YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుటుంబానికి మద్దతుగా నిలిచారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో అప్పలరాజు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. సాధారణ రోడ్డు ప్రమాదాన్ని కుట్ర, హత్య కేసుగా చిత్రీకరించి రాజకీయ వేధింపులకు దిగుతోందని విమర్శించారు.
ఈ సంద్రాభంగా జగన్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు ఎవరూ ఉద్దేశపూర్వకంగా చేయరని, ప్రమాదాన్ని హత్యగా లేదా కుట్రగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించారు. సీదిరి అప్పలరాజు కుమారుడు కేవలం 18 ఏళ్ల యువకుడని, ఇటీవలే నీట్ పరీక్ష రాశాడని గుర్తు చేశారు. అనుకోకుండా జరిగిన ప్రమాదాన్ని ఆధారంగా చేసుకుని అతని భవిష్యత్తును నాశనం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సామాన్య కుటుంబం నుంచి కష్టపడి ఎదిగిన వ్యక్తి అని జగన్ అన్నారు. పదో తరగతిలో రాష్ట్ర స్థాయి ఫస్ట్ ర్యాంక్ సాధించి, సొంత కృషితో వైద్యుడిగా పేరు తెచ్చుకుని, అనంతరం ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగారని తెలిపారు. అలాంటి బీసీ నాయకుడిని రాజకీయంగా పూర్తిగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు.
ప్రమాదం జరిగిన వెంటనే అప్పలరాజు కుమారుడు 108కు ఫోన్ చేయడమే కాకుండా బాధితుడికి సీపీఆర్ కూడా చేశాడని జగన్ చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో కుట్ర కోణం ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. టీడీపీ నేతలు లేదా ప్రజాప్రతినిధుల వాహనాలతో ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఇదే విధంగా కుట్ర కేసులు నమోదు చేస్తారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే వాహనం ఢీకొని వృద్ధుడు మరణించిన ఘటన, పాతపట్నం ఎమ్మెల్యేకు సంబంధించిన ప్రమాద ఘటనలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.
రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు పరాకాష్టకు చేరుకుందని జగన్ ఆరోపించారు. పార్ధసారధిని పంపించి ర్యాలీలు నిర్వహిస్తూ కులాల మధ్య విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. ప్రతి ఘటనను రాజకీయ కోణంలో చూస్తూ సమాజంలో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని అన్నారు.
బీసీల సంక్షేమంపై కూడా జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. యాదవులపై ప్రేమ ఉందని చెబుతున్న ప్రభుత్వం, ఆచరణలో మాత్రం బీసీలకు అన్యాయం చేస్తోందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సున్నా వడ్డీ, చేయూత, ఆసరా వంటి పథకాలు నిలిచిపోయాయని.. బీసీలు అధికంగా నష్టపోతున్నారని అన్నారు. మూలపేట పోర్టు, ఫిషింగ్ హార్బర్లు వంటి అభివృద్ధి ప్రాజెక్టులను తమ ప్రభుత్వం తీసుకొస్తే, ప్రస్తుత ప్రభుత్వం వాటిని అమ్మే దిశగా అడుగులు వేస్తోందని ఆరోపించారు.
సీఎం చంద్రబాబు నాయుడు అబద్ధాలు, మోసాలతోనే రాజకీయాలు చేస్తున్నారని జగన్ తీవ్ర విమర్శలు చేశారు. సీదిరి అప్పలరాజు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని, అప్పలరాజు భార్య తనకు సొంత చెల్లెలు లాంటిదని తెలిపారు.

