బెట్టింగ్ ప్రచారం చేసినోళ్లకు జేబులు నిండిపోతున్నాయి. ఆడినోళ్ల జేబులు గుల్ల అవుతున్నాయి. అప్పులు చేసి బెట్టింగ్ ఆడిన వారంతా…డబ్బు పొగొట్టుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీరి మరణాలకు నటులు, ఇన్‌ఫ్లూయెన్సర్ల కారణం కాదా ? వీరిని ఎందుకు అరెస్టు చేయరు ? ఆస్తులను ఎందుకు జప్తు చేసుకోరు ? వీరిపై పోలీసులకు ఎందుకింత సాఫ్ట్ కార్నర్…ఇదే ఇవాళ్టీ స్పెషల్ ఫోకస్.
సెలబ్రెటీలు ఏమైనా చేయవచ్చా ? బెట్టింగ్ యాప్‌లు ప్రచారం చేసి…జనం ప్రాణాలు తీయోచ్చా ? హీరోలు, సెలబ్రెటీలు ఏం చేసినా…కరెక్టేనా ? సినిమా పైరసీ చేస్తే…అరెస్టు చేస్తారు ? మరి…బెట్టింగ్ యాప్ ప్రచారం చేసిన వారిని అరెస్టు చేయరా ? అమాయకుల ప్రాణాలు పోయినా…ప్రభుత్వాలకు పట్టవా ? కాయ్ రాజా.. కాయ్.. వంద పెట్టండి వెయ్యి గెలుచుకెళ్లండి. ఒకప్పుడు ఎక్కడో సందుగొందుల్లో గుట్టుగా జరిగే ఈ బెట్టింగ్ వ్యవహారం.. ఇప్పుడు పలు యూట్యూబ్ ఛానళ్లు, వెబ్‌సైట్ల ద్వారానే కాకుండా మొబైల్ యాప్‌ల రూపంలోనూ అమాయకుల జేబులు కొడుతున్నాయి. ఆన్‌లైన్‌లో తారసపడుతూ వస్తున్న ప్రకటనలు క్షణాల వ్యవధిలో బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నాయి. బెట్టింగ్‌ల మోజులో పడి కొందరు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకుంటుంటే.. నష్టపోయిన మరికొందరు యువకులు.. అడ్డదారులు తొక్కుతూ మోసాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఈ తరహా మోసాలు సామాన్య ప్రజలను కలవర పెడుతున్నాయి.
బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసినోళ్లంతా…లక్షలు, కోట్లు వేనకేసుకుంటున్నారు. లగ్జరీ లైఫ్‌ను అనుభవిస్తున్నారు. సమాజంతో దర్జాగా తిరుగుతున్నారు. జనంలో సెలబ్రెటీలుగా చలామణి అవుతున్నారు. మళ్లీ మళ్లీ బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తున్నారు. ఒకటి…రెండు…మూడు…బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తూనే ఉన్నారు. సెలబ్రెటీలు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయోన్సర్ల మాటలు విని…విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆఖరుకు ఖాకీలు కూడా…ఆన్‌లైన్ బెట్టింగ్‌కు ఆడారు…ప్రస్తుతం ఆడుతున్నారు కూడా. వేలు, లక్షలు పోగొట్టుకున్నారు. నిండు జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. కొందరు అప్పులు తీసుకొని ఆడుతున్నారు…ఇంకొందరు బ్యాంక్‌ల్లో లోన్స్ పెట్టి…బెట్టింగ్‌కు ఆడేస్తున్నారు. వాళ్లు వీళ్లు అని తేడా లేదు. కాలేజీ స్టూడెంట్ నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దాకా…బెట్టింగ్‌కు బానిసలుగా మారిపోతున్నారు.
నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు అన్నట్లు సెలబ్రెటీలు, క్రికెటర్లు, ఇన్‌ఫ్లూయోన్సర్లు వ్యవహరిస్తున్నారు. సినిమా నటులు, క్రీడాకారులు, ఇన్‌ఫ్లూయోన్సర్లు…కాసుల కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. ఎవరు ఎలా పోతే ఏంటి ? మాకు కావాల్సిందే డబ్బే…అంతేకాని ప్రజలు అక్కర్లేదనేలా సెలబ్రెటీలు వ్యవహరిస్తున్నారు. కళ్ల ముందు బెట్టింగ్‌కు ఎంతో మంది బలవుతున్నా…సెలబ్రెటీలు మాత్రం పట్టించుకోవడం లేదు. శవాల మీద పైసలు ఏరుకున్నట్లు…బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి…కోట్లు వేనకేసుకుంటున్నారు. ఆదర్శంగా ఉండాల్సిన క్రీడాకారులు, సినిమా నటులు, సెలబ్రెటీలు, ఇన్‌ఫ్లూయోన్సర్లు…నోట్ల వేటలో మునిగి తేలుతున్నారు. వాళ్లు వీళ్లు అని తేడా ఏం లేదు. అందరూ ఆ తాను ముక్కలే. పైసల కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారు. సమాజం గురించి ఆలోచించకుండా…స్వలాభం ధ్వేయంగా బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తున్నారు.
ఎంతసేపూ కాల్షీట్, రెమ్యూనరేషన్ సంగతే చూసుకుంటున్నారు కానీ.. ఓ సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయోన్సర్లుగా తాము చేసే ప్రకటన ప్రభావం అభిమానులపై తీవ్రంగా ఉంటుందని ఆలోచించడం లేదు. మా డబ్బులు మా కొస్తే అంతే చాలు.. ఎవరేమైపోతే మాకేం అన్నట్టుగా ఉంటోంది వీరి తీరు. ఇన్‌ఫ్లూయోన్సర్ల సంపాదనకేం తక్కువ లేదు. ఇప్పటికే రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయినా సరే కాసుల కోసం కక్కుర్తి పడి.. అనైతికంగా బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా కోట్ల మందిని తప్పుదోవ పట్టించే బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తూ.. అందుకు భారీగా రెమ్యూనరేషన్లు తీసుకునే సెలబ్రిటీలకు…సామాన్యుల ఆత్మహత్యల్లో…నిర్వాహకులతో సమానంగా బాధ్యత లేకుండా ఎలా ఉంటుందనే ప్రశ్నలు వస్తున్నాయి.
బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పొగొట్టుకున్న వారిలో…అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొందరు దొంగలుగా మారిపోయారు. మరికొందరు హత్యలు చేస్తున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడటానికి…మరెన్నో కుటుంబాలు నాశనం కావడానికి…అమయాకులు హంతకులుగా మారడానికి…సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, సెలబ్రెటీలు కారణం కాదా ? వీరు బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేయడం వల్లే అమయాకులు…అట్రాక్ట్ అయ్యారు. హీరోలు, హీరోయిన్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయోన్సర్లు ప్రచారమే చేయకపోతే…ఇన్ని బెట్టింగ్ యాప్స్ ఉన్నాయన్న విషయం ప్రజలకు తెలిసేది కాదు…వారు బెట్టింగ్ యాప్‌ల్లో డబ్బు పోగొట్టుకునేవారు కాదు.
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. మొత్తం రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇటీవల ఈకేసులో రైనా, ధావన్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ‘1xBet’ అనే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఈ అక్రమ బెట్టింగ్ యాప్‌లు అనేక మందిని లూటీ చేసినట్లు దర్యాప్తు సంస్థ విచారణలో తేలింది. పెట్టుబడిదారులు మోసం చేసి రూ.కోట్లు పన్నులు ఎగవేసినట్లు వెల్లడైంది. అందుకే గతంలోనే ఈ ఇద్దరికీ ఆడీ సమన్లు జారీ చేసి, విచారించింది. తాజాగా ఈ ఇద్దరికి చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.
