YSRCP MLAs Joins TDP: ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు పలువురు చేరారు. చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకుని వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఆయన భార్య కూడా టీడీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్సీ, చేనేత సంఘ నాయకుడు బూదాటి రాధా కృష్ణయ్య కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 6 నియోజకవర్గాల నుంచి వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీలో చేరారు. రామచంద్రపురం, తంబళ్లపల్లి, ఉదయగిరి, తాడికొండ, మంత్రాలయం, కోవూరు నియోజకవర్గాల నేతలు కూడా తెలుగుదేశంలో చేరారు.
జనవరిలో సైకిల్ స్పీడ్ పెరిగి, ఫ్యాన్ రెక్కలు విరక్కొడుతుందని.. చిల్లు పడిన వైసీపీ నావ త్వరలోనే మునుగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 3 నెలల తర్వాత జగన్ ఎక్కడికి పోతాడో తెలీదని ఆయన పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరూ తమ జీవితాలకు భద్రత కోరుకుంటున్నారన్నారు. అపరిచితుడు లాంటి జగన్ చెప్పిందేదీ చేయడు.. తల్లీ, చెల్లికి కూడా సమయo ఇవ్వని వాడు ఇక ఎమ్మెల్యేలకేం ఇస్తాడన్నారు. రాష్ట్రం మీదకు ఓ అరాచక సైన్యాన్ని జగన్ వదిలి పెట్టాడని.. పులివెందులలో ఒక బీసీని గెలిపించి తన సత్తా ఏంటో జగన్ చూపించాలన్నారు. జగన్ అనేవాడు ఏ నియోజకవర్గంలోనైనా పోటీ చేయొచ్చన్నారు. వైసీపీలో ఎమ్మెల్యేలు మాట్లాడలేరన్నారు. వైసీపీ ఎంపీలు గుమస్తాలు అని.. 151 మందిని మార్చినా జగన్ గెలవడని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కాపాడేందుకే తెలుగుదేశం – జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయన్నారు.