2026 సంవత్సరం మొదలైనప్పుడు చాలామందికి అది ఒక సాధారణ న్యూఇయర్ లాగానే అనిపించింది. క్యాలెండర్ మారింది.. రోజులు మారాయి.. కాలం ముందుకు సాగుతోందనిపించింది. కానీ కొంతకాలం తర్వాత ఒక విచిత్రమైన విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చింది. 2026 క్యాలెండర్‌ను జాగ్రత్తగా చూసిన కొంతమంది ఒక అసాధారణమైన సత్యాన్ని గమనించారు. ఈ ఏడాది క్యాలెండర్ నిర్మాణం పూర్తిగా మరో ఏడాదితో సరిపోతుంది. అది సాధారణమైన ఏడాది కాదు. అది 1914.
చరిత్రలో ఒక భయంకరమైన మలుపు తీసుకున్న సంవత్సరం. ప్రపంచం మొదటిసారి మహాయుద్ధంలోకి జారిపోయిన సంవత్సరం. లక్షల కాదు.. కోట్లాది ప్రాణాలు కోల్పోయిన యుద్ధానికి ప్రారంభమైన సంవత్సరం. ఇప్పుడు అదే తేదీలు.. అదే వారాలు.. అదే రోజులు మళ్లీ 2026లో కనిపించడం చాలా మందిలో ఒక వింత భయాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ రాజకీయాల్లో పెరుగుతున్న అస్థిరత మధ్య ఈ పోలిక మరింత భయంకరంగా అనిపిస్తోంది. ఇంతకీ 1914లో ప్రపంచాన్ని యుద్ధంలోకి నెట్టిన ఘటనలేంటి? ఇప్పుడు జరుగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలతో ఈ పోలిక ఎందుకు మళ్లీ చర్చకు వచ్చింది?
1914, 2026 ఈ రెండూ లీప్ ఇయర్లు కావు. అంతేకాదు ఈ రెండు సంవత్సరాలు కూడా గురువారం రోజుతోనే ప్రారంభమయ్యాయి. అందుకే ఈ రెండు సంవత్సరాల్లో ప్రతి తేదీ అదే వారంలో అదే రోజుకు మ్యాచ్ అవుతుంది. గ్రిగోరియన్ క్యాలెండర్ సిస్టమ్‌లో ఇది ఒక గణిత సంబంధమైన కోఇన్సిడెన్స్ మాత్రమే. కానీ 1914 లాంటి చారిత్రక సంవత్సరంతో ఈ పోలిక ఉండటమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు కారణమైంది.
1914 , జూన్ 28న ఆస్ట్రియా-హంగేరీ రాజవంశానికి చెందిన ఫెర్డినాండ్‌ను యంగ్ బోస్నియా సభ్యుడు, 19 ఏళ్ల ప్రిన్సిప్ హత్య చేశాడు. మొదట అది ఒక ప్రాంతీయ రాజకీయ ఘటనలా కనిపించింది. కానీ ఆ ఒక్క ఘటన యూరప్ దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను ఒక్కసారిగా పేల్చింది. కొన్ని రోజుల్లోనే దేశాలు ఒకదానిపై ఒకటి యుద్ధ ప్రకటనలు చేశాయి. మిత్రపక్షాలు, ప్రతిపక్షాలు అంటూ ప్రపంచ శక్తులు యుద్ధంలోకి వచ్చాయి. అలా ప్రారంభమైన ఘర్షణే తరువాత ప్రపంచాన్ని కంపించిన మొదటి ప్రపంచ యుద్ధంగా మారింది. ఆ యుద్ధం దాదాపు నాలుగు సంవత్సరాలు కొనసాగింది. యూరప్ మాత్రమే కాదు ప్రపంచంలోని అనేక దేశాలు ఆ యుద్ధంలో భాగమయ్యాయి.
చరిత్రకారుల అంచనాల ప్రకారం ఆ యుద్ధంలో సుమారు రెండు కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది మంది గాయపడ్డారు. నగరాలు నాశనమయ్యాయి. ప్రపంచ రాజకీయ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. అందుకే 1914 సంవత్సరం అనే పేరు వినగానే చరిత్రలో ఒక భారీ విషాదం గుర్తుకు వస్తుంది. ఇప్పుడీ పోలిక చర్చకు రావడానికి ప్రస్తుత ప్రపంచ పరిస్థితులే కారణం.
మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పటికే అంతర్జాతీయ ఆందోళనకు కారణమయ్యాయి. అమెరికా కూడా ఈ పరిణామాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచ రాజకీయాల్లో పెరుగుతున్న అస్థిరత, సైనిక కదలికలు, పరస్పర హెచ్చరికలు లాంటి పరిణామాల మధ్య 2026 క్యాలెండర్ 1914ను గుర్తు చేయడం కొంతమందిలో భయాన్ని రేపుతోంది. సోషల్ మీడియాలో ఈ రెండు సంవత్సరాల క్యాలెండర్లను పోల్చుతూ అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే క్యాలెండర్‌లో ఇలాంటి పోలికలు గణితపరమైన కారణాల వల్ల కనిపిస్తాయి. అందుకే ఇది భవిష్యత్తులో ఏదైనా యుద్ధం జరుగుతుందని చెప్పే సూచన కాదు. నిజానికి ఇలాంటి చర్చలు గతంలో కూడా కనిపించాయి. 2025 క్యాలెండర్ 1941 క్యాలెండర్‌తో పూర్తిగా సరిపోతుందని గత సంవత్సరం సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. 1941 అంటే రెండో ప్రపంచ యుద్ధం మరింత విస్తరించిన కాలం. అప్పట్లో కూడా చాలామంది చరిత్ర మళ్లీ రిపీట్ అవుతుందా అని ప్రశ్నించారు. కానీ ఆ తర్వాత అలాంటి పెద్ద విపత్తు ఏదీ జరగలేదు.
అందుకే చరిత్రను నిర్ణయించేది క్యాలెండర్‌లోని తేదీలు కావు. ఆ తేదీల్లో తీసుకునే నిర్ణయాలే ప్రపంచ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. 2026 క్యాలెండర్ 1914ను గుర్తు చేయవచ్చు కానీ ప్రపంచం మరోసారి అదే దారిలో నడుస్తుందా లేదా అనేది మాత్రం ప్రపంచదేశాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.