NTV Telugu Site icon

MP Vijayasai Reddy: ఏపీ ప్రజలు కాంగ్రెస్‌ను ఎన్నటికీ క్షమించరు..

Vijayasai Reddy

Vijayasai Reddy

MP Vijayasai Reddy: స్వార్థ రాజకీయ ప్రయోజనాల సాధన కోసం పార్లమెంటరీ సంప్రదాయాలను సైతం తుంగలో తొక్కి హేతుబద్ధత లేకుండా అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్‌ విభజనకు పాల్పడిన కాంగ్రెస్‌ పార్టీని రాష్ట్ర ప్రజలు ఏనాటికీ క్షమించబోరని వైఎస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా పొందలేకపోవడానికి కారణం ముమ్మాటికీ కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఘోర తప్పిదమే కారణమని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని విభజన బిల్లులో పొందుపరచి పార్లమెంట్‌ ఆమోదం పొందినట్లయితే ఆంధ్రప్రదేశ్‌కు హోదా చట్టబద్దంగా లభించి ఉండేదన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రణాళికా సంఘానికి పంపించడం వలనే హోదా అంశం చట్టబద్దతను కోల్పోయిందని శ్రీ విజయసాయి రెడ్డి కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తరఫున రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకటిస్తూ విజయసాయి రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 2004 నుంచి 2014 వరకు సాగిన కాంగ్రెస్‌ దుష్పపరిపాలనతో పోల్చుకుంటే భారత్‌ సాధించిన గణనీయమైన ప్రగతి రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పుకోదగ్గ విశేషంగా ఆయన అభివర్ణించారు. చరిత్రకు సైతం గంతలు కట్టి దశాబ్దాల తమ పాలన ఎంత గొప్పదో చెప్పుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ తాపత్రయపడుతుంటుంది. ఇలాంటి చిల్లర రాజకీయాలతో కాంగ్రెస్‌ దేశ ప్రజలను వంచించలేదు. కాంగ్రెస్‌ దుష్పరిపాలనకు అతి పెద్ద బాధిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. హేతుబద్దత లేకుండా అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఆర్థిక, సామాజిక వ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బ తీసిందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

Read Also: AP Assembly: గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం.. అసెంబ్లీ ముందుకు రెండు కీలక బిల్లులు

ఆగమేఘాలపై లోక్ సభలో విభజన బిల్లు…
నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ స్వార్ధంతో ఆగమేఘాలపై ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును ఏ విధంగా పార్లమెంట్‌ ముందుకు తీసుకువచ్చి అంత అప్రజాస్వామికంగా దానికి ఆమోదం పొందిందో విజయసాయి రెడ్డి ఈ సందర్భంగా రాజ్యసభలో వివరించారు. 2014 ఫిబ్రవరి 18న కాంగ్రెస్‌ పార్టీ లోక్‌ సభలో ఆంధ్రప్రదేశ్‌ విభజన బిల్లును ప్రవేశపెట్టింది. దీనిపై జరిగిన చర్చలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ పార్టీ సభ్యులే ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రధానంగా నీళ్ళు, విద్యుత్‌ పంపిణీ, రెవెన్యూ పంపిణీ, రాజధాని హైదరాబాద్‌ వంటి ప్రధాన అంశాలపై ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగేలా బిల్లులో సవరణలు చేపట్టాలని ఏపీకి చెందిన కాంగ్రెస్‌ ఎంపీలు పట్టుబట్టారు. కానీ ఈ సమస్యలపై వారి భయాలు, ఆందోళనలను తొలగించేలా బిల్లులో సవరణలు చేయడానికి బదులుగా బిల్లుకు ఆమోదం పొందడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ముందుకు సాగింది. లోక్‌ సభ ద్వారాలు మూసేశారు. గ్యాలరీలను ఖాళీ చేయించారు. సభా కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేయకుండా లైవ్‌ టెలికాస్ట్‌ను సైతం నిలిపేసి విభజన బిల్లును లోక్‌ సభలో పాస్‌ చేశారని శ్రీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజించడానికి కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు పెట్టిన అనేక షరతులను సైతం లెక్క చేయకుండా పార్లమెంటరీ సంప్రదాయాలను సైతం తుంగలో తొక్కి కేవలం గంటన్నర వ్యవధి చర్చలోనే లోక్‌ సభలో విభజన బిల్లు ఆమోదం పొందేలా కాంగ్రెస్‌ పార్టీ నికృష్ట చేష్టలకు పాల్పడిందని ఆయన విమర్శించారు.

Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

హోదాను బిల్లులో ఎందుకు చేర్చలేదు…
లోక్‌సభ ఆమోదం పొందిన విభజన బిల్లు 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభకు చేరింది. బిల్లులో పేర్కొన్న అంశాల ఆధారంగా విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరుగుతుందని భావించిన రాజ్యసభ సభ్యులు విభజన అనంతరం ఆర్థికాభివృద్ధికి దోహదం చేసేలా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని సభలో గట్టిగా పట్టుబట్టారు. నాడు బీజేపి సభా నాయకుడి స్థానంలో ఉన్న మాజీ ఉపరాష్ట్రపతి కూడా ఆంధ్రప్రదేశ్‌కు కనీసం పదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని సభలో డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆంధ్రప్రదేశ్‌కు అయిదేళ్ళపాటు ప్రత్యేక హోదా కల్పిస్తున్నట్లుగా రాజ్యసభలో ప్రకటించారు. అయితే ప్రత్యేక హోదాపై ప్రధాన మంత్రి ఇచ్చిన హామీని చట్టబద్దం చేసేందుకు వీలు కలిగిస్తూ విభజన బిల్లుకు తగిన సవరణలు చేసి మళ్ళీ లోక్‌సభ ఆమోదం కోసం పంపించాలి. కానీ కాంగ్రెస్‌ పార్టీ ఆ పని చేయలేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా హామీ కేవలం కంటి తడుపు చర్యగా మాత్రమే కాంగ్రెస్‌ పరిగణించిందని శ్రీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశపూర్వకంగానే ప్రత్యేక హోదా అంశాన్ని బిల్లులో చేర్చ లేదు. బిల్లులో చేర్చి ఉంటే చట్టపరంగా దానిని అమలు చేయాల్సిన బాధ్యత ఆ పార్టీపైన, అప్పటి ప్రభుత్వంపైన ఉండేది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షల పట్ల కాంగ్రెస్‌ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రత్యేక హోదా ఇచ్చందుకు చట్టపరంగా చర్యలు తీసుకుని ఉండేది. విభజన చట్టానికి 2014 మార్చి 1న రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఆ తర్వాత చట్టం అమలులో రావడానికి మూడు నెలల సుదీర్ఘ విరామం లభించింది. అప్పటికి కూడా ప్రత్యేక హోదాపై మంత్రివర్గంలో తీర్మానం చేయకుండా కాంగ్రెస్‌ పార్టీ సాచివేత ధోరణిని అనుసరించింది. ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది కాంగ్రెస్‌ పార్టీకి కేవలం ఒక ఎన్నికల అంశంగా మాత్రమే కనిపించింది తప్ప చిత్తశుద్ధి చూపలేదని శ విజయసాయి రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌కు ఎన్నికల అంశం అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మాత్రం ప్రత్యేక హోదా అనేది వారి మనోభావాలకు సంబంధించిన అంశం. హోదా విషయంలో కాంగ్రెస్‌ కపట నాటకం ఆడి ఈరోజున వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని నిందిస్తోందని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు. హోదా విషయంలో అసలు దోషి కాంగ్రెస్‌ పార్టీనే. కానీ ఈరోజున ఎవరో మాణిక్యం టాగూర్‌ అనే కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు పొద్దుట నిద్ర లేచిన దగ్గర నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు.

హోదా కోసం ప్రధానమంత్రికి పదేపదే విజ్ఞప్తి…
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి ఎనిమిదిసార్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రధానమంత్రిని కలిసి ప్రత్యేక హోదా కోసం విజ్ఞప్తి చేశారు. అలాగే హోం మంత్రిని కలిసిన పన్నెండుసార్లు ఆయన వద్ద ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తూనే వచ్చారు. ఇక అటు లోక్‌సభ ఇటు రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు లెక్కలేనన్ని సార్లు ప్రత్యేక హోదా కోసం ప్రభుత్వాన్నికోరుతూనే ఉన్నారని విజయసాయి రెడ్డి వివరించారు.