MP Margani Bharat: అత్యంత భద్రత కల్గిన భారత దేశ పార్లమెంటులో ఆగంతకులు కలకలం సృష్టించిన సమాచారం వినగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. రాజమండ్రిలో భరత్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆగంతకులు పార్లమెంటులో ప్రవేశించిన సమయంలో తాను అక్కడ లేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్లమెంటు సమావేశ హాలులోకి ప్రవేశించాలంటే సాధారణ విషయం కాదని, ఎంపీలకే మూడంచెల తనిఖీ ఉంటుందని.. అటువంటిది ముగ్గురు ఆగంతకులు ఎలా లోపలకు వెళ్ళారనేది ఆశ్చర్యంగా ఉందన్నారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: టీడీపీ రాజకీయ పార్టీగా ఉనికి కోల్పోయింది.. అది ఒక ముఠా..
దాదాపు 22 ఏళ్ళ కిందట పార్లమెంటుపై ఒక ఘటన జరిగినట్టు విన్నానని, అయితే అది పార్లమెంటులో కాకుండా రోడ్డుపై జరిగిందని.. నేటి సంఘటన ఏకంగా లోక్‌సభలో ఎలా జరిగిందో అర్థం కావడం లేదన్నారు. షూష్‌లో టియర్ గ్యాస్ షెల్స్ పెట్టుకెళ్ళి సభలో విసిరినట్టు టీవీలలో వస్తున్న సమాచారాన్ని బట్టి తెలిసిందని చెప్పారు. లోక్‌సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకారంటే ఇది పూర్తిగా భద్రతా వైఫల్యమేనని ఎంపీ భరత్ స్పష్టం చేశారు. ఆ అగంతకులు ఎవరు, ఎక్కడ నుండి వచ్చారు, వీరి వెనుక ఎవరు ఉన్నారు, వీరి లక్ష్యం ఏమిటి తదితర విషయాలపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ భరత్ అన్నారు. భద్రతా సిబ్బంది ఎంత వైఫల్యం చెందారనేది అర్థం అవుతోందని అన్నారు.