ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 వాయిదాపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారిక ప్రకటన చేసింది. ఐపీఎల్ 2025ను ఒక వారం పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఐపీఎల్ భాగస్వాములందరితో సమగ్ర సంప్రదింపుల అనంతరం మే 9 నుండి వారం పాటు టోర్నీని నిలిపివేస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ప్రస్తుతానికి సస్పెన్షన్ ఒక వారం పాటు ఉంటుందని, తదుపరి వివరాలు మరలా తెలియజేస్తామని బీసీసీఐ తెలిపింది.
ఇప్పటికే భద్రతా కారణాల రీత్యా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ మధ్యలోనే రద్దైన విషయం తెలిసిందే. ఈరోజు లక్నో, బెంగళూరు మధ్య ఏకనా స్టేడియంలో మ్యాచ్ జరగాల్సి ఉండగా.. నేటి నుంచి నిలిపివేత అమల్లోకి వచ్చింది. ఐపీఎల్ 2025లో ఇంకా 12 లీగ్ మ్యాచులు ఉన్నాయి. మరోవైయిపు రెండు క్వాలిఫయర్లు, ఒక ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ ఉన్నాయి. ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం మే 25న కోల్‌కతాలో ఫైనల్ మ్యాచ్ ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ (16), బెంగళూరు (16), పంజాబ్ (15), ముంబై (14) టాప్ 4లో ఉన్నాయి.