YSRCP: ఈనెల 26,27 తేదీల్లో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని వైసీపీ మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలను ఖరారు చేయడంపై తుది కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం విశాఖలో బస్సు యాత్ర చేస్తు్న్న సీఎం జగన్.. రేపు పార్టీ కీలక నేతలతో సమావేశం కానున్నారు. రేపు మేనిఫెస్టోను ఖరారు చేయనున్న సీఎం జగన్.. ఈ నెల 26 లేదా 27న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25న సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 26 లేదా 27న మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Read Also: Guduri Srinivas: అభివృద్ధి ఏసీ గదిలో నుంచి కాదు.. రోడ్లపైకి వచ్చి చూడాలి..
ఇప్పటికే సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రల ద్వారా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. మరోవైపు ఏపీలో ఎన్నికల సమయంలో మేనిఫెస్టో పైన రాజకీయంగా భారీ అంచనాలు ఉన్నాయి. టీడీపీ గత మహానాడు లో సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలు ప్రకటించారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ప్రతీ సభలో వీటిని ప్రస్తావిస్తున్నారు. జగన్ ఎన్నికల మేనిఫెస్టో పైన గతంలో స్పష్టత ఇచ్చారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేసామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు తాము అమలు చేసేదే చెబుతామని జగన్ చెప్పుకొచ్చారు. ఈ సారి మేనిఫెస్టోలో కూటమి, వైసీపీ నుంచి ఎలాంటి హామీలు ఇస్తారనేది కీలకంగా మారుతోంది. హోరా హోరీగా సాగుతున్న ఎన్నికల యుద్దంలో ఇప్పుడు రెండు వైపులా మేనిఫెస్టోల పైన రాజకీయంగా చర్చ సాగుతోంది.