Site icon NTV Telugu

YS Jagan: చంద్రబాబు ప్రభుత్వం పోతుంది.. మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే!

Jagan Ys

Jagan Ys

ఇంకో మూడేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుందని, మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని, రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వైసీపీ ఒక్కటే స్పందిస్తోందని, ఏపీలో ప్రజాస్వామ్యం లేదన్నారు. ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు ఏ ఒక్క హామీ అమలు చేయలేదని మండిపడ్డారు. సూపర్ సిక్స్ సహా 143 హామీలిచ్చి ప్రజలను బాబు మోసం చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొందని వైసీపీ అధినేత చెప్పుకొచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.

‘రాష్ట్రంలో చంద్రబాబు రెడ్ రాజ్యాంగం నడుపుతున్నారు. రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొంది. చట్టాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఏపీలో ఒక్కటే ప్రతిపక్ష పార్టీ.. మిగతా ప్రధాన పార్టీలు టీడీపీతో అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఇవాళ రాష్ట్రంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా పలుకుతున్న ఏకైక పార్టీ వైసీపీ. ఏ వర్గానికి ఏ కష్టం వచ్చినా వైసీపీనే ముందుంటుంది. సూపర్ సిక్స్ హామీలు వదిలేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పార్టీ వైసీపీనే. ప్రజలకు సంఘీభావంగా గొంతు కలపటం, అండగా నిలబడటం చేస్తుంది వైసీపీ. గత ఏడాది కాలంగా ప్రజలను అన్నీ రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రైతన్నల గిట్టుబాటు ధరల కోసం వారికి అండగా నిలిచాం. 2024 డిసెంబర్ 13వ తేదీన అన్నదాతకు అండగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. డిసెంబర్ 24న కరెంట్ ఛార్జీల బాదుడుపై పోరుబాట నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. విద్యార్ధుల ఇబ్బందులను ప్రశ్నించేందుకు మార్చి 12న యువత పోరు పేరిట వారికి అండగా నిలదీసాం. జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమం ద్వారా చంద్రబాబు ఎగ్గొట్టిన హామీలపై గట్టిగా నిలదీసాం. రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం చేశాం. ఇప్పుడు రీకాలింగ్ చంద్రబాబు మానిఫెస్టో కార్యక్రమం చేస్తున్నాం’అని వైఎస్ జగన్ తెలిపారు.

Also Read: Vegetable Price: అర్థ సెంచరీకి దగ్గరలో కూరగాయల ధరలు.. సెంచరీకి చేరువలో ఇంగ్లిష్ వెజిటేబుల్స్!

‘బాబు ష్యూరిటీ అంటూ ప్రజలకు కూటమి పార్టీలు ఇచ్చిన బాండ్లపై వారి మోసాలు ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రజలను చైతన్య వంతులను చేసేలా కార్యక్రమాలు. గతంలో వారిచ్చిన బాండ్లు, చంద్రబాబు ఒక్కొక్కరికీ ఎంత బాకీ ఉన్నాడనే విషయం తెలియజేసే కార్యక్రమం. మేము చేసే ప్రతీ కార్యక్రమంలో ప్రజా ప్రయోజనం కనిపిస్తుంది. మేము లేవనెత్తిన ప్రతీ అంశం ప్రజా శ్రేయస్సు కోసమే. రాష్ట్రంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా చంద్రబాబు దగ్గరకు వెళ్ళటం లేదు, వైసీపీ తలుపు తడుతున్నారు. ఇది చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ప్రజల గొంతును నొక్కివేసే ప్రయత్నం చేస్తున్నారు. మరో మూడేళ్లు ఆగితే తిరిగి వైసీపీ ప్రభుత్వం వస్తుంది, మన సమస్యలు తీరతాయని ప్రజలు ఆలోచిస్తున్నారు’ అని మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.

Exit mobile version