NTV Telugu Site icon

YS Jagan: అన్ని వ్యవస్థలను నీరుగార్చి నాశనం చేస్తున్నారు.. ఏపీ ప్రభుత్వంపై జగన్‌ ఫైర్

Ys Jagan

Ys Jagan

YS Jagan: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారి నెలకొన్నాయని.. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.. రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల హామీలు అమలు చేయటం లేదు కాబట్టి ప్రశ్నించే స్వరం లేకుండా అణిచి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతున్నా హామీల అమలు లేదని మండిపడ్డారు. ప్రతివర్గాన్ని మోసం చేస్తు్న్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం మోసం చేయని వారంటూ ఎవరూ ఏపీలో లేరని విమర్శలు గుప్పించారు. అన్ని వ్యవస్థలను నీరు గార్చి నాశనం చేస్తున్నారన్నారు.

ఫీజు రీయింబర్స్ మెంట్ మూడు దఫాలుగా పెండింగ్‌లో పెట్టారని.. విద్యార్థులు రోడ్డెక్కుతున్న పట్టని పరిస్థితి ఉందన్నారు. విద్యా వ్యవస్థ గాడి తప్పిందని.. టోఫెల్, CBSE, ఇంగ్లీష్ మీడియం వంటి పనులు అన్నీ పక్కన పెట్టేశారన్నారు. అమ్మ ఒడి గాలికి ఎగిరి పోయిందన్నారు. ఆరోగ్య శ్రీ, 108, 104 నిధులు చెల్లింపులు లేవని జగన్‌ పేర్కొన్నారు.లక్షన్నర పెన్షన్‌లు తొలగించారన్న ఆయన.. కొత్త పెన్షన్ల నమోదు కార్యక్రమం చేపట్టలేదన్నారు. అన్ని విధాలుగా ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు వైఎస్ జగన్. లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని.. 5 నెలల కాలంలో 95 మంది మహిళలు, పిల్లల మీద అత్యాచారాలు జరిగాయన్నారు. అందులో 7 మంది చనిపోయారని చెప్పారు. టీడీపీ కార్యకర్తలు దగ్గరుండి ఈ పనులు చేస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా సపోర్ట్ చేస్తుందని ఆరోపించారు. తెనాలిలో సహానా అనే యువతిపై టీడీపీ రౌడీషీటర్ దాడి చేసి హత్య చేశాడని అన్నారు. శ్రీకాకుళంలో ఇద్దరు బాలికలపై అధికార పార్టీ నేతల కుమారులు అత్యాచారం చేశారని పేర్కొన్నారు.

Read Also: Andhra Pradesh: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత కీలక భేటీ

చంద్రబాబు బావమరిది ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్‌లో అత్తా కోడలిపై అత్యాచారం జరిగిందని తెలిపారు. కనీసం బాధితులను కూడా నియోజక వర్గ ఎమ్మెల్యే పరామర్శించిన దాఖలాలు లేవని విమర్శించారు. పిఠాపురంలో డంప్ యార్డ్‌లో అత్యాచారం చేసిన పరిస్థితి నెలకొందన్నారు. చంద్రగిరిలో టెన్త్ క్లాస్ పాపపై అత్యాచారం జరిగిందని.. బాధిత పాప తండ్రి మాట్లాడినా పోలీసులు చర్యలు లేవని అన్నారు. బలవంతంగా బాధిత తండ్రితో స్టేట్ మెంట్ ఇప్పిస్తున్నారని ఆరోపించారు. సమాజ స్పృహ ఉన్న వారు సోషల్ మీడియా వారు ప్రశ్నిస్తే రాష్ట్రంలో అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, వారి అనుచరులు రౌడీల మాదిరి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఇసుక ఉచితమని చెప్పి సొంత నేతల జేబుల్లోకి పంపారని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. మద్యం ధరలు తగ్గిస్తామని చెప్పి ధరలు తగ్గలేదన్నారు. అవినీతి అక్రమాల కోసం ప్రైవేట్ వారికి సిండికేట్‌కి ఇచ్చేశారని విమర్శించారు. విద్యుత్ చార్జీలు పెంచారన్నారు.

సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు అంతా యువతేనని.. ప్రశ్నిస్తున్న యువతపై కేసులు పెడుతున్నారన్నారు. ఏడేళ్ల లోపు శిక్ష ఉన్న కేసుల్లో కేవలం 41ఏ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆర్డర్ ఉందన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను ఇబ్బంది పెట్టడం కోసం కుటుంబ సభ్యులను కూడా స్టేషన్ కు తీసుకు వస్తున్నారని మండిపడ్డారు. లోకేష్, పవన్ డీజీపీ మీద ఒత్తిడి తెచ్చి ఇదంతా చేయిస్తున్నారని పేర్కొన్నారు. జగన్ మాట్లాడుతూ..” రెండేళ్ల క్రితం మా అమ్మ కారుకి ప్రమాదం జరిగితే నేను అమ్మను చంపే ప్రయత్నం చేశానని తప్పుడు వార్తలు రాస్తున్నారు. ఇది అసత్యమని విజయమ్మ లెటర్ ఇస్తే అది ఫేక్ అన్నారు. విజయమ్మ వచ్చి వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. అత్యంత దారుణంగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. కడప ఎస్పీకి నా భార్య ఫోన్ చేసినట్టు ఫేక్ న్యూస్ వేశారు. డీజీపీ, పోలీసులకి ఒకటే చెబుతున్నాను. మీ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు మాత్రమే సెల్యూట్ చేయండి. వేరే వారికి సెల్యూట్ చేస్తే వృత్తిని కించ పరిచినట్టే. పోలీసులు కూడా మనస్సాక్షిని ప్రశ్నించు కోవాలి.” అని జగన్‌ అన్నారు.