YS Jagan: దక్షిణ భారతదేశంలో ఇప్పుడు అంతా హిందీ భాషపై చర్చ సాగుతోంది.. బలవంతంగా మాపై హిందీ రుద్దవద్దని ఎన్డీఏ యేతర పక్షాలు అంటుంటే.. ఎన్డీఏ నేతలు మాత్రం.. హిందీ నేర్చుకోవడంలో తప్పు ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు.. దీంతో, హిందీ భాషపై అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ముదురుతూ వస్తోంది.. ఈ తరుణంలో దక్షిణ భారతదేశంలో హిందీ భాషపై జరుగుతున్న చర్చపై స్పందించారు మాజీ సీఎం వైఎస్ జగన్.. పేద పిల్లలకు పోటీతత్వాన్ని పెంపొందించటానికి హిందీని ఒక భాషగా బోధించవచ్చన్న ఆయన.. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా మాధ్యమం ఇంగ్లీష్ అయి ఉండాలని స్పష్టం చేశారు.. ఇంగ్లీష్ ఒక ప్రపంచ భాష.. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు దానిని అనర్గళంగా నేర్పిస్తే ఉద్యోగ అవకాశాల కల్పనను సులభతరం చేస్తుందన్నారు..
Read Also: YS Jagan: గోదావరి జలాలు, పోలవరం-బనకచర్లపై జగన్ కీలక వ్యాఖ్యలు..
ఇక, పాఠశాలల్లో ప్రాంతీయ భాషలు తప్పనిసరి సబ్జెక్టుగా ఉండాలనే తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలిపారు వైఎస్ జగన్.. హిందీ నేర్చుకోవడం అనేది ఆప్షనల్ సబ్జెక్ట్ గా ఉంటే సరిపోతుందన్నారు.. భాషగా హిందీ నేర్చుకోవడం అవసరమే.. కానీ, విద్య మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే ఉండాలని పేర్కొన్నారు.. ఇంగ్లీష్ మీడియంలో లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, లాంగ్వేజ్ 3, కింద మాతృభాషతో పాటు హిందీ నేర్చుకునే అవకాశం కల్పించాలని వ్యాఖ్యానించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
