Site icon NTV Telugu

Duvvada Srinivas: వాలంటీర్లపై వైసీపీ అభ్యర్థి వివాదాస్పద వ్యాఖ్యలు.. రాజీనామా చేస్తేనే..!

Duvvada Srinivas

Duvvada Srinivas

Duvvada Srinivas: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు వాలంటీర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి.. కొన్నిసార్లు విపక్ష నేతలు.. మరికొన్నిసార్లు అధికార పక్షం నుంచి వాలంటీర్లపై చేస్తున్న కామెంట్లు వివాదాస్పదంగా మారుతూనే ఉన్నాయి.. తాజాగా ఈ జాబితాలో చేరారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ, శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకర్గ వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌.. ఈ నెల 10వ తేదీన వాలంటీర్ల విధులపై హైకోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి. వాలంటీర్లు రాజీనామాలు చేసి.. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు రాజీనామాలు చేసిన వారినే జూన్ 5వ తేదీ నుండి మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని తెలిపారు.. రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకొని ప్రచారం చేయాలన్నారు.. అలాంటి వారినే మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతే కాదు.. మేం చెప్పిన మాటలు వినని, రాజీనామాలు చేయని వారిని విధుల్లో నుంచి తొలగిస్తామని.. వారి స్థానంలో మరొకరు వస్తారంటూ హెచ్చరించారు. టెక్కలిలో నిర్వహించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో వాలంటీర్ల రాజీనామాలపై దువ్వాడ శ్రీనివాస్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. కాగా, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వాలంటీర్లు పెద్ద సంఖ్యలో రాజీనామాలు చేసిన విషయం విదితమే.. ఈ వ్యవహారంపై హైకోర్టులో కూడా పిటిషన్లు దాఖలు అయ్యాయి.

Read Also: MLC By Election: నేటి నుంచి 9వ తేదీ వరకు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్‌..

Exit mobile version