Death Tax in America Explained: అమెరికా…! ఇండియాలో ఎన్నో కుటుంబాల కలల దేశం.. డాలర్ల దేశం.. తమ భవిష్యత్తు అని భారతీయులు భావించే దేశం.. కానీ ఇప్పుడు అదే అమెరికా… చనిపోయిన తర్వాత కూడా భారతీయుల డబ్బును గుంజుకుంటోంది. బతికున్నప్పుడు సంపాదించిన సంపద… మరణం తర్వాత పిల్లలకు పూర్తిగా చేరకముందే… కోట్ల రూపాయలు పన్నుల రూపంలో కరిగిపోతున్నాయనే ఆవేదన ఇండో-అమెరికన్ కుటుంబాల్లో కనిపిస్తోంది.

అమెరికాలో డబ్బు పెట్టిన భారతీయ ధనిక కుటుంబాల్లో కొత్త భయం మొదలైంది. మన పిల్లలకు నిజంగా ఎంత మిగులుతుందనే ఆలోచనలతో అక్కడి ప్రజలు టెన్షన్ పడుతున్నారు. దీనికి ప్రధాన కారణంగా డెత్ ట్యాక్స్ కనిపిస్తోంది. ఇంతకీ ఏంటి డెత్ ట్యాక్స్? ఈ విధానంతో ఇండియన్స్‌కు వచ్చిన ఇబ్బందులేంటి?
ఇటీవల కాలంలో భారతీయులు అమెరికా కంపెనీల్లో పెట్టుబడులు భారీగా పెడుతున్నారు. ముఖ్యంగా యాపిల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, అమెజాన్, టెస్లా లాంటి కంపెనీల షేర్లు కొనుగోలు చేస్తున్నారు.
RBI లెక్కలు ఏం చెబుతున్నాయి?
భారత రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం విదేశీ పెట్టుబడుల కోసం భారతీయులు పంపుతున్న డబ్బు గత కొన్ని సంవత్సరాల్లో వేగంగా పెరిగింది. లిబరలైజ్డ్ రెమిటెన్స్ పథకం కింద 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతీయులు విదేశాలకు పంపిన మొత్తం 31 బిలియన్ డాలర్లకు పైగా చేరింది. అంటే దాదాపు 3వేల కోట్ల రూపాయలన్నమాట. ఇందులో పెద్ద భాగం విదేశీ షేర్లు, విదేశీ ఆస్తులు, పిల్లల చదువుల కోసం వెళ్తోంది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. అమెరికాలో ఒక ప్రత్యేక పన్ను విధానం ఉంది. దాన్ని అక్కడ ఎస్టేట్ పన్ను లేదా డెత్ ట్యాక్స్ అంటారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని పేరులో ఉన్న ఆస్తులను పిల్లలకు లేదా కుటుంబ సభ్యులకు బదిలీ చేసే సమయంలో అమెరికా ప్రభుత్వం పన్ను వసూలు చేస్తుంది.
అమెరికా పౌరులకు ఈ పన్నులో భారీ మినహాయింపులు ఉంటాయి. కానీ భారతీయుల లాంటి విదేశీయులకు మాత్రం చాలా తక్కువ మినహాయింపు మాత్రమే ఉంటుంది. అమెరికా పన్ను శాఖ వివరాల ప్రకారం.. విదేశీయులకు కేవలం 60 వేల డాలర్ల వరకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. అంటే దాదాపు 50 లక్షల రూపాయల కంటే ఎక్కువ అమెరికా ఆస్తులు ఉంటే.. మిగతా మొత్తంపై 40 శాతం వరకు పన్ను పడే అవకాశం ఉంటుంది.
ఏకంగా 40శాతం వరకు ట్యాక్స్:
ఉదాహరణకు అమెరికాలో నివసిస్తున్న ఒక భారతీయు తండ్రి అమెరికా షేర్లలో 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిందనుకుందాం. ఆ తర్వాత అతను అకస్మాత్తుగా చనిపోతే.. ఆ డబ్బు అతని కుమారుడికి లేదా కుమార్తెకు వెళ్లాలి. కానీ అమెరికా చట్టం అక్కడే ఎంట్రీ ఇస్తుంది. 10 కోట్ల రూపాయలలో మొదటి 50 లక్షలు మాత్రమే పన్ను మినహాయింపులోకి వస్తాయి. మిగిలిన దాదాపు 9.5 కోట్ల రూపాయలపై అమెరికా ప్రభుత్వం గరిష్టంగా 40 శాతం వరకు పన్ను వేయొచ్చు. అంటే 9 కోట్ల 50 లక్షల రూపాయల్లో సుమారు 3 కోట్ల 80లక్షల రూపాయలు పన్నుల రూపంలో వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే ఒక కుటుంబం జీవితాంతం కష్టపడి కూడబెట్టిన 10 కోట్లలో.. వారి పిల్లల చేతికి వచ్చేది దాదాపు 6 కోట్ల రూపాయలే కావచ్చు. మిగిలిన 4 కోట్లు అమెరికా పన్నుల్లో కరిగిపోయే అవకాశం ఉంటుంది.
