YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.. రాజకీయ నేతల ఓ పార్టీకి గుడ్‌బై చెప్పి.. మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు.. ఈ రోజు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వర రెడ్డి.. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు యర్రం వెంకటేశ్వర రెడ్డి.. ఆయనతో పాటు వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు ఆయన కుమారుడు నితిన్ రెడ్డి, సత్తెనపల్లి బీజేపీ కన్వీనర్ పక్కాల సూరిబాబు.. ఈ కార్యక్రమంలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఏపీఎండీసీ డైరెక్టర్ గాదె సుజాత పాల్గొన్నారు.. కాగా, సత్తెనపల్లి నుంచి 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు యర్రం వెంకటేశ్వర రెడ్డి.. ఇక, ఆ తర్వాత జనసేన పార్టీలో చేరిన ఆయన.. గత ఎన్నికల్లో అంబటి రాంబాబుపై పోటీ కూడా చేశారు.. ఇప్పుడు అనూహ్యంగా వైసీపీ గూటికి చేరారు యర్రం వెంకటేశ్వరరెడ్డి.
ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి అంబటి రాంబాబు.. యర్రం వెంకటేశ్వరరెడ్డి సీనియర్ నేత.. పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి.. వైఎస్ఆర్ తో కలిసి పని చేశారని తెలిపారు. సూరిబాబు కూడా మా పార్టీలోకి రావటం మంచి పరిణామంగా తెలిపారు. వారిద్దరూ జనసేన, బీజేపీలకు రాజీనామా చేసి వైసీపీలో చేరటం సంతోషం అన్నారు.. నన్ను ఓడించాలని ఆరోజు నాదెండ్ల మనోహర్ కుట్ర పన్ని యర్రం వెంకటేశ్వరరెడ్డిని జనసేన టికెట్ ఇచ్చారు.. ఆ తర్వాత ఏ రోజూ ఆయన్ని పట్టించుకోలేదని విమర్శించారు.. రాజకీయాల్లో జనసేన కుట్రలు ఎలా ఉంటాయో ప్రజలు గమనించాలన్నారు మంత్రి అంబటి రాంబాబు.
ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ.. ఎలాంటి అవినీతి మరకలేని వ్యక్తి యర్రం వెంకటేశ్వరరెడ్డి.. వారి సేవలను అన్ని విధాలా ఉపయోగించుకుంటాం అన్నారు.. ఇక, యర్రం వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచాను.. 2009లో మా వాళ్లు జనసేనలో చేరమంటే చేరాను.. జనసేన వాళ్లు ఇటీవల మీటింగ్ పెట్టి కూడా నన్ను పలకరించలేదు.. నాదెండ్ల మనోహర్ అప్పట్లో కండువా కప్పి టికెట్ ఇచ్చారు.. నేను వైసీపిలో చేరటం వలన మా వాళ్లు హ్యాపీగా ఉన్నారని తెలిపారు.. మున్ముందు కూడా పార్టీ కోసం పని చేస్తాను అని వెల్లడించారు.. మరోవైపు.. సూరిబాబు మాట్లాడుతూ.. 2014లో పెదకూరపాడు నుండి కాంగ్రెస్ నుండి పోటీ చేశా.. తర్వాత ఎంపీగా పోటీ చేశాను.. 30 ఏళ్లుగా అంబటి రాంబాబు తెలుసు.. ఆయన వైసీపిలోకి రమ్మని ఆహ్వానించారు.. పేదల సంక్షేమం కోసం పని చేస్తున్న పార్టీ వైసీపీ అన్నారు.. అందుకే ఆకర్షితులై వస్తున్నాం.. పూర్తి స్థాయిలో పార్టీ కోసం పని చేస్తానని పేర్కొన్నారు సూరిబాబు.