అక్రమ బెట్టింగ్ యాప్ 1xBetకు…శిఖర్ ధావన్ ప్రమోషన్స్ చేస్తూనే భాగస్వామిగా ఉన్నాడని ఈడీ అనుమానిస్తోంది. ఈ బెట్టింగ్ యాప్‌తో ధావన్‌కు ఏం సంబంధం అనే కోణంలో విచారణ చేపట్టింది. ఇందులో భాగంగానే గత సెప్టెంబర్‌లో ఈడీ విచారించి, వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది. అటు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశాడన్న అభియోగాలపై రైనాను కూడా ఇప్పటికే 8 గంటలకు పైగా విచారించింది. అతడికి కూడా బెట్టింగ్ యాప్స్‌లో షేర్ ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే కేసు విషయంలో మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్పలకు నోటీసులు ఇచ్చింది.
ఈ నలుగురు మాజీ ఆటగాళ్లు ‘1xBet’ అనే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ అక్రమ బెట్టింగ్ యాప్‌లు అనేకమందిని లూటీ చేసినట్లు దర్యాప్తు సంస్థ విచారణలో తేలింది. పెట్టుబడిదారులు మోసం చేసి రూ.కోట్లు పన్నులు ఎగవేసినట్లు వెల్లడైంది. గత 18ఏళ్లుగా ఈ కంపెనీ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వివిధ స్పోర్ట్స్ ఈవెంట్లపై బెట్టింగ్ వేస్తే భారీ మొత్తం గెలుచుకోవచ్చని ఆశ చూపిస్తోంది. ఈ ఆటగాళ్ల నుంచి యాప్‌కు సంబంధించిన లావాదేవీలు, ఆర్థిక కార్యకలాపాల గురించి ఈడీ సమాచారాన్ని సేకరించింది. ప్రస్తుతానికైతే ఈ ఇద్దరూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ యాప్ 70 భాషల్లో ఉండటం చూసి…దర్యాప్తు అధికారులే విస్తుపోతున్నారు. అయితే ప్రస్తుతం ఈడీ దర్యాప్తు ప్రారంభ దశలో ఉంది. ఈ అక్రమ యాప్ ప్రమోషన్‌లో లేదా మరేదైనా విధంగానైనా ఆటగాళ్ల పేర్లు లేదా ఫొటోలను ఉపయోగించారా అనే దానిపై ఏజెన్సీ దృష్టి పెట్టింది.
సమాజంలో సెలబ్రెటీలుగా చలామణి అవుతున్న వారికి…కొంచెమైనా బాధ్యత ఉండక్కర్లేదా ? కోట్లు కూడబెట్టడానికి కంత్రీ పనులు చేస్తారా ? డబ్బులిస్తే మాత్రం…బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తారా ? అన్న విమర్శలు వస్తున్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తున్న సెలబ్రెటీలకు బుద్ది చెప్పాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. మంచిని ప్రచారం చేయాల్సిన సెలబ్రెటీలు…బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేయడాన్ని తప్పుపడుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్ ఆడండి…కోట్లు సంపాదించండి అంటూ క్యాంపెయిన్ చేయడం ఎంత వరకు సమజసమని బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. సమాజానికి మంచి చేయాల్సిన సెలబ్రెటీలు…నలుగుర్ని సన్మార్గంలో నడిపించాల్సిన క్రీడాకారులు…ఆదర్శంగా ఉండాల్సిన నటులే…డబ్బు కోసం ఎంతకైనా దిగుజారుతారా అని విమర్శిస్తున్నారు.
క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్‌ధావన్‌పై హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానాన్ని సొమ్ము చేసుకునే క్రికెటర్లు…ఆదర్శం ఎలా అవుతారని ప్రశ్నించారు. బెట్టింగ్ మహమ్మారికి ఎందరో యువకులు బలవుతున్నారంటూ కొన్ని రోజుల క్రితం ట్వీట్ చేశారు. అమాయకుల జీవితాలను నాశనం చేసుకుంటున్నారని…వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. సమాజాన్ని ఛిద్రం చేస్తోన్న బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన సెలబ్రెటీలు…వీటన్నింటికీ బాధ్యులు కారా..? సమాజ మేలు కోసం, యువత ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి నాలుగు మంచి మాటలు చెప్పాలని సజ్జనార్ సూచించారు.