YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!

Ys Jagan Vs Chandrababu Naidu

Ys Jagan Vs Chandrababu Naidu

YS Jagan Questions CM Chandrababu Over DSC Scam: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నియామకాలకు సంబంధించిన వ్యవహారంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి ప్రశ్నలు సంధించారు. డీఎస్సీ అక్రమాలకు సంబంధించి రోజుకో అంశాన్ని ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా పోస్టులు చేస్తున్న ఆయన.. ప్రభుత్వం ఇస్తున్న వివరణలు మరిన్ని అనుమానాలకు, ప్రశ్నలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఒక అభ్యర్థి అర్హత, టెట్ మార్కులు, వెరిఫికేషన్ ప్రక్రియపై పలు ప్రశ్నలను జగన్ లేవనెత్తారు.

వైఎస్ జగన్ ప్రస్తావించిన తొలి అంశం 65 మార్కులకు సంబంధించినది. టెట్‌లో 65 మార్కులు వచ్చినప్పటికీ ఓ అభ్యర్థికి టీచర్ ఉద్యోగం ఎలా లభించిందని ప్రశ్నించారు. ఉద్యోగ నియామకానికి ముందు ఆ అభ్యర్థి ఏకంగా ఏడు దశల వెరిఫికేషన్‌ను పూర్తి చేసినట్లు చెబుతున్నారని, అలాంటప్పుడు అతని అర్హతను ఆ దశల్లో ఎందుకు గుర్తించలేకపోయారని నిలదీశారు. ఇదే వ్యవహారంలో డీఈవో ఆ అభ్యర్థిని అనర్హుడిగా తేల్చిన అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఏడు దశల వెరిఫికేషన్ జరిగిన తర్వాత కూడా అభ్యర్థి అనర్హుడని డీఈవో ఎలా గుర్తించారని ప్రశ్నించారు. ఉద్యోగం ఎలా వచ్చిందో తనకే తెలియదని ఆ అభ్యర్థి చెప్పే పరిస్థితి ఉంటే.. మరి ఏడుసార్లు నిర్వహించిన వెరిఫికేషన్‌లో అసలు ఏం పరిశీలించారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

మరో కీలక అంశంగా 2018 టెట్‌లో వచ్చినట్లు చెబుతున్న 77 మార్కులను వైఎస్ జగన్ ప్రస్తావించారు. అధికారులు ఇప్పుడు ఆ అభ్యర్థికి 2018లో నిర్వహించిన టెట్‌లో 77 మార్కులు వచ్చినట్లు నిర్ధారించారని పేర్కొన్నారు. ఆ మార్కులు అప్పటికే అధికారిక రికార్డుల్లో ఉన్నట్లయితే, నియామక ప్రక్రియలో వాటిని ముందుగానే ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. అలాగే డీఈవో ఆ అభ్యర్థిని అనర్హుడిగా ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందని, ప్రశ్నలు లేవనెత్తిన తర్వాతే 77 మార్కుల అంశంపై వివరణ ఎందుకు వెలుగులోకి వచ్చిందని జగన్ ప్రశ్నించారు.

ఇక 77 మార్కులు ఏ టెట్ పేపర్‌కు సంబంధించినవన్న అంశంపైనా వైఎస్ జగన్ సందేహాలు వ్యక్తం చేశారు. ఆ మార్కులు పేపర్-2లో వచ్చినట్లు అధికారులు చెబుతున్నారని, అయితే ఎస్‌జీటీ పోస్టుకు అవసరమైన టెట్ కేటగిరీ పేపర్-I-A అని పేర్కొన్నారు. అలాంటప్పుడు సంబంధిత అర్హతలను సరిగా పరిశీలించకుండానే ఆ అభ్యర్థి ఏడు దశల వెరిఫికేషన్‌ను ఎలా దాటారని ప్రశ్నించారు. అంతేకాకుండా ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా అదే అభ్యర్థి 2025లో మరోసారి టెట్ పరీక్ష రాసిన విషయాన్ని ప్రస్తావించారు. 2018లోనే 77 మార్కులు సాధించి అర్హత పొందినట్లయితే.. మళ్లీ 2025లో టెట్ రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని నిలదీశారు. ఈ పరిణామాలన్నింటిపై ప్రభుత్వం సమగ్రంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

డీఎస్సీ నియామక ప్రక్రియ పారదర్శకతపై వైఎస్ జగన్ తీవ్ర ప్రశ్నలు లేవనెత్తారు. ఇదేనా నిష్పక్షపాతమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియ అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యవహారాలే డీఎస్సీ స్కామ్‌కు అవకాశం కల్పించలేదా అని నిలదీశారు. డీఎస్సీకి సంబంధించిన ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా నైతిక బాధ్యత వహిస్తారా? లేదా? అని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు.

ట్విస్ట్ 1: 65 మార్కులు → 7 దశల వెరిఫికేషన్
65 మార్కులు టెట్‌లో వచ్చినా టీచరు పోస్టు ఇచ్చారు.
అంతకుముందు ఆ అభ్యర్థి 7 దశల వెరిఫికేషన్ ఎలా పూర్తి చేశాడు?

ట్విస్ట్ 2: ఆ అభ్యర్థి అనర్హుడని డీఈవో తేల్చారు
మరి ఆ 7 దశల్లో అసలు ఏం వెరిఫై చేసినట్టు?

ట్విస్ట్ 3: ఉద్యోగం వచ్చింది… కానీ ఎలా వచ్చిందో అతనికే తెలియదు
మరి ఏడుసార్లు చేసిన వెరిఫికేషన్‌లో ఏం తేల్చారు?

ట్విస్ట్ 4: సడన్‌గా తెరపైకి వచ్చిన 77 మార్కులు
2018లో రాసిన టెట్‌లో అతనికి 77 మార్కులు వచ్చాయని అధికారులు నిర్ధారించారు.
ఆ 77 మార్కులు అప్పటికే రికార్డుల్లో ఉంటే..
అంతకుముందే వాటిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?
డీఈవో అతన్ని అనర్హుడిగా ఎందుకు ప్రకటించారు?
ప్రశ్నలు లేవనెత్తిన తర్వాతే ఈ వివరణ ఎందుకు బయటకు వచ్చింది?

ట్విస్ట్ 5: “రాంగ్ పేపర్” ట్విస్ట్
77 మార్కులు వచ్చినట్లు చెబుతున్నది పేపర్ 2లో
కానీ SGT పోస్టుకు అవసరమైన టెట్ కేటగిరీ Paper-I-A.
మరి అవేమీ చూడకుండానే అతను 7 దశల వెరిఫికేషన్‌ను ఎలా దాటాడు?

ట్విస్ట్ 6: ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్లీ టెట్
ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఆ అభ్యర్థి 2025లో మళ్లీ టెట్ రాశాడు.
2018లో వచ్చిన 77 మార్కులతోనే అతనికి అర్హత ఉంటే..
మళ్లీ టెట్ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది?