాదానికి ట్రూడో సర్కార్ మద్దతునిస్తూ.. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.

నిజ్జర్ హత్య కేసులో భారత్ పై ఆరోపణలు చేయడం కెనడాకు కొత్తకాదు. నిజ్జర్ హత్యకు గురైనప్పటి నుంచి ఇలాంటి మాటలు మాట్లాడుతూనే ఉంది. ఆధారాలివ్వాలని భారత్ కోరుతుంటే.. తమ దగ్గరున్నవన్నీ ఇచ్చేశాంటోంది కెనడా. హర్దీప్ సింగ్ నిజ్జర్ 2023 జూన్ 18న కెనడాలో హత్యకు గురయ్యాడు. నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీంతో భారత్, కెనడా మధ్య అగ్గి రాజుకుంది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ట్రూడో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రూడూ మాటలపై కెనడా దౌత్యవేత్తను పిలిపించుకుని నిరసన తెలిపింది. కెనడాలోని భారత రాయబార కార్యాలయ అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడం తగదని స్పష్టం చేసింది. నిజ్జర్ హత్యలో భారత అధికారుల ప్రమేయానికి సంబంధించి ఏదైనా ఆధారాలుంటే ఇవ్వాలని గతేడాది సెప్టెంబర్ లోనే కెనడాను కోరింది మోదీ ప్రభుత్వం. కానీ కెనడా ప్రభుత్వం ఎలాంటి సాక్ష్యాధారాలూ ఇవ్వలేదు. దర్యాప్తు పూర్తి కాకుండానే భారత్ హైకమిషనర్ వర్మకు ఇందులో ప్రమేయం ఉందనేలా కెనడా మాట్లాడడం తగదని భారత ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అయితే ఈ కేసుకు సంబంధించి తాము ఆధారాలన్నీ ఇచ్చినట్లు కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్ వీలర్ చెప్తున్నారు. నిజ్జర్ హత్య కేసులో భారత్ ను దోషిగా చూపించే ప్రయత్నం వెనుక కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు రాజకీయ ప్రయోజనాలున్నాయి. ట్రూడో వైఖరి మొదటి నుంచి భారత్ కు వ్యతిరేకంగానే ఉంటోంది. వాస్తవానికి జస్టిన్ ట్రూడోకు భారత వ్యతిరేఖ వైఖరి ఆయన తండ్రి నుంచి అబ్బిందని చెప్పొచ్చు..!

జస్టిన్ ట్రూడో 2015లో కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. భారత్ లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న ఖలిస్తాన్ వర్గీయులకు ట్రూడో తన కేబినెట్ లో స్థానం కల్పించారు. సిక్కు వర్గీయులు ట్రూడో పార్టీకి గట్టి మద్దతుదారులుగా ఉన్నారు. అందుకే వాళ్లు ఏం చేసినా ట్రూడో వెనకేసుకొస్తున్నారు. ఇలా వెనకేసుకు రావడాన్ని భారత్ పలు సందర్భాల్లో తప్పుబట్టింది. జస్టిన్ ట్రూడో తండ్రి పిరె ఇలియట్ ట్రూడో కూడా భారత్ తో ఇలాంటి వైఖరే ప్రదర్శించేవారు. 1985 జూన్ 23న భారత్ కు చెందిన కనిష్క విమానం టొరంటో నుంచి లండన్ కు బయలుదేరింది. దాన్ని మార్గమధ్యంలోనే ఖలిస్తాన్ ఉగ్రవాదులు పేల్చేశారు. ఈ ఘటనలో 329 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కెనడాలో తలదాచుకున్న ఖలిస్తాన్ ఉగ్రవాది తల్వీందర్ సింగ్ పర్మార్ ఈ ఘటనకు బాధ్యుడని విచారణలో తేలింది. దీంతో పర్మార్ ను తమకు అప్పగించాలని భారత్ కోరింది. కానీ అప్పుడు అధికారంలో ఉన్న ప్రస్తుత ట్రూడో తండ్రి పిరె ట్రోడో పట్టించుకోలేదు. పైగా పర్మార్ సహా అప్పటికే అరెస్ట్ అయిన 15 మందిని నిర్దోషులుగా విడిచిపెట్టారు. దీన్ని బట్టి తండ్రీకొడుకులిద్దరూ మొదటి నుంచి భారత్ వ్యతిరేక వైఖరితోనే ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. ఖలిస్తాన్ ఉగ్రవాదులు వాళ్ల పార్టీకి బలమైన మద్దతుదారులుగా ఉండడమే ఇందుకు కారణం.

అసలు ఖలిస్తాన్ ఉగ్రవాదులంటే ఎవరు..? వాళ్లకు భారత్ తో వైరం ఎక్కడ మొదలైంది..? ఎందుకు వాళ్లంతా భారత్ పై యుద్ధం ప్రకటించారు..? లాంటి విషయాలు ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి. బ్రిటీష్ వాళ్లు మన దేశాన్ని దాదాపు రెండు శతాబ్దాలపాటు పరిపాలించారనే సంగతి తెలిసిందే. ఆ సమయంలో బ్రిటన్ తరపున మన దేశ సైనికులు ప్రపంచంలోని పలు ప్రాంతాలకు వెళ్లారు. అలా చాలా మంది సిక్కులు పంజాబ్ నుంచి వెళ్లి కెనడాలో స్థిరపడ్డారు. అక్కడ ఇమ్మిగ్రేషన్ చట్టాలు కూడా ఇందుకు ఒక కారణం. అలా భారత్ నుంచి కెనడాకు పెద్ద ఎత్తున వలసలు కొనసాగాయి. మన దేశ స్వాతంత్ర్య సమయంలో తమకు ప్రత్యేక సిక్కు దేశం – ఖలిస్తాన్ కావాలని.. సిక్కులు ఉద్యమించారు. వారిపై భారత ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. 1984లో సిక్కు అల్లర్ల తర్వాత మరింతమంది సిక్కులు కెనడాకు వలసవెళ్లారు. అక్కడ మంచి పట్టు సాధించారు. అక్కడి నుంచే భారత్ లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కనిష్క విమానాన్ని పేల్చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తల్వీందర్ సింగ్ పర్మార్ కూడా పంజాబ్ లో ఇద్దరు పోలీస్ అధికారులను కాల్చేసి కెనడా వెళ్లి తలదాచుకున్నారు. తమ భూభాగంపై కుట్రలు చేస్తున్న ఖలిస్తాన్ ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా కెనడా పట్టించుకోవట్లేదు.

