Lightning Strike: పక్కనే పిడుగు పడినా బతికాడు.. షాక్‌లో సైంటిస్టులు..ఈ కుర్రాడిలో అంతుచిక్కని శక్తులున్నాయా?

Lightning Strike

Lightning Strike

అడవుల మధ్యలో ఓ నది ఉగ్రంగా ప్రవహిస్తోంది. ఆకాశం మొత్తం నల్లటి మేఘాలతో కప్పుకుపోయింది. గాలి ఒక్కసారిగా దిశ మార్చుకుంది. ప్రకృతి ఏదో హెచ్చరిక ఇస్తున్నట్టుగా చెట్లన్నీ గట్టిగా ఊగిపోతున్నాయి. కానీ ఆ హెచ్చరికను పట్టించుకోకుండా ఒక 19 ఏళ్ల యువకుడు నదికట్ట పక్కన ఫిషింగ్ చేస్తున్నాడు. కొన్ని సెకన్ల తర్వాత ఆకాశం చీలిపోయినట్టుగా ఒక భయంకరమైన మెరుపు నేరుగా అతను ఆనుకుని నిలబడ్డ చెట్టుపై పడింది.

ఆ ఒక్క క్షణంలో చెట్టు పేలిపోయింది. మంటలు, చెక్క ముక్కలు, విద్యుత్ తరంగాలు అన్నీ కలిసి ఆ యువకుడి శరీరాన్ని గాల్లోకి విసిరేశాయి. సాధారణంగా ఇలాంటి ఘటనల్లో మనిషి బతికే అవకాశం చాలా తక్కువ. కానీ అక్కడ జరిగినది సైన్స్‌కే ఒక షాక్‌లా మారింది. ఎందుకంటే అతను బతికాడు..! అవును..! ఓ వ్యక్తి ఆనుకొని ఉన్న చెట్టుపై పిడుగు పడినా కూడా బతకడం షాక్‌కు గురిచేస్తోంది.

అమెరికాలో అసలేం జరిగింది?

అమెరికా-టెక్సాస్ రాష్ట్రానికి చెందిన హంటర్ వైచ్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ఏంజెలినా రివర్ దగ్గర చేపలు పడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భారీ ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాన్ అక్కడికి చేరుకుంది. ఆ సమయంలో హంటర్ ఒక పెద్ద పైన్ చెట్టుకు ఆనుకుని నిలబడ్డాడు. కానీ మెరుపులు ఎక్కువగా ఎత్తైన వస్తువులను టార్గెట్ చేస్తాయి. ముఖ్యంగా ఒంటరిగా నిలబడ్డ చెట్లు ప్రకృతిలో సహజమైన లైట్‌నింగ్ రాడ్స్‌లా పనిచేస్తాయి. మేఘాల్లో కోట్ల వోల్ట్స్‌ విద్యుత్ శక్తి ఏర్పడినప్పుడు అది భూమికి చేరడానికి అతి తక్కువ రెసిస్టెన్స్ ఉన్న మార్గాన్ని వెతుకుతుంది. ఆ మార్గంలో ఆ చెట్టు కనిపించింది. ఆ తర్వాత ఒక భయంకరమైన పేలుడు జరిగింది. ఆ చెట్టుపై మెరుపు పడిన క్షణంలో దాని లోపల ఉన్న తేమ ఒక్కసారిగా ఆవిరిగా మారిపోయింది. ఆ ప్రెషర్‌ను తట్టుకోలేక చెట్టు అక్షరాలా పేలిపోయింది. ఆ చెట్టు ముక్కలు హంటర్ శరీరాన్ని చీల్చుకుంటూ వెళ్లాయి. మెరుపు శక్తి అతని శరీరం గుండా ప్రయాణించింది.

సాధారణంగా లైట్‌నింగ్ ఉష్ణోగ్రత సూర్యుడి ఉపరితలం కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. దాదాపు 30 వేల డిగ్రీల సెల్సియస్ వేడి ఒక్క క్షణంలో మనిషి నరాల వ్యవస్థను కాల్చివేయగలదు. గుండె కొట్టుకోవడం ఆగిపోవచ్చు. మెదడు ఎలక్ట్రికల్ సిగ్నల్స్ డిస్టర్బ్ కావచ్చు. చాలామందికి అక్కడికక్కడే కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. కానీ హంటర్ మాత్రం స్పృహ కోల్పోలేదు. విద్యుత్ అతని కాళ్లలోని నరాలను తీవ్రంగా దెబ్బతీయడంతో కొంతసేపు కాళ్లలో స్పర్శ కూడా పోయింది.

