NTV Telugu Site icon

YS Sharmila: నేడు జగన్‌ ఇంటికి షర్మిల.. ఆ తర్వాత ఢిల్లీకి

Ys Sharmila

Ys Sharmila

YS Sharmila: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇంట ఈ రోజు ఆసక్తికర పరిణామాలు జరగబోతున్నాయి.. కుటుంబ సమేతంగా సీఎం జగన్ నివాసానికి వెళ్లనున్నారు వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లనున్న షర్మిల.. తన సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలవనున్నారు.. తన కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరితో వివాహ నిశ్చితార్థంతో పాటు పెళ్లి వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికను జగన్‌కు అందజేయనున్నారు.. తన ఇంట్లో జరిగే తొలి శుభకార్యానికి హాజరుకావాలని అన్నకు ఆహ్వానం పలకనున్నారు.. అయితే, గత కొన్నేళ్లుగా అన్నా – చెల్లెళ్ళ మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తుందనే వార్తలు వచ్చాయి.. చివరకు వైఎస్‌ ఘాట్‌లో నివాళులర్పించే సమయంలోనూ ఇద్దరు విడివిడిగా వెళ్లడం కూడా హాట్‌ టాపిక్‌ అయ్యింది.. ఇప్పుడు షర్మిల.. తన అన్నయ్య దగ్గరకు వెళ్తుండడంతో.. ఈ పరిణామాలను ఆసక్తికరంగా గమనిస్తున్నారు ప్రజలు.

Read Also: Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

మరోవైపు.. వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసేందుకు సిద్ధమైన వైఎస్‌ షర్మిల.. తన సోదరుడు, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో సమావేశం అయిన తర్వాత ఢిల్లీకి వెళ్లనున్నారు.. రేపు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీతో సమావేశమై.. కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు.. అయితే, కాంగ్రెస్‌లో చేరేముందు వైఎస్‌ జగన్‌ను కలవనుండడం కూడా చర్చగా మారింది.. ప్రస్తుతం ఇడుపులపాయలో ఉన్న వైఎస్‌ షర్మిల.. కడప నుంచి ప్రత్యేక విమానంలో తన కుటుంబ సభ్యులతో కలిసి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.. అక్కడ నుంచి రోడ్డుమార్గంలో తాడేపల్లి చేరుకుంటారు.. మరోవైపు.. తన కాకినాడ పర్యటనను ముగించుకుని మధ్యాహ్నం తర్వాత నివాసానికి చేరుకుంటారు వైఎస్‌ జగన్‌.. ఆ తర్వాత అన్నను కలిసి ఆహ్వానం అందించి ఢిల్లీ బాట పట్టనున్నారు వైఎస్‌ షర్మిల. కాంగ్రెస్‌ అగ్రనేతలతో ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి.. తన వెంట వచ్చే నేతల వివరాలు.. తనకు బాధ్యతలు అప్పగిస్తే తాను నిర్వహించే కార్యక్రమాలు.. కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్‌ఆర్‌టీపీ విలీనం.. తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆమె కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. అయితే, ఇప్పటికే అధిష్టానంతో చర్చలు జరిపిన షర్మిలకు ఓ క్లారిటీ వచ్చిన తర్వాతే పార్టీ విలీనానికి సిద్ధమైందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తు్నారు. ఇక, ఏపీ కాంగ్రెస్ లో ఆమెకు కీలక బాధ్యతలను అప్పగించే ఆలోచన హైకమాండ్ చేస్తుందన్న ప్రచారం నేపథ్యంలో వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత ఏర్పడింది.. మరోవైపు.. రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానని ప్రకటించిన షర్మిల.. ఢిల్లీలో ఏం మాట్లాడనున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

Show comments