Site icon NTV Telugu

YSRCP: టార్గెట్‌ 175.. వైసీపీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్న సీఎం జగన్‌

Ys Jagan

Ys Jagan

YSRCP: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి గేర్ మారుస్తున్నారు. గత నాలుగున్నర ఏళ్లుగా పాలన, సంక్షేమ పథకాల అమలుపైనే ఎక్కువగా దృష్టి పెట్టిన సీఎం, ఇక తన ఫోకస్ పార్టీ పైకి మారుస్తున్నారు. ప్రధానంగా మండల స్థాయి నేతలు, క్షేత్రస్థాయి శ్రేణులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తల నుంచి పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇంఛార్జుల వరకు పాల్గొంటారు. మొత్తం మీద సుమారు 8 వేల మంది ఈ సభకు హాజరు కానున్నారు.

నాలుగున్నర ఏళ్లుగా తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళే విధంగా ఈ కార్యక్రమం ఉండనుంది. సీఎం జగన్ స్వయంగా సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తారు. 175కు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఎన్నికలకు శ్రేణు­లను సమాయత్తం చేసేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సన్నద్ధమయ్యారు. అందులో భాగంగా పార్టీ ప్రతినిధుల సభలో దిశా నిర్దేశం చేయనున్నారు.. గత 53 నెలలుగా సుపరి­పా­లన, సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ప్రతి ఇం­టికీ, గ్రామానికీ, నియోజక­వర్గానికీ, జిల్లాకు, రాష్ట్రానికీ చేసిన మంచిని మరింత ప్రభా­వవంతంగా వివరించడం.. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న ఎక్కడికక్కడ తిప్పికొట్టడంపై ప్రతినిధులకు కీలక ఆదేశాలు ఇస్తారు. అధికారంలోకి వచ్చాక విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు – పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం సమగ్రాభివృద్ధి దిశగా పరుగులెత్తిస్తున్న తీరును కళ్లకు కట్టినట్లుగా వివరించి.. ప్రగతిపథంలో రాష్ట్రం దూసుకెళ్లాలంటే మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పాలని సూచించనున్నారు.

గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటిలో నెరవేర్చింది ఎంత అన్న విషయంపై పార్టీ శ్రేణులకు సీఎం జగన్‌ వివరిస్తారు. అదే విధంగా వైసీపీ గత ఎన్నికల సమయంలో ఏం హామీలు ఇచ్చింది…వచ్చిన తర్వాత ఎంత మేరకు నెరవేర్చారు అన్న అంశాలను సభలో చర్చిస్తారు. వీటన్నింటినీ మండల స్థాయి నాయకులతో పంచుకుంటారు సీఎం. ఇవన్నీ ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికల్లో ప్రజా మద్దతు కోరతారు. ఇక ముఖ్యమంత్రి జగన్ ఇచ్చే దిశానిర్దేశం కోసం పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధుల సభకు హాజరయ్యే ఆహ్వానితులు సకాలంలో సభ ప్రాంగణానికి చేరుకోవాలని చెబుతున్నారు. పాస్‌లు ఉన్నవారినే అనుమతిస్తారు.. ఉదయం టిఫిన్‌తో పాటు మధ్యాహ్నం మటన్‌ బిర్యానీ, చికెన్‌ బిర్యానీ, రొయ్యల కూర, పీతల వేపుడు, రసం, కుండ పెరుగు.. తదితర 30 రకాల వంటకాలతో పసందైన భోజనం అందిస్తామన్నారు. ఆహ్వానితులు ఉదయం 8.30 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకోవాలని.. పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారని, పోలీసులు స్టేడియం లోపల, బయట కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని చెబుతున్నారు పార్టీ నేతలు.

Exit mobile version