నిజానికి ఇప్పుడు భారతీయుల సంపద విధానం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఎక్కువగా బంగారం, భూములు, ఇళ్లు కొనేవారు. ఇప్పుడు విదేశీ షేర్లు కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, స్టార్టప్ వ్యాపారులు, ధనిక వ్యాపార కుటుంబాలు అమెరికా మార్కెట్లలో భారీగా డబ్బు పెడుతున్నారు.
అమెరికాలో ఉద్యోగాలు చేసే భారతీయులకు కంపెనీలు జీతంతో పాటు షేర్లు కూడా ఇస్తున్నాయి. ఇవి సంవత్సరాల తర్వాత కోట్ల విలువకు చేరుతున్నాయి. ఇదే సమయంలో చాలా కుటుంబాలు తమ పిల్లలను అమెరికాకు చదువుల కోసం పంపుతున్నాయి. అక్కడే ఉద్యోగాలు సంపాదించాలని కోరుకుంటున్నాయి. అమెరికా వలస లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం లక్షలాది భారతీయ విద్యార్థులు అమెరికాకు వెళ్తున్నారు.
2023లో అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 2 లక్షల 60వేలను దాటింది. ఇదే సమయంలో అమెరికాలో నివసించే భారతీయుల సంపద కూడా భారీగా పెరుగుతోంది. కానీ ఇక్కడ ఒక చట్టపరమైన చిక్కు ఉంది. ఇండియా నుంచి విదేశాలకు డబ్బు పంపేందుకు రిజర్వ్ బ్యాంక్ ‘లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్’ అనే విధానం పెట్టింది. దీని కింద ఒక వ్యక్తి ఏడాదికి 2.5 లక్షల డాలర్ల వరకు విదేశాలకు పంపొచ్చు. చాలామంది ఈ డబ్బుతో అమెరికా షేర్లు కొంటున్నారు. కానీ తర్వాత ఆ షేర్లను విదేశాల్లో ఉన్న పిల్లలకు ఇవ్వాలంటే నిబంధనలు నరకం చూపిస్తున్నాయి.
ఎందుకంటే కుటుంబం సంపాదించిన డబ్బులో పెద్ద భాగం అమెరికా ప్రభుత్వానికి వెళ్లిపోతున్నాయి. దీంతో ఇప్పుడు ధనిక కుటుంబాలు కొత్త మార్గాలు వెతుకుతున్నాయి. కొందరు విదేశీ ట్రస్టులు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.
మరికొందరు బీమా పథకాల ద్వారా భవిష్యత్తు పన్ను భారాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు. ఇంకొందరు పిల్లలు విదేశాలకు వెళ్లకముందే వారి పేర్లకు ఆస్తులు మార్చాలని ఆలోచిస్తున్నారు. కానీ ఇవన్నీ సాధారణ కుటుంబాలకు అర్థమయ్యే విషయాలు కాదు. చట్టాలు చాలా మందికి అర్థంకాని విధంగా ఉన్నాయి. భారత విదేశీ మారక నిబంధనలు, అమెరికా పన్ను చట్టాలు రెండూ కలిసిపోవడంతో పరిస్థితి ఇంకా గందరగోళంగా మారుతోంది. ఇక్కడ మరో విషయం గురించి కూడా చర్చించుకోవాలి.
ఇప్పుడు చాలా ధనిక కుటుంబాలు అమెరికా గ్రీన్ కార్డు కోసం ‘ఈబీ-5’ అనే పెట్టుబడి మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. ఇందులో అమెరికాలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే అక్కడ శాశ్వత నివాసానికి అవకాశం ఉంటుంది. దీంతో కొందరు తమ విదేశీ షేర్లు అమ్మి పిల్లల పేర్లతో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నారు. కానీ దీనిపైనా స్పష్టత లేకపోవడంతో భయం పెరుగుతోంది. అందుకే చివరి నిమిషంలో చేసే ప్లాన్లు ప్రమాదకరమని ప్రతి ఒక్కరు అర్థంచేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మారిపోయింది.
పిల్లల చదువు ఒక దేశంలో, ఉద్యోగం మరో దేశంలో, పెట్టుబడులు ఇంకో దేశంలో, బ్యాంకు ఖాతాలు మరోచోట ఉంటున్నాయి. దీంతో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ సంపదపై ఏ దేశానికి హక్కు ఉంటుందన్నది చాలా పెద్ద ప్రశ్నగా మారుతోంది.
అందుకే విదేశాల్లో డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు.. ఆ డబ్బు తర్వాతి తరానికి సురక్షితంగా చేరేలా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. లేదంటే తల్లిదండ్రులు జీవితాంతం కష్టపడి కూడబెట్టిన సంపద.. పిల్లల చేతికి పూర్తిగా చేరకముందే పన్నుల మంటల్లో దహనమయ్యే ప్రమాదం ఉంది.
