NTV Telugu Site icon

Kakarla Suresh: కాకర్ల సురేష్‌ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ నాయకులు

Kakarla Suresh

Kakarla Suresh

Kakarla Suresh: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం అంతా టీడీపీ మయం అయిందని.. మండలంలో ఉన్న 24 పంచాయతీల నుండి శుక్రవారం వైసీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారని ఉదయగిరి టీడీపీ-జనసేన-బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్‌ పేర్కొన్నారు. వరికుంటపాడు మండలంలో శుక్రవారం ఆత్మీయ సమావేశం టీడీపీ మండల అధ్యక్షుడు చండ్రా మధుసూదన్ రావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం-జనసేన-బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వరికుంటపాడు మండలంలోని 24 పంచాయతీల నుంచి వైసీపీ నాయకులు పంచాయతీకి సుమారు 50 నుంచి 100 కుటుంబాల వారు కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారందరికీ కాకర్ల సురేష్ టీడీపీ కండువా కప్పి ఆహ్వానించారు. వైసీపీ పార్టీని వీడి టీడీపీలోకి రావడం చాలా ఆనందంగా ఉందని నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ఆశీర్వదించండి అండగా ఉంటానని ప్రజలను కోరారు. ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలలో వరికుంటపాడు మండలంలో అత్యధిక మెజార్టీ సాధించాలని తెలిపారు. 1983లో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగుదేశం స్థాపించిన నాటి నుంచి నేటి వరకు పార్టీ వెంట నడిచిన వారందరికీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తానన్నారు. ప్రతి నాయకుడిని కార్యకర్తలని కలుసుకొని వారి అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు. నాకోసం శ్రమించే వారిని అక్కున చేర్చుకుంటానన్నారు. తాను ఎమ్మెల్యే అయిన వెంటనే ఉదయగిరి నియోజకవర్గం రూపురేఖలు మారుస్తానని తెలిపారు. తాగు, సాగు నీరుతో పాటు ఉపాధి, ఉద్యోగం అవకాశాలు మెరుగుపరుస్తానన్నారు. ఉదయగిరికి శ్రీమంతులను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. అందరికీ అండగా ఉంటానని తెలిపారు. అధికారం లేకుండానే తానేంటో రుజువు చేసుకున్నానని, అధికారం వచ్చిన వెంటనే సంక్షేమం అభివృద్ధే తన లక్ష్యం అన్నారు. పార్టీ కోసం లాటి దెబ్బలు తిన్న వారికి అన్నగా ఉంటానన్నారు. వడ్డీతో సహా చెల్లిస్తానన్నారు.

Read Also: BC Janardhan Reddy: జగన్, కాటసాని రామిరెడ్డిలు మహానటులు.. బీసీ జనార్ధన్ రెడ్డి కౌంటర్‌!

రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై అక్రమ కేసులు పెట్టిన నాడే వైసీపీ పని అయిపోయిందని, ఆక్సిజన్‌పై ఉన్న వైసీపీ పార్టీని త్వరలో ఓటర్లు ఇంటికి పంపిస్తారన్నారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ 50వేల మెజార్టీ సాధించడమే లక్ష్యమని కాకర్ల తెలిపారు. అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా చేసిన జగన్‌ను ఇంటికి పంపి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దామని పిలుపునిచ్చారు. యువ గళం పేరుతో రాష్ట్రాన్ని చుట్టి సమస్యలు తెలుసుకున్న యువ నాయకుడు నారా లోకేష్ సారథ్యంలో మనమందరం నడుద్దామని అన్నారు. ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి, తనపై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారన్నారు. ఇంతకాలం ఇక్కడే ఉండే ఏమి చేశావు, పేదవాడి తలుపు తట్టి 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయా అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకుందామని హితవు పలికారు.

ముందుగా భారీ ఎత్తున బాణాసంచాలు కాలుస్తూ పూల వర్షం కురిపిస్తూ వరికుంటపాడు టీడీపీ శ్రేణులు కాకర్ల సురేష్‌కు స్వాగతం పలికారు. వేదికపై గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు రావెళ్ల నాగేంద్ర, కాకర్ల సునీల్, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ యాదవ్, మండల తెలుగు యువత అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కస్టర్ ఇంచార్జి కోక మహేష్, యూనిట్ ఇంచార్జి నాదెండ్ల రాజా, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి కొండలరావు, మాజీ కన్వీనర్ చండ్ర వెంకయ్య, మాజీ జెడ్పీటీసీ భోగినేని శ్రీనివాసులు, మాజీ సొసైటీ ప్రెసిడెంట్ పావులూరి రవీంద్రబాబు, రైతు సంఘం నాయకులు వేమూరి మధు, జనసేన నాయకులు రసూల్, జనసైనికులు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు ఉన్నారు.