YS Jagan: మొంథా తుపాను కృష్ణా జిల్లా రైతులను తీవ్రంగా దెబ్బతీసింది.. వరి సాగు చేస్తున్న రైతులపై తుఫాన్ ఎఫెక్ట్ భారీగా పడింది.. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 25 మండలాల్లో ఈ ఖరీఫ్ సీజన్లో 1.54 లక్షల హెక్టార్లలో వరి, 24 వేల హెక్టార్లలో వివిధ రకాల ఉద్యాన పంటలను రైతులు సాగు చేశారు. వరి సాగుకు రైతులు ఎకరాకు 25 వేల నుంచి 30 వేల వరకూ పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం వరి పొలాలు పొట్ట దశలో కొన్ని.. కంకులు గట్టి పడే దశలో మరికొన్ని ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కోత దశకు కూడా చేరాయి. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో వచ్చి పడిన మొంథా తుఫాన్ రైతులను తీవ్రంగా నష్టపరిచింది. వరుసగా మూడు రోజులు పాటు కురిసిన వర్షాలతో రైతులు కుదేలయ్యారు.. చేతికందే తరుణంలో ఉన్న వరిపైర్లు నేల వాలాయి. పైరుపై వర్షపునీరు నిలిచిపోయింది. దీంతో కంకులు దెబ్బతిని తాలు వస్తుందని.. తెగుళ్లు విజృంబించి దిగుబడులు గణనీయంగా పడిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
Read Also: Women’s World Cup 2025: మహిళల ప్రపంచ కప్‌లో 22 వికెట్లు తీసిన డీఎస్పీ.. ఆమె ఎవరో తెలుసా?
ఒక్క కృష్ణా జిల్లాలోనే 421 గ్రామాల పరిధిలో 56,040 మంది రైతులు నష్టాన్ని చవిచూశారు. 48,357 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. 54,180 మంది రైతులకు చెందిన 45,040 హెక్టార్ల వరిపంట నేలవాలింది. 288 హెక్టార్లలో వేరుశనగ, 985 హెక్టార్లలో మినుము దెబ్బతిన్నాయి. ఇంకా ఉద్యానశాఖకు సంబంధించి 1,418.22 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.. అయితే ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు తగుచర్యలు చేపట్టడం లేదంటూ వైసీపీ ఆరోపిస్తోంది.. గత ప్రభుత్వ హయాంలో రైతులకు ఇచ్చినట్లుగా పంట భీమాలు లేకపోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఈ పరిస్థితుల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ తుపాను సమయంలోనే గ్రామాల్లో సందర్శించి, బాధితులకు అండగా నిలవాలని తన పార్టీ నేతలకు ఆదేశించారు. దీంతో పార్టీ నేతలంతా ఎక్కడికక్కడ తమ స్థాయిలో బాధితులకు అండగా నిలిచారు. తాజాగా వైఎస్ జగన్ కూడా కృష్ణా జిల్లాలో రేపు పర్యటించనున్నారు..
Read Also: Pakistan: పాకిస్తాన్‌లో ‘‘జై శ్రీ రామ్’’ నినాదాలు చేసిన రష్యా వ్యక్తి.. రియాక్షన్ వీడియో వైరల్..
మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు బయలుదేరుతారు మాజీ సీఎం వైఎస్ జగన్.. పెనమలూరు, పామర్రు, పెడన నియోజకవర్గాల మీదుగా మచిలీపట్నం నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతారు. మధ్యలో తుపాను వలన నష్టపోయిన పంటలను సందర్శిస్తారు. అక్కడే బాధిత రైతులను పరామర్శిస్తారు.. పంట నష్టం అంచనాలు తదితర అంశాల గురించి కూడా అక్కడే రైతులను అడిగి తెలుసుకుంటారు. పెడన నియోజకవర్గంలోని గూడురు మీదుగా అవనిగడ్డ మార్గంలోకి వెళ్లి పలు ప్రాంతాల్లో రైతులను పరామర్శిస్తారు. అక్కడక్కడా నేలకొరిగిన పైర్లను కూడా జగన్ స్వయంగా సందర్శించనున్నారు.. పర్యటన అనంతరం ప్రభుత్వంపై వివిధ రూపాల్లో ఒత్తిడి తీసుకురానున్నారు జగన్.. ఇక, జగన్ పర్యటన నేపధ్యంలో మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాంల నేతృత్వంలో పార్టీశ్రేణులు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు.. జగన్ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ కేడర్ గత పర్యటన లాగానే భారీగా తరలివచ్చే అవకాశం ఉంది..
