Site icon NTV Telugu

YS Jagan: అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే వాళ్లను జైల్లో పెడతాం..! జగన్‌ సంచలన వ్యాఖ్యలు

Ys Jagan

Ys Jagan

YS Jagan: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కాలేజీలను తీసుకున్న వారిని జైలుకు పంపుతామని సంచలన కామెంట్లు చేశారు. ప్రైవేటుకు ఇవ్వడమే పెద్ద స్కామ్ అయితే, జీతాలు కూడా ప్రభుత్వమే ఇస్తామని చెప్పడం అంతకంటే పెద్ద మోసమని ఆయన ఆరోపించారు. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో వైఎస్‌ జగన్ మాట్లాడుతూ.. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం, గవర్నర్‌ను కలిసే అంశాలపై చర్చించిన ఆయన, ఈ ఉద్యమం చరిత్రలో నిలిచిపోయే గొప్ప ఘట్టమని అన్నారు. కోటి నాలుగు లక్షల 11 వేల 336 మంది ప్రజలు సంతకాలు చేసి తమ తీర్పు ఇచ్చారని వెల్లడించారు.

Read Also: Eat Chapatis in the Morning: రాత్రి చేసిన చపాతీలు ఉదయం తింటున్నారా? అయితే ఇది తెలుసుకోండి

చంద్రబాబు నాయుడు గ్రాఫ్ ప్రజల్లో పడిపోయిందని, అది ఆయనే ఒప్పుకుంటున్నారని జగన్ వ్యాఖ్యానించారు. కలెక్టర్ల పని సరిగ్గా లేక ప్రభుత్వం గ్రాఫ్ పడిపోలేదని, చంద్రబాబు పనితీరు సరిగ్గా లేకనే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాల్లో అపార్థాలు, మోసాలు ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాలు హాస్పిటల్స్, స్కూల్స్, బస్సులు నడపకపోతే ప్రజలు ప్రైవేటు దోపిడీకి గురవుతారని జగన్ హెచ్చరించారు. ప్రైవేటు దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వాలే ఈ వ్యవస్థలను నడపాలని స్పష్టం చేశారు. చంద్రబాబు ఒక్కరే అన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని చూస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో తాము గెలిచి ఉండకపోతే ఆర్టీసీని కూడా అమ్మేసేవారని అన్నారు.

ఆశ్చర్యకరంగా పోలీసు వ్యవస్థను కూడా ప్రైవేట్ చేయాలనే ఆలోచన చేస్తున్నారని, స్కూల్స్‌ను సైతం ప్రైవేట్ భాగస్వామ్యం పేరిట అప్పగించాలనుకుంటున్నారని జగన్ మండిపడ్డారు. అక్టోబర్ 7న ప్రారంభమైన ఈ ఉద్యమం దశలవారీగా ముందుకు సాగిందని, అక్టోబర్ 9న నర్సీపట్నంలోని మెడికల్ కాలేజీని తాను సందర్శించానని గుర్తు చేశారు. అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు పెట్టడమే కాకుండా ధైర్యంగా తమ ఫోన్ నంబర్లు కూడా ఇచ్చారని చెప్పారు. ఈ సంతకాల పత్రాలను గవర్నర్‌కు సమర్పిస్తామని, అనంతరం కోర్టుకు కూడా పంపుతామని జగన్ వెల్లడించారు. అవసరమైతే న్యాయస్థానంలో పిటిషన్ వేసి, ప్రజల సంతకాలనే ఆధారంగా చూపిస్తామని తెలిపారు. ప్రైవేటుకు ఇవ్వడమే పెద్ద స్కామ్ అని మరోసారి స్పష్టం చేసిన జగన్, చంద్రబాబు బుద్ధి మారకపోతే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని నిర్ణయాలను వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు. అధికారం చేపట్టిన రెండు నెలల్లోనే కాలేజీలు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపుతామని పేర్కొన్నారు వైఎస్‌ జగన్.

Exit mobile version