Gill-Rohit: ప్రతి ఒక్కరికీ నువ్వు స్ఫూర్తి.. ఆ విషయాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా!

  • టెస్టు క్రికెట్‌ నుంచి రిటైరైన రోహిత్‌ శర్మ
  • రోహిత్‌ నుంచి నేర్చుకున్న విషయాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా
  • భారతదేశం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటుంది
Rohit Gill

Rohit Gill

టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్‌ శర్మ నుంచి నేర్చుకున్న విషయాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని భారత వన్డే వైస్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ అన్నాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా టెస్టు క్రికెట్లో నువ్వు సాధించిన దానికి భారత్‌ కృతజ్ఞతతో ఉంటుందన్నాడు. ప్రతి ఒక్కరికీ నువ్వు స్ఫూర్తి అని గిల్ పేర్కొన్నాడు. తాజాగా రోహిత్‌ టెస్టు క్రికెట్‌ నుంచి రిటైరైన విషయం తెలిసిందే. జూన్‌లో ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవచ్చనే వార్తలు వస్తున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు.

Also Read: IPL 2025 Suspended: ఐపీఎల్‌ 2025 వాయిదాపై బీసీసీఐ అధికారిక ప్రకటన.. వారం రోజులు..!

రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న నేపథ్యంలో శుభ్‌మన్‌ గిల్ గురువారం సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను పంచుకున్నాడు. ‘ఆటగాడిగా, కెప్టెన్‌గా టెస్టు క్రికెట్లో నువ్వు సాధించినదానికి భారతదేశం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటుంది. నాకు, నీతో పాటు ఆడిన, నీకు వ్యతిరేకంగా ఆడిన ప్రతి ఒక్కరికీ నువ్వు స్ఫూర్తి. నీ దగ్గర కొన్ని నేర్చుకున్నాను, వాటిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. నేను ఆడిన అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరైన రోహిత్‌ శర్మకు ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు కెప్టెన్‌’ అని గిల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నాడు. టెస్ట్ క్రికెట్‌లో తదుపరి భారత కెప్టెన్‌గా రోహిత్ స్థానంలో గిల్ నియమితుడయ్యే అవకాశాలు ఉన్నాయి.