YS Viveka Case: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడుపెంచింది.. సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ పూర్తి చేయడానికి సిద్ధమైన సీబీఐ అధికారులు.. ఓవైపు విచారణ, మరోవైపు అరెస్ట్‌లు చేస్తోంది.. ఇక, ఈ కేసులో ఈ రోజు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలలయానికి రానున్నారు.. ఇక, తెల్లవారుజామున పులివెందుల నుంచి హైదరాబాద్ బయల్దేరారు. ఉదయం 5.20 గంటలకు వినాష్ రెడ్డి పులివెందులలోని ఆయన నివాసం నుంచి వాహనంలో హైదరాబాద్‌కు పయనం అయ్యారు.. ఆయన వెంట వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు. ఎంపీ వాహనాన్ని అనుసరిస్తూ వైసీపీ నాయకులు భారీగా వాహనాల్లో హైదరాబాద్ బయల్దేరారు..
Read Also: Yerragondapalem: యర్రగొండపాలెంలో టెన్షన్ టెన్షన్.. 144 సెక్షన్ విధింపు..
ఇక, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని తాజాగా మరో నోటీసు ఇచ్చింది సీబీఐ.. దీంతో, ఎంపీ అవినాష్ రెడ్డి హైదరాబాదు బయల్దేరారు.. మధ్యాహ్నం మూడు గంటలకు సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిన్ననే అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయగా… తాజాగా అవినాష్ రెడ్డిని విచారణకు పిలవడంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు హైదరాబాద్ సీబీఐ ఆఫీస్‌లో అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు నాలుగుసార్లు విచారించారు.. ఇవాళ ఐదోసారి సీబీఐ ముందుకు రానున్నారు అవినాష్‌రెడ్డి..
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
మరోవైపు.. వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ.. సాయంత్రం హైదరాబాద్‌లోని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. భాస్కర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి.. ఆ తర్వాత భాస్కర్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇక, వైఎస్ భాస్కర్‌రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలను ప్రస్తావించింది సీబీఐ.. 10 పేజీల రిమాండ్ రిపోర్ట్‌ను సీబీఐ కోర్టుకు సమర్పించింది. వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి పాత్ర ఉందని సీబీఐ అభియోగాలు మోపింది.. ఇక, తన తండ్రి భాస్కర్‌రెడ్డి అరెస్టుపై స్పందించినఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. ఊహించని విధంగా అరెస్ట్ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ధైర్యం కోల్పోకుండా నిజాయితీని నిరూపించుకుంటామని స్పష్టం చేశారు. సీబీఐ ఈ కేసు విచారణలో కీలక అంశాలను విస్మరిస్తోందని… అర్థం పర్థం లేని విషయాలను పెద్దదిగా చూపిస్తోందని ఆరోపించారు. తాము లేవనెత్తిన కీలక అంశాలపై సీబీఐ స్పందించట్లేదన్న ఆయన.. వైఎస్ వివేకా స్వయంగా రాసిన లేఖను కూడా పట్టించుకోవట్లేదన్నారు. వివేకా మరణించిన సమయంలో పోలీసులకు తానే స్వయంగా సమాచారం ఇచ్చానని గుర్తుచేసుకున్నారు. ఈ హత్య గురించి ముందుగా తెలిసింది వైఎస్ వివేకా అల్లుడు రాజశేఖరరెడ్డికే అని చెప్పారు. తన కంటే గంట ముందుగానే ఈ విషయం వివేకా అల్లుడికి తెలిసినా పోలీసులకు చెప్పలేదన్నారు. చివరికి వివేకా రాసిన లేఖను, ఆయన ఫోన్‌ను దాచిపెట్టారని.. ఈ సమాచారాన్ని దాచిపెట్టినా వివేకా అల్లుడిని విచారించట్లేదని ఆరోపించారు వైఎస్ అవినాష్‌రెడ్డి.