మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గంట ముందే గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ముందుగా ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గుంటూరు మిర్చి యార్డ్‌కు బయలుదేరేందుకు షెడ్యూల్ ఖరారు కాగా.. తాజాగా ఓ గంట ముందే (9 గంటలకు) వెళ్లేలా షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. ఉదయం 10 గంటలకు మిర్చి యార్డ్‌కు వద్దకు చేరుకుని.. గిట్టుబాటు ధర రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మిర్చి రైతులతో జగన్ మాట్లాడనున్నారు.
అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వైఎస్ జగన్ పర్యటనకు అనుమతి లేదని మిర్చి యార్డ్ అధికారులు అంటున్నారు. తాము సభలు, సమావేశాలు పెట్టడం లేదని.. కేవలం గిట్టుబాటు ధరపై రైతులతో జగన్ మాట్లాడుతారని వైసీపీ వర్గాలు మిర్చి యార్డ్ అధికారులకు తెలిపారు. కేవలం పర్యటన షెడ్యూల్‌ను మాత్రమే కలెక్టర్, ఎస్పీలకు పంపారని యార్డ్ అధికారులు అంటున్నారు. ఇప్పటికే పరిస్థితిని ఎలక్షన్ కమిషన్‌కు నివేదించారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను బట్టి జగన్ పర్యటనపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జగన్ మిర్చి యార్డ్ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది.