Fact Check: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న వేధింపులను ప్రస్తావిస్తూ.. బంగ్లాదేశ్‌పై దాడి చేయలేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసినట్లు వీడియోలో ఉంది. అలాగే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను బెదిరించినట్లుగా కూడా ఆ క్లిప్‌లో వినిపిస్తోంది. ఈ వీడియోను ఓ మీడియా సంస్థ దర్యాప్తు చేసింది. అందులో ఈ వీడియో పూర్తిగా డీప్‌ఫేక్ అని తేలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో ఈ వీడియోను ఎడిట్ చేసినట్లు నిర్ధారణ అయింది. నిజమైన వీడియోలో యోగి ఆదిత్యనాథ్ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాల అంశాన్ని లేవనెత్తారు కానీ, వైరల్ వీడియోలో చెప్పినట్లుగా ప్రధాని రాజీనామా చేయాలన్న మాటలు గానీ, ఇతర దేశాలపై బెదిరింపులు గానీ చేయలేదు.
READ MORE: Tiger: భూపాలపల్లి జిల్లాలో మళ్ళీ పెద్దిపులి సంచారం.. ఎద్దును చంపి 100 మీటర్ల దూరం లాక్కెళ్ళిన వైనం
డిసెంబర్ 25, 2025న ఇన్‌స్టాగ్రామ్ యూజర్ imamganj__ ఈ వీడియోను షేర్ చేశాడు. “బంగ్లాదేశ్ పాకిస్థాన్ నుంచి విడిపోయి ఉండకపోతే హిందువులను ఇలా కాల్చేవారు కాదు.. ప్రధాని మోడీజీ, మీరు బంగ్లాదేశ్‌పై దాడి చేయలేకపోతే మీ పదవికి రాజీనామా చేయండి. మేము ధార్మిక సైనికులం, అఖండ భారత్‌లో భాగంగా బంగ్లాదేశ్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం.. ఇవన్నీ పాకిస్థాన్‌కు చెందిన ఆసిమ్ మునీర్ పన్నాగం.. పాకిస్థాన్ తన హద్దుల్లో ఉండేలా మునీర్‌పై చర్యలు తీసుకోవాలి.” అని ఆ వీడియోలో యోగి అన్నట్లు ఉంది. ఈ వీడియో నిజమా కాదా తెలుసుకునేందుకు మీడియా సంస్థ గూగుల్ సెర్చ్ చేసింది. ప్రధాని మోడీపై యోగి ఆదిత్యనాథ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు ఎక్కడా ఎలాంటి వార్తలు లభించలేదు. తర్వాత వైరల్ వీడియోకు సంబంధించిన అసలు వీడియో కోసం వెతికాం. వీడియో కీ ఫ్రేమ్స్‌ను పరిశీలించగా, అదే వీడియో పూర్తి రూపంలో డిసెంబర్ 25, 2025న ANI భారత్ యూట్యూబ్ ఛానెల్‌లో లభించింది.
అది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో యోగి ఆదిత్యనాథ్ చేసిన ప్రసంగం. ఆ ప్రసంగంలో బంగ్లాదేశ్ విషయంలో కొన్ని రాజకీయ వర్గాల “దొంగ మౌనం”పై ఆయన ప్రశ్నించారు. కానీ ప్రధాని రాజీనామా గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. ఉత్తరప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాల్లో యోగి చేసిన ప్రసంగంపై వచ్చిన అనేక వార్తలను కూడా పరిశీలించగా, వాటిలో ఏదీ వైరల్ వీడియోలో ఉన్న వ్యాఖ్యలను ప్రస్తావించలేదు. వీడియోను మరింత నిశితంగా పరిశీలించినప్పుడు, పెదవుల కదలికలు, ఆడియో సరిపోలడం లేదని తేలింది. అలాగే ఆ స్వరం కూడా యోగి ఆదిత్యనాథ్ గొంతులా అనిపించలేదు. దీంతో ఇది ఏఐ సాయంతో తయారు చేసిన వీడియో అయి ఉండవచ్చని అనుమానం బలపడింది. ఎట్టకేలకు ఈ వీడియో ఫేక్ అని నిర్ధారణకు వచ్చింది.