మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం నేపథ్యంలో కుర్చీ వివాదంపై కడప నగరం మొత్తంలో ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. ‘హూ ఈజ్ జయశ్రీ’, ‘మహిళలు అంటే చిన్న చూపా’ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సర్వసభ్య సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి సీటు వేయకుండా నిలబెట్టడంపై ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఒక మహిళ ఎమ్మెల్యేకు గౌరవం లేదా, జయశ్రీ పేరు మీద రెండు ఫ్లోర్‌లకు అనుమతి తీసుకొని నాలుగు ఫ్లోర్ కట్టారు అంటూ ఫ్లెక్సీలు కట్టారు. కార్పోరేషన్ కార్యాలయం దగ్గర కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కడప నగర మేయర్ సురేష్ బాబు సతీమణి ఈ జయశ్రీ.
మున్సిపల్ సర్వసభ్య సమావేశ వేదికపై మేయర్‌కు మాత్రమే కుర్చీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాధవికి వేదికపై సీటు కేటాయించకపోతే.. ఆందోళన చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరించారు. మరికాసేపట్లో మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఆరంభం కానుంది. గత నెల రోజులుగా మున్సిపల్ సమావేశంలో వేదికపై కుర్చీ కోసం వైసీపీ, టీడీపీ మధ్య వార్ నడుస్తోన్న నేపథ్యంలో నేడు జరిగే సమావేశంలో గందరగోళ పరిస్థితులు జరగకుండా పోలీసు బలగాలు మోహరించాయి. కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ విధించారు. ర్యాలీలు, సభలను పోలీసులు నిషేధించారు. క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కడప కార్పొరేషన్‌లోకి ఉద్యోగులను, మీడియాను అనుమతిస్తున్నారు.
Also Read: Dead Body in Parcel: చేసిందంతా చెల్లెలి భర్తే.. నిందితుడు చిక్కితే వీడనున్న చిక్కుముడులు!
నవంబర్ 7వ తేదీన జరిగిన మున్సిపల్ సమావేశంలో గందరగోళం నెలకొనడంతో మున్సిపల్ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ సమావేశాన్ని నేడు మున్సిపల్ అధికారులు నిర్వహిస్తున్నారు. సమావేశానికి భారీ బందోబస్తు కావాలంటూ పోలీసులను మున్సిపల్ మేయర్ సురేష్ బాబు కోరారు. సమావేశంలోకి కార్పొరేటర్లను మాత్రమే అనుమతించేలా అధికారులు ఏర్పాటు చేశారు. అయితే 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిన నేపథ్యంలో సమావేశం రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ వద్ద ఎటువంటి గందరగోళ పరిస్థితులు ఎదురవకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు.