NTV Telugu Site icon

YS Viveka Case: కుటుంబ పరువు పోతుందనే ఈ విషయం చెప్పలేదు.. అది తప్పుడు ప్రచారం..!

Ys Subbareddy

Ys Subbareddy

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతోంది.. రోజుకో విషయం తరహాలో కొత్త కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి.. ఎంపీ అవినాష్‌రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లో అనేక విషయాలను ప్రస్తావించారు.. ఇక, ఈ వ్యవహారంపై స్పందించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. వైఎస్‌ వివేకానందరెడ్డి వివాహేతర సంబంధాల గురించి చెప్పుకుంటే కుటుంబ పరువు పోతుందని అప్పట్లో చెప్పలేదన్నారు.. ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో విచారణ జరుగుతోందన్న ఆయన.. చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నారు.. అన్ని కోణాల్లో విచారణ జరగాలని మేం కోరుంటున్నాం.. కానీ, సీబీఐ విచారణ పక్షపాత ధోరణితో సాగుతోందనే అనుమానాలు ఉన్నాయన్నారు.

Read Also: TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌..

వైఎస్‌ వివేకా వివాహేతర సంబంధాల గురించి చెప్పుకుంటే కుటుంబ పరువు పోతుందని అప్పట్లో చెప్పలేదన్న వైవీ సుబ్బారెడ్డి.. ఇప్పుడు ఈ విషయాలు బయటకు చెప్పక తప్పని పరిస్థితులు వచ్చాయన్నారు.. వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత భర్త రాజశేఖరరెడ్డి పాత్రపై కూడా విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు వైవీ సుబ్బారెడ్డి. ఇక, స్వామీజీ దేవుళ్ళు రాజకీయాలకు అడ్డం పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు ఈ ప్రభుత్వం వెంటనే కూలి పోవాలనేది కొంతమంది ఆలోచన అని మండిపడ్డారు.. విజయకుమార్ స్వామి ఎవరి విమానంలో విజయవాడకు వచ్చాడు. విజయ్ కుమార్ స్వామి అంటే అందరికి భక్తి భావమే. విజయకుమార్ స్వామి వచ్చి మొన్న సీఎం జగన్‌ కు ఆశీర్వాదం అందించారు. విజయ్ కుమార్ స్వామి లాబీయింగ్ కు వచ్చారని దుష్ప్రచారం చెయ్యడం మంచిది కాదన్నారు.. కోర్టులు ఎవరు ఏంటి అనేది నిర్ణయిస్తాయి. సీబీఐ పై వచ్చే కొన్ని కథనాలు మంచిది కాదు.. సీబీఐ విచారణ పక్షపాత ధోరణితో జరుగుతోంది అనేది కొన్ని సంఘటనలు చూస్తే అర్ధం అవుతుందన్నారు సుబ్బారెడ్డి.

కాగా, తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన ఎంపీ అవినాష్‌రెడ్డి.. కీలక అంశాలను ప్రస్తావించారు. వైఎస్‌ వివేకా హత్యతో నాకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే, వైఎస్‌ వివేకా కూతురు సునీత.. సీబీఐ, స్థానిక ఎమ్మెల్సీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేతతో కలిసి కుట్ర పన్ని నన్ను, నా కుటుంబాన్ని దెబ్బతీయడానికి ప్లాన్ చేశారని ఆరోపించారు ఎంపీ అవినాష్‌రెడ్డి.. సునీతకు వివేకా రెండో భార్యకు మధ్య విభేదాలు ఉన్నాయని పేర్కొన్న ఆయన.. వివేకా తన రెండో భార్యతో ఆర్థికంగా అనుకూలంగా వ్యవహరించినందుకే సునీత కక్ష గట్టిందన్నారు.. వివేకానందరెడ్డి తన రెండో భార్య కొడుకుకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో సీట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు.. అంతే కాకుండా స్కూల్‌ పక్కనే విల్లా కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేశాడు.. వివేకా రెండో భార్య కుటుంబానికి డబ్బును ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసే ప్లాన్‌ కూడా చేశారు.. అయితే, ఇదంతా సునీతకు తెలిసి.. వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేశారంటూ తన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి పేర్కొన్న విషయం విదితమే.