Gadikota Srikanth Reddy: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు చిత్తశుద్ధి ఉంటే శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేవారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎక్కడో చిన్న సంఘట జరిగితే రాయలసీమ గుండాలు అన్నప్పుడు పవన్ ఎందుకు ప్రశ్నించ లేదు? అని నిలదీశారు. చంద్రబాబును సంతృప్తి చేయటమే పవన్ కల్యాణ్ అజెండా అని విమర్శించారు. హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలి.. రాజకీయం అంటే ఒక బాధ్యత.. ఊగిపోతూ మాట్లాడటం.. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయటం కాదు అని హితవుపలికారు.. ధైర్యం ఉంటే 2014లో టీడీపీ మేనిఫెస్టోను కార్యకర్తల ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికి పంపించాలని డిమాండ్ చేశారు. మేం ప్రతి ఇంటికి మేనిఫెస్టో తీసుకుని వెళుతున్నాం.. అమరావతిలో పేదవాళ్ళు ఉండకూడదన్న టీడీపీకి, అన్ని వర్గాల వారు ఉండాలని 50 వేల మందికి ఇంటి స్థలాలు ఇచ్చిన జగన్ కు పొంతన ఉందా? చంద్రబాబు 14 ఏళ్ళ పాలన, జగన్ నాలుగేళ్ల పాలన పై చర్చకు మేం సిద్ధం అంటూ సవాల్ చేశారు.
చంద్రబాబు ఎంతో మందిని బలి పశువులను చేశాడు.. ఈ సారి చంద్రబాబు చేతిలో బలి పశువు పవన్ కల్యాణ్ అని వ్యాఖ్యానించారు గడికోట శ్రీకాంత్ రెడ్డి.. నేను, సీఎం జగన్ కలసి ఒకేచోట చదివామని పవన్ చెబుతున్నారు.. నేను కడపలో చదివితే, జగన్ హైదరాబాద్ లో చదివారని గుర్తుచేశారు. వాస్తవాలు తెలియకుండా పవన్ మాట్లాడుతున్నారు.. ఇది సరైంది కాదని హెచ్చరించారు. ఇక, సీఐ అంజూయాదవ్ ను మహిళ అని కూడా చూడకుండా బూతులు తిట్టారు అంటూ ఫైర్ అయ్యారు.. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సీఐ చేయి చేసుకున్నారన్న ఆయన.. పవన్ కు చిత్తశుద్ధి ఉంటే సీఐ అంజూయాదవ్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థ ఆత్మ స్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేయటం కరెక్ట్ కాదు.. మీ లాంటి రౌడీ షీపర్లను అడ్డుకట్ట వేయటానికి పోలీసు వ్యవస్థ ఉండాలన్నారు.
వేదిక ఎక్కి చెప్పులు చూపించటం, తోలు తీస్తా, తాట తీస్తా అనడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు శ్రీకాంత్‌రెడ్డి.. 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయగలం అని టీడీపీ, జనసేన ఎందుకు చెప్పలేకపోతున్నారు.. ప్రజాదరణ లేదని ఇక్కడే అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. ఇక, బీజేపీ మా పై ఆరోపణలు చేసే ముందు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.. ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్ ఏమయ్యిందో బీజేపీ సమాధానం చెప్పాలన్న ఆయన.. రాజకీయం కోసం ఆరోపణలు చేయటం కరెక్ట్ కాదన్నారు. మాది సెక్యులర్ పార్టీ.. యూనిఫాం సివిల్ కోడ్ పై మా విధానాలు ఆ రోజు ఖచ్చితంగా చెబుతాం అని స్పష్టం చేశారు గడికోట శ్రీకాంత్ రెడ్డి.