Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.. నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుండగా.. ఎన్నికల పోలింగ్ నవంబర్ 30 ఒకే ఫేజ్‌లో జరగనుంది.. ఇక, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3వ తేదీన ప్రకటించనున్నారు.. అయితే, తెలంగాణ ఎవరెవరు పోటీ చేస్తారు అనేది ఉత్కంఠగా మారింది.. ఇప్పటికే పోటీపై జనసేన క్లారిటీ ఇచ్చింది.. టీడీపీ సై అంటోంది.. ఏపీలో లాగా.. తెలంగాణలోనూ టీడీపీ-జనసేన కలిసి ముందుకు వెళ్తాయా? అనేది తెలియాల్సి ఉంది.. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? తెలంగాణలో పోటీ చేస్తుందా? అనే చర్చ సాగుతోన్న సమయంలో.. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యం వైసీపీకి లేదని స్పష్టం చేశారు వైవీ సుబ్బారెడ్డి.. ప్రకాశం జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర విభజన సమయంలో ప్రతిపాదించిన విధంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పంపకాలు జరిగాయని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే సమీక్షలు నిర్వహించారు.. కేంద్రాన్ని కలిసి అన్ని అంశాలు వివరిస్తారు.. అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం అన్నారు. అయితే, ఏపీ బీజేపీ అధ్యక్షురాలైన పురంధేశ్వరి.. టీడీపీ చేస్తున్న బురదజల్లే ఆరోపణలే తిరిగి చేస్తున్నారని దుయ్యబట్టారు. మా ప్రభుత్వం అవినీతిరహిత విధానాలు అవలంభిస్తుంది.. మద్యం, ఇసుక పాలసీలపై ఎటువంటి విచారణలు వేసినా మేం సిద్ధం అని సవాల్ చేశారు.
మరోవైపు.. వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు వైవీ సుబ్బారెడ్డి.. త్వరలో రెండు టన్నెల్స్ పూర్తిచేసి జనవరి కల్లా ప్రారంభిస్తాం అన్నారు. ఇక, జనసేన, టీడీపీతో పాటు ఎన్ని పార్టీలు కలసి పనిచేసినా సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి.. వైసీపీలో తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువై నియోజకవర్గాలు సరిపోవటం లేదన్నారు. అయితే, జనసేన పార్టీకి కనీసం 15 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పడు రాష్ట్రాన్ని దోచుకున్నారని మొదటి నుంచి చెబుతున్నాం.. స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలలో కోర్టుల ద్వారా పూర్తి విచారణ జరుగుతుందని తెలిపారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి.