NTV Telugu Site icon

YS Jagan: అందుకే ఓడిపోయాం.. జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Jagan

Jagan

YS Jagan: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో అరెస్ట్‌ అయ్యి.. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ములాఖత్‌లో కలిసిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద 307 సెక్షన్ కింద కేసు పెట్టారు.. అన్యాయంగా జైల్లో నిర్బంధించారు.. రాష్ట్రవ్యాప్తంగా ఇవే కార్యక్రమాలు జరుగుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.. టీడీపీకి ఓటు వేయలేదనే కారణంతోనే ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు దొంగ కేసులు పెడుతున్నారు.. వాళ్లే దాడి చేసి వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారు.. ఇంత దారుణంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఏం చేశాడు.. కులం మతం ప్రాంతం చూడలేదు.. ఏ పార్టీకి ఓటు వేశారు అనే విషయాన్ని కూడా చూడకుండా అందరికీ ప్రభుత్వ పథకాలను ఇంటికి అందించామని గుర్తుచేసుకున్నారు.

Read Also: DMK Leader Stokes Row: కుక్క కూడా బీఏ పట్టా పొందగలదు.. డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు

అయితే, ఈరోజు టీడీపీకి ఓటు వేయలేదని మనుషులను కొట్టి కేసులు పెడుతున్నారు.. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు.. వైయస్సార్ విగ్రహాలను పగలగొడుతున్నారు.. ఈ విధంగా దౌర్జన్యాలు చేసి తప్పుడు కేసులు పెట్టి ఆస్తులు ధ్వంసం చేసి రాజకీయాలు చేస్తున్నారు అని మండిపడ్డారు వైఎస్ జగన్.. ఇలానే పరిస్థితి కొనసాగితే చంద్రబాబుకు బుద్ధి చెబుతారు అని హెచ్చరించారు.. ప్రజలు ఎందుకు ఓటు వేశారు చంద్రబాబు ఆలోచించాలన్న ఆయన.. ప్రజల్లో వ్యతిరేకతతో వైసీపీ ఓడిపోలేదు.. ప్రజలకు మంచి చేసిన ఓడిపోయాం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు మోసపూరిత హామీలను ఇచ్చారు.. అందువల్లే 10 శాతం ఓట్లు ఆయనకు అధనంగా వచ్చాయి అన్నారు జగన్.. ఇక, రైతులకు భరోసా ఇస్తామని చెప్పారు.. ఇంతవరకు అతీగతి తెలియదు.. ఎంతమంది పిల్లలు ఉన్నా అమ్మ ఒడి ఇస్తానని చెప్పారు.. తల్లికి వందనం అని పేరు మార్చారు.. కానీ, ఆ డబ్బులు ఏమయ్యాయి? అని నిలదీశారు.

Read Also: Bhatti Vikramarka: ప్రధాని మోడీ, అమిత్ షాతో సీఎం రేవంత్ చర్చలు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వినతిపత్రం

18 ఏళ్లు పైబడిన మహిళలకు నెలకు 15 వందల ఆర్థిక సాయం చేస్తామన్నారు.. వీటి మీద దృష్టి పెట్టే పని చంద్రబాబు చేయాలి.. ఇవేవి పట్టించుకోకుండా భయాందోళనలకు గురిచేస్తున్నారు అని ఆరోపించారు జగన్.. కారంపూడిలో ఘటన ఎన్నికలు జరిగిన మరుసటి రోజు జరిగింది.. డీఎస్పీ అనుమతి తీసుకుని దళిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే వెళ్లారు.. మే 14న ఘటన జరిగితే తొమ్మిది రోజుల తర్వాత రామకృష్ణారెడ్డి పై హత్యాయత్నం కేసు పెట్టారు.. ఒక పథకం ప్రకారమే కేసులు పెట్టారు.. ఎన్నికల రోజున పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో వద్ద జరిగిన ఘటన కేసు పెట్టారని.. దళితులను ఓటు వేయకుండా అడ్డుకున్నారు.. దాన్ని ప్రశ్నించేందుకు పిన్నెల్లి వెళ్లారు.. దానిపై కేసు పెట్టారని విమర్శించారు. సిట్ నివేదికలో ఏం జరిగిందో చెప్పలేదని ఫైర్‌ అయ్యారు.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా రామకృష్ణారెడ్డి గెలిచారు.. మంచివాడు కాబట్టే కాదా? ఆయన విజయం సాధించింది..? అలాంటి వ్యక్తిని తప్పుడు కేసుల్లో ఇరికించడం ఎంతవరకూ ధర్మం? అని ప్రశ్నించారు. ఎల్లకాలం చంద్రబాబు అధికారంలో ఉండరు.. చంద్రబాబు పాపంపండుతుంది.. ప్రజల బుద్ధి చెప్పే రోజులు వస్తాయి.. ఇదే మాదిరిగా కొనసాగితే ఇప్పుడు కొత్త సంప్రదాయానికి నాంది పలుకుతుంది.. ఈ రోజు ఏమైతా విత్తనం వేస్తావో అదే పండుతుంది.. చంద్రబాబు ఇప్పటికైనా ధోరణి మార్చుకోవాలని హెచ్చరించారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..