YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!

Ys Jagan

Ys Jagan

YS Jagan on Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలు జరుగుతాయో లేదో కూడా స్పష్టత లేదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పేరుతో డ్రామా చేస్తున్నారని, ఆ అంశాన్ని సాకుగా చూపించి ఎన్నికలను వాయిదా వేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ శ్రేణులు గట్టిగా నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు, ఎలా జరిగినా ప్రజలకు వైసీపీ తోడుగా నిలబడుతుందన్నారు. ఎన్నికలు సాఫీగా జరిగితే వైసీపీదే విజయం అని.. ఎన్నికలు సాఫీగా జరగనివ్వకపోయినా గట్టిగా పోరాడదాం అని, జరిగేది కురుక్షేత్ర సంగ్రామం అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతున్నప్పటికీ, అది న్యాయస్థానంలో నిలబడదని సీఎం చంద్రబాబుకు ముందే తెలుసని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. కోర్టు ఆ రిజర్వేషన్లను కొట్టివేస్తే.. అదే కారణంతో స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ప్రభుత్వమే చెబుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిజంగా సజావుగా జరుగుతాయా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నికలు సాఫీగా జరిగే అవకాశం లేదని విమర్శించారు. అధికారాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు, అరెస్టులు, జైలు పంపడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. రోజుకో డ్రామా, రోజుకో నటన, డైవర్షన్ పాలిటిక్స్‌తో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందన్నారు. అయితే ఎన్నికలు ఎప్పుడు, ఎలా జరిగినా ప్రజలకు వైసీపీ అండగా నిలుస్తుందని జగన్ స్పష్టం చేశారు.

ఎన్నికలు సజావుగా జరిగితే వైసీపీదే విజయమని వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ ఎన్నికలు సజావుగా జరగనివ్వకపోయినా పార్టీ శ్రేణులు వెనక్కి తగ్గకుండా గట్టిగా పోరాడాలని సూచించారు. స్థానిక ఎన్నికలు కార్యకర్తలకు సంబంధించిన ఎన్నికలని, ప్రజలకు కార్యకర్తలు అండగా నిలుస్తారని, వారికి పార్టీ కూడా అదే విధంగా తోడుగా ఉండాలన్నారు. స్థానిక ఎన్నికలను ‘కురుక్షేత్ర సంగ్రామం’గా అభివర్ణించిన జగన్.. అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల వినియోగం వంటి అంశాలపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం భవిష్యత్ సాధారణ ఎన్నికల్లో ప్రతిఫలించాలని వ్యాఖ్యానించారు. దౌర్జన్యంతో ఎప్పటికీ పాలకులు రాజ్యం చేయలేరని అన్నారు. 2017లో తన పాదయాత్రకు ముందు జరిగిన నంద్యాల ఉప ఎన్నికను జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. తీవ్ర అధికార దుర్వినియోగం కారణంగా వైసీపీ 35 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిందని చెప్పారు. 2014–19 మధ్య కాలంలో తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు తనవైపు తీసుకున్నారని ఆరోపించారు. ఆ తర్వాత తాను పాదయాత్ర చేపట్టగా ప్రజల నుంచి వచ్చిన స్పందన జనసునామీగా మారిందని అన్నారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. 2019లో వైసీపీ 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న విషయాన్ని ప్రస్తావించారు. పాలకులు ప్రజలకు మంచి చేసి, చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లు అడగాలని, అప్పుడే ప్రజల ఆశీర్వాదం లభిస్తుందని వ్యాఖ్యానించారు. అబద్ధాలు, దౌర్జన్యాలను ప్రజలు ఎల్లప్పుడూ హర్షించరని జగన్ అన్నారు. రాబోయే కురుక్షేత్రంలో వైసీపీ కార్యకర్తలు ప్రజలకు అండగా నిలిచి గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికలను పార్టీ శ్రేణులు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని జగన్ సూచించారు.