లిచ్టెన్‌బర్గ్ ఫిగర్స్ అంటే ఏంటి?

లైట్‌నింగ్ స్ట్రైక్ నుంచి బతికి బయటపడిన వారిలో చాలామందికి జీవితాంతం సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. కొందరికి మెమరీ లాస్ వస్తుంది. కొందరికి వినికిడి శక్తి దెబ్బతింటుంది. ఇంకొందరికి నరాల వ్యవస్థ పూర్తిగా మారిపోతుంది. శరీరంపై విచిత్రమైన చెట్టు కొమ్మల్లాంటి గుర్తులు కూడా కనిపిస్తాయి. వీటిని లిచ్టెన్‌బర్గ్ ఫిగర్స్ అంటారు. విద్యుత్ చర్మం కింద ప్రయాణించినప్పుడు రక్తనాళాలు పగిలి ఈ ఆకారాలు ఏర్పడతాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేలాది మంది మెరుపుల వల్ల చనిపోతుంటారు. కానీ నేరుగా స్ట్రైక్ తగిలి కూడా స్పృహలో ఉండటం చాలా అరుదు. అందుకే హంటర్ కుటుంబం దీన్ని అద్భుతంగా భావిస్తోంది.

రెండోసారి పుట్టినట్టుగా భావిస్తున్నాడా?

ఈ ఘటన జరిగిన తర్వాత హంటర్ మరుసటి రోజే అదే ప్రదేశానికి తిరిగి వెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నిజానికి ఎవరైనా కూడా జీవితాంతం ఆ ప్రదేశం వైపు చూడటానికే భయపడేవారు. కానీ అతను మళ్లీ అదే నది దగ్గరకు వెళ్లి ఫిషింగ్ చేశాడు. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవ్వడానికి కారణం కూడా అదే. కొందరు అతన్ని ధైర్యవంతుడు అంటుంటే ఇంకొందరు అతను మరణాన్ని దగ్గరగా చూసి కూడా భయపడలేదని కామెంట్లు చేస్తున్నారు. కానీ సైకాలజిస్టుల ప్రకారం ఇలాంటి ప్రమాదాల నుంచి బయటపడిన కొందరిలో ఒక విచిత్రమైన మానసిక స్థితి ఏర్పడుతుంది. తాము రెండోసారి జన్మించినట్టుగా భావించి జీవితాన్ని భయపడకుండా జీవించాలని అనిపిస్తుంది. వాస్తవానికి మెరుపు పడే సమయంలో మనుషులు చేసే అతిపెద్ద తప్పు చెట్ల కింద నిలబడటమే. ఎందుకంటే చెట్టు మీద పడిన విద్యుత్ క్షణాల్లో నేలలోకి ప్రయాణిస్తుంది. ఆ సమయంలో చెట్టు దగ్గర ఉన్న మనిషి శరీరం కూడా విద్యుత్ మార్గంగా మారిపోతుంది.

అలాగే నీటి దగ్గర ఉండటం కూడా ప్రమాదకరం. నీరు విద్యుత్‌ను చాలా వేగంగా ప్రయాణించేలా చేసుకుంటుంది. అందుకే వర్షం పడుతున్నప్పుడు నదులు, చెరువులు, ఓపెన్ ఫీల్డ్స్, ఒంటరి చెట్లు దగ్గర ఉండొద్దని అధికారులు పదే పదే హెచ్చరిస్తుంటారు. కానీ చాలామంది ఈ హెచ్చరికలను సీరియస్‌గా తీసుకోరు. ప్రమాదం ఎదురైన తర్వాతే మెరుపు శక్తి ఎంత భయంకరమో అర్థమవుతుంది. ఇక హంటర్ వైచ్ ఇప్పుడు తనను తాను ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతుడైన అదృష్టవంతుడిని అని చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే అతను మరణానికి కొన్ని అంగుళాల దూరంలో వెళ్లి తిరిగి వచ్చాడు.

ఒకవైపు కాలిన గాయాలు, మరోవైపు పేలిపోయిన చెట్టు ముక్కలతో శరీరం నిండిపోయినా అతను బతికాడు. ఇది కేవలం అదృష్టమా, లేక ప్రకృతి అతనికి మరో అవకాశం ఇచ్చిందా అన్న ప్రశ్న ఇప్పుడు చాలా మందిని వెంటాడుతోంది. కానీ ఒక విషయం మాత్రం నిజం. ఆకాశంలో మెరుపు కనిపించిన ప్రతి సారి ప్రకృతి మనిషికి తన అసలు శక్తిని గుర్తు చేస్తూనే ఉంటుంది.