వైఎస్ఆర్ జిల్లా కడపలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేష్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పులివెందుల ఎమ్మెల్యే గా వైఎస్ జగన్ రాజీనామా, కడప ఎంపీ గా వైఎస్ అవినాష్ రాజీనామా అంటూ వచ్చిన వార్తలను ఖండించారు. కేవలం దుష్ప్రచారం చేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సురేష్ బాబు.. 2011 లో జరిగిన కడప పార్లమెంట్ ఉప ఎన్నికలలో కడప దెబ్బ ఢిల్లీ అబ్బా అనేలా ప్రజల తీర్పు ఇచ్చారన్నారు. వైఎస్ జగన్ కు వచ్చిన మెజారిటీ ఒక చరిత్రాత్మకమని, ఇది దేశమంతా చూశారు.. కానీ ఇప్పుడు ఏదో కడప ఉప ఎన్నిక అంటూ తప్పుడు కథనాలు రాగానే ఆయన స్పందించడం సిగ్గుచేటన్నారు సురేష్ బాబు.
ఉచిత ఇసుక అని ప్రజలను మభ్య పెట్టారు.. ఒక ట్రాక్టర్ ఇసుక 3500 అమ్ముతున్నారని, 1700 ప్రభుత్వానికి చెల్లించేలా, మిగతా మొత్తం ట్రాక్టర్ కు వసూలు చేస్తున్నారన్నారు. ప్రజలను మోసపూరిత హామీలు ఇచ్చారు తప్ప.. నెల లోపే ప్రజలను నిట్ట నిలువునా ముంచుతున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుకు ఒక్క చర్య అయినా తీసుకున్నారా అని ఆయన ధ్వజమెత్తారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు.. చేస్తూనే ఉన్నారని, ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ ఒక్కడే అని ఆయన అన్నారు.