NTV Telugu Site icon

Zimbabwe CWC 2023: స్కాట్లాండ్‌ చేతిలో ఓటమి.. ప్రపంచకప్‌ 2023కి జింబాబ్వే దూరం! రెండో బెర్తు ఎవరిదంటే

Zimbabwe Cricket

Zimbabwe Cricket

Zimbabwe out of race for World Cup Qualifiers 2023: వన్డే ప్రపంచకప్‌ 2023 క్వాలిఫయర్స్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో జింబాబ్వే తడబడింది. మంగళవారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో ఓడి.. వరుసగా రెండోసారి ఈ మెగా టోర్నీకి దూరమైంది. ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన ‘సూపర్‌ సిక్స్‌’ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో విఫలమయిన జింబాబ్వే మూల్యం చెల్లించుకుంది. క్వాలిఫయర్స్‌లో వెస్టిండీస్‌ తర్వాత జింబాబ్వే కూడా ఇంటిదారిపట్టింది. ఇక ప్రపంచకప్‌ 2023 రెండో బెర్తు కోసం రెండు జట్లు రేసులో నిలిచాయి.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 234 పరుగులు చేసింది. మైకేల్‌ లీస్క్‌ (48; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మాథ్యూ క్రాస్‌ (38; 2 ఫోర్లు), బ్రెండన్‌ మెక్‌ములెన్‌ (34; 6 ఫోర్లు) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో సీన్‌ విలియమ్స్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. చటారా రెండు వికెట్లు తీశాడు. అనంతరం 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 41.1 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్ అయింది. ర్యాన్ బర్ల్‌ (83; 8 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచరీ చేయగా.. సికందర్‌ రజా (34; 2 ఫోర్లు, 1 సిక్స్‌), మధెవెరె (40; 3 ఫోర్లు, 1 సిక్స్‌) పోరాడారు. 2019 ప్రపంచకప్‌లోనూ జింబాబ్వే క్వాలిఫయింగ్‌ టోర్నీలోనే నిష్క్రమించింది.

Also Read: Tollywood Upcoming Multistarrer: టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్.. ముగ్గురు హీరోలు కలిసి సినిమా!

ప్రపంచకప్‌ 2023కి క్వాలిఫయర్‌ నుంచి రెండు జట్లు ఎంపికవుతాయన్న విషయం తెలిసిందే. సూపర్‌-6 దశలో నెదర్లాండ్స్‌, జింబాబ్వేలను ఓడించిన శ్రీలంక.. ఇప్పటికే ఓ బెర్తును సొంతం చేసుకుంది. స్కాట్లాండ్‌ను ఓడిస్తే.. జింబాబ్వేకు మెరుగైన అవకాశాలు ఉండేవి. కానీ ఆ అవకాశాన్ని జింబాబ్వే చేజేతులారా పోగొట్టుకుంది. ప్రస్తుతం జింబాబ్వే ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. స్కాట్లాండ్‌ ఖాతాలో 6 పాయింట్స్ ఉండగా.. నెదర్లాండ్స్‌ ఖాతాలో 4 పాయింట్స్ ఉన్నాయి. నెట్‌రన్‌రేట్‌లో జింబాబ్వే (-0.099) కంటే స్కాట్లాండ్‌ (+0.296), నెదర్లాండ్స్‌ (-0.042) మెరుగ్గా ఉన్నాయి.

సూపర్‌-6 దశలో గురువారం (జులై 6) స్కాట్లాండ్‌, నెదర్లాండ్స్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ గెలిస్తే.. బెర్తు సొంతమవుతుంది. మరోవైపు నెదర్లాండ్స్‌ గెలిస్తే.. నెట్‌ రన్‌రేట్‌లో స్కాట్లాండ్‌ను అధిగమించాల్సి ఉంటుంది. అంటే భారీ తేడాతో స్కాట్లాండ్‌ను నెదర్లాండ్స్‌ ఓడించాలి. అప్పుడే నెదర్లాండ్స్‌కు బెర్త్ సొంతం అవుతుంది. అయితే ఇది అంత సులువేం కాదు. ఇక మ్యాచ్‌ వర్షం వల్ల రద్దయినా స్కాట్లాండ్‌కే బెర్త్ దక్కుతుంది.

Also Read: Niharika-Chaitanya Divorce: నిహారిక-చైతన్య విడాకులు.. ముందుగా పిటిషన్‌ వేసింది ఎవరో తెలుసా?