నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2′ (అఖండ తాండవం) సినిమా రిలీజ్ విషయంలో ఏర్పడిన గందరగోళం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. డిసెంబర్ 5న రావాల్సిన సినిమా అనూహ్యంగా వాయిదా పడటం, దాని వెనుక ఉన్న భారీ ఆర్థిక సమస్యలు ఇప్పుడు సంచలన విషయాలుగా బయటపడుతున్నాయి. అఖండ 2’ ఇప్పట్లో రిలీజ్ కావడం కష్టమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత డిసెంబర్ 12న లేదంటే 25న వస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ, చూస్తుంటే అంత త్వరగా ఆర్థిక ఇబ్బందుల నుంచి సినిమా బైటపడలేదని తెలుస్తోంది. నిర్మాణ సంస్థ సినిమాను విడుదల చేయాలంటే, ఈరోస్ (Eros) సంస్థకు సుమారు ₹35 కోట్లు, స్థానికంగా ఉన్న బకాయిలు ₹25 కోట్లు చెల్లిస్తేనే సినిమాను విడుదల చేయడానికి అనుమతి లభిస్తుంది. ఇంత భారీ మొత్తం చెల్లించడం ఇప్పట్లో కష్టమేనని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. దీంతో, ‘అఖండ 2’ను ఆ శివుడే రక్షించాలా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Also Read :Ustaad Bhagat Singh: ‘దేఖ్ లేంగే సాలా’ అంటున్న పవన్
నిర్మాతలు ఈ ఆర్థిక ఇబ్బందులను బాలకృష్ణకు తెలియకుండా జాగ్రత్తపడినట్లు సమాచారం. అంతేకాక, సినిమా ప్రమోషన్స్ కోసం బాలకృష్ణను ఇండియా మొత్తం తిప్పించారు. అయితే, చివరి నిమిషంలో సినిమా ఆగిపోవడంతో బాలకృష్ణ తీవ్ర అవమానంగా ఫీలయ్యారు. దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో బాలయ్యకు ఇంతటి బిగ్ షాక్ ఇచ్చిన నిర్మాతలుగా వీరు నిలిచారు. పాత బకాయిలతో పాటు, ‘అఖండ 2’ భారీ బడ్జెట్ కూడా సినిమాను ముంచేసిందని సమాచారం. బాలకృష్ణ డేట్స్ వ్యవహారాలను ఆయన చిన్న కూతురు తేజస్విని చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ డేట్స్ ఇచ్చినందుకు గాను కూతురుకు 10% వాటా దక్కినట్లు సమాచారం. ఈ సినిమా కోసం బాలకృష్ణ రెమ్యునరేషన్ ₹40 కోట్లు, దర్శకుడు బోయపాటి శ్రీను రెమ్యునరేషన్ ₹30 కోట్లు, థమన్ కి 10 కోట్లు సహా మేకింగ్ కోసం 100 కోట్లు ఉన్నట్టుగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఈ భారీ బడ్జెట్, రెమ్యునరేషన్, అంతకుమించిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా ‘అఖండ 2’ రిలీజ్ ఇప్పట్లో జరిగే అవకాశం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాలకృష్ణ వ్యక్తిగతంగా రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకపోతే సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు సినిమాని 12న రిలీజ్ చేయడానికి సర్వ శక్తులు ఒడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్.