ఖలిస్తాన్ ఉగ్రవాదులపై చర్యలు తీసుకోకపోవడానికి కెనడా ఏమాత్రం సిద్ధంగా లేదు. ఇందుకు అనేక కారణాలను సాకుగా చూపిస్తోంది ఆ దేశ ప్రభుత్వం. బ్రిటీషర్లు పాలించిన దేశాలన్నింటినీ కామన్వెల్త్ దేశాలుగా గుర్తిస్తారనే సంగతి తెలిసిందే. కామన్వెల్త్ దేశాలన్నీ ఎలిజబెత్ రాణిని తమ అధినేతగా భావిస్తాయి. కానీ భారత్ మాత్రం ఎలిజిబెత్ రాణిని అధినేతగా గుర్తించట్లేదు. ఇది కెనడాకు ఏమాత్రం నచ్చట్లేదు. ఎలిజిబెత్ రాణిని భారత్ అధినేతగా గుర్తించట్లేదు కాబట్టి కామన్వెల్త్ దేశాలకు వర్తించే నేరగాళ్ల అప్పగింతల ఒప్పందం వర్తించదని వాదిస్తోంది కెనడా. దీంతో రెండు దేశాల మధ్య పీటముడి నెలకొంది. పైగా ఖలిస్తాన్ ఉగ్రవాదులు కెనడాలో శక్తివంతులుగా ఉన్నారు. ఆ దేశ రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. సిక్కుల మద్దతుతో న్యూ డెమొక్రటిక్ పార్టీ పెట్టిన జగ్మీత్ సింగ్.. ట్రూడో ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నారు. దీంతో వారిపై చర్యలు తీసుకునేందుకు కెనడా ప్రభుత్వం సిద్ధంగా లేదు. పైగా వాళ్లకు పూర్తి మద్దతుగా ఉంటోంది.

దశాబ్దాలుగా కెనడా, భారత్ మధ్య ఖలిస్తాన్ చిచ్చుపెడుతూనే ఉంది. తాజాగా నిజ్జర్ హత్య మరోసారి ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చింది. అసలు ఈ నిజ్జర్ ఎవరు..? ఎలా హత్యకు గురయ్యాడు..? 2023 జూన్ 18న హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలోని సర్రే నగరంలో హత్యకు గురయ్యాడు. ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు నిజ్జర్ ను కాల్చి చంపారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ సిక్కు వేర్పాటువాదిగా పేరొందారు. నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ గా ఉండేవారు. గురునానక్ సిక్ గురుద్వారా సాహిబ్ అధిపతిగా కూడా పనిచేశారు. పంజాబ్ జలంధర్ ప్రాంతంలోని బార్సింగ్ పూర్ లో 1977లో నిజ్జర్ జన్మించాడు. 1997లో తప్పుడు పాస్ పోర్టుతో కెనడాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అమెరికాలో నెలకొల్పిన జస్టిస్ ఫర్ సిఖ్స్ సంస్థలో క్రియాశీలకంగా పని చేశారు. పంజాబ్ లో పలు హత్యలకు కుట్రపన్నాడనే కారణంతో నిజ్జర్ ను 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది భారత ప్రభుత్వం. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చి 10 లక్షల రివార్డు ప్రకటించింది. భారత్ లోని అతని ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంది. అయితే నిజ్జర్ కెనడాలోనే హత్యకు గురయ్యాడు. ఇతడిని భారత ప్రభుత్వ ఏజెంట్లే చంపారనేది కెనడా ఆరోపణ. అయితే పాక్ ఏజెంట్లు నిజ్జర్ ను చంపి .. ఆ నెపాన్ని భారత్ పై మోపి ఉండొచ్చని అప్పట్లో అంతర్జాతీయ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. నిజ్జర్ హత్యకు గురై ఏడాది పూర్తయిన సందర్భంగా కెనడా పార్లమెంటులో ఎంపీలు నివాళులు అర్పించారు. దీన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇంటర్ పోల్ జాబితాలో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న వ్యక్తికి ఏకంగా పార్లమెంటులోనే నివాళి అర్పించడమేంటని ప్రశ్నించింది.

ఈ పరిణామాలన్నీ చూస్తే ఖలిస్తాన్ ఉగ్రవాదులకు కెనడా ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తోందో అర్థం చేసుకోవచ్చు. కెనడాలో సిక్కులు అక్కడి పార్టీలకు ఓటుబ్యాంకుగా ఉన్నారు. దీంతో వాళ్లపై చర్యలు తీసుకునేందుకు కెనడా పాలకులు ఏమాత్రం సిద్ధంగా లేరు. పైగా వాళ్ల మెప్పు పొందేందుకు భారత ప్రభుత్వాన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి.