NTV Telugu Site icon

YSRCP: మార్పులు చేర్పులపై వైసీపీ అధిష్ఠానం ఫోకస్.. నేతల్లో నెలకొన్న దడ!

Ysrcp

Ysrcp

YSRCP: ఏపీలో వైసీపీ రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో పాటు పలు సీట్లపై వైసీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. సెకండ్ ఫేజ్ మార్పుల కోసం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ నేరుగా రంగంలోకి దిగారు. ఒకటి, రెండు రోజుల్లో కొత్త సమన్వయకర్తలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మంతనాలు సాగుతున్నాయి. విజయమే ప్రామాణికంగా మార్పులు చేర్పుల గురించి నేతలకు సీఎం వివరిస్తున్నారు. సీటు నిరాకరిస్తున్న వారికి భవిష్యత్‌పై ముఖ్యమంత్రి హామీ ఇస్తున్నారు. పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా నిర్ణయాలు తప్పటం లేదని సీఎం వివరిస్తున్నారు. ప్రస్తుతం సీఎంవో నుంచి పిలుపు వచ్చిన ఎమ్మెల్యేల గుండెల్లో దడ పుడుతోంది.

Read Also: Parliament: లోక్‌సభలో 33 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు

సీఎం జగన్‌ ఎన్నికల కసరత్తును వేగవంతం చేశారు. ఎక్కడైతే సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉందో వారిని మార్చేందుకు నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేశారు. మరో జాబితా సిద్దంగా ఉంది. పలువురు ఎమ్మెల్యేలను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించారు సీఎం జగన్. అందులో భాగంగా గోదావరి ,గుంటూరు జిల్లాలకు చెందిన వారికి సీఎంఓ నుంచి పిలుపు రావటంతో గోదవరి జిల్లాల్లోని పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, చింతలపూడి, రామచంద్రాపురం ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన మంత్రి చెల్లుబోయిన వేణు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబులు వచ్చారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, ప్రత్తిపాడు పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా, రాజమండ్రి ఎమ్పీ మార్గాని భరత్, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేల మద్దాల గిరిలు కూడా సీఎంఓకు వచ్చారు. ఒక్కొక్కరితో వేర్వేరుగా సీఎం జగన్ సమావేశం అవుతున్నారు. ఎవరికి ఏ కారణంతో టికెట్ నిరాకరిస్తుందీ సీఎం వివరిస్తున్నారు. వారి స్థానంలో నియమించే వారి సమాచారం అందిస్తున్నారు. సహకరించాలని సూచిస్తున్నారు. తిరిగి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తున్నారు.

అభ్యర్థుల ఖరారుపై ఈ రోజు నుంచి మూడు రోజుల సమావేశాలకు సీఎం నిర్ణయించారు. ఎమ్మెల్యేలతో నేరుగా ముఖ్యమంత్రి సమావేశమవుతున్నారు. ఇదిలా ఉండగా.. వచ్చే వారం ఎంపీలతో సీఎం సమావేశం కానున్నారు. ఏ క్షణంలో అయినా నియోజకవర్గాల ఇంఛార్జ్‌ల మార్పుపై అధికారికంగా ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

 

Show comments