NTV Telugu Site icon

Yarlagadda Venkata Rao: వైసీపీకి గుడ్‌బై.. గన్నవరం నుంచి గెలిచి జగన్‌ని అసెంబ్లీలో కలుస్తా..!

Yarlagadda Venkata Rao

Yarlagadda Venkata Rao

Yarlagadda Venkata Rao: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు యార్లగడ్డ వెంకట్రావు.. గన్నవరం వైసీపీ లీడర్‌ అయిన ఆయన.. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలోకి దిగాడు.. కానీ, టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే, ఆ తర్వాత వంశీ వైసీపీకి దగ్గర కావడంతో.. యార్లగడ్డ వర్సెస్‌ వల్లభనేనిగా పరిస్థితి మారింది. తాజాగా నెలకొన్న పరిణామాలతో కలత చెందిన యార్లగడ్డ వైసీపీకి గుడ్‌బై చెప్పేందుకు నిర్ణయం తీసుకున్నారు.. తన అనుచరులు, ముఖ్య నేతలతో సమావేశం అయిన యార్లగడ్డ వెంకట్రావు.. సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను టికెట్ కావాలని అడిగితే పార్టీ పెద్దలకు ఏం అర్థం అయ్యిందో నాకు తెలియటం లేదన్నారు.. వైఎస్‌ ఉండి ఉంటే నాకు ఇలా జరిగేది కాదు అని అందరూ అంటున్నారు.. వైఎస్‌ ఉంటే పార్టీ ఎలా ఉంటుందో.. అలానే ఉంటుంది అనుకున్నాను.. కానీ, ప్రభుత్వం వచ్చినా కేసులు మాత్రం అలాగే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Kiara Advani : నటన పరంగా నాతో నేనే పోటీ పడుతూ వుంటాను..

ఇక, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు యార్లగడ్డ.. సజ్జల వ్యాఖ్యలు తనను బాధకు గురి చేశాయన్న ఆయన.. KDCC బ్యాంక్ ను అభివృద్ది చేసినా పనికి రాను అని పక్కన పెట్టారని.. టీడీపీ కంచుకోట గన్నవరంలో వైసీపీకి అభివృద్ధి చేశానన్నారు. గన్నవరం అభ్యర్ధిగా నేను సరిపోను అని అన్నారు.. పార్టీకి ఇంత పని చేస్తే నాకు ఈ దుస్థితి వస్తుందని అనుకోలేదు.. 2019లో సరిపోయిన నా బలం.. ఇప్పుడు సరిపోదా అంటూ నిలదీశారు. మూడేళ్లుగా నాకు ప్రత్యామ్నాయం చూపలేదు.. తడి గుడ్డతో గొంతు కోశారంటూ ఎమోషనల్‌ అయ్యారు. టీడీపీ నుంచి గెలిచి వచ్చిన వారు రావటమేనా? పార్టీ బలం అని ప్రశ్నించారు. రాజకీయం, నైతికత అనేది వైఎస్‌కి ఉంది.. రాజకీయ పార్టీలకు నమ్మించిన వ్యక్తులను కాపాడుకోవాలని సూచించారు.

Read Also: Araria Journalist : జర్నలిస్ట్ దారుణ హత్య.. విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి

మరోవైపు.. కొందరు స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలని నన్ను కోరుతున్నారని వెల్లడించారు యార్లగడ్డ.. ఇప్పటి వరకు నేను చంద్రబాబు, లోకేష్ వంటి టీడీపీ నేతలు ఎవరినీ మూడున్నరేళ్లుగా కలవలేదని స్పష్టం చేశారు. నేను టీడీపీ నేతలను కలిసినట్టు నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తా.. ఎన్నికల్లో పోటీ చేయను అంటూ సవాల్‌ చేశారు. ప్రతిరోజూ నా ప్రతివ్రత్యం నిరూపించుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. నేను టీడీపీ నేతలను కలిశాను అన్నట్టు నిత్యం నాపై నిందారోపణలు చేశారని మండిపడ్డారు. ఇక, చంద్రబాబును కలుస్తాను, అపాయింట్ మెంట్ ఇవ్వండని కోరునున్నట్టు పేర్కొన్నారు. మొత్తంగా వైసీపీకి గుడ్‌బై చెబుతున్నట్టు పరోక్ష వ్యాఖ్యలు చేసిన ఆయన.. టీడీపీలోకి వెళ్తున్నా అనే విధంగా ఇండికేషన్‌ ఇచ్చారు.. త్వరలోనే చంద్రబాబును కలుస్తాను, అపాయింట్ మెంట్ ఇవ్వాలని చంద్రబాబుని కోరతానన్న ఆయన.. టీడీపీ టికెట్ ఇస్తుందో లేదో నాకు తెలియదన్నారు. మరోవైపు.. సీఎం వైఎస్‌ జగన్‌ అపాయింట్‌మెంట్ ఇవ్వక పోయినా.. ఆయన్ని అసెంబ్లీలో కలుస్తానని వ్యాఖ్యానించారు.. వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి వైఎస్‌ జగన్, గన్నవరం నుంచి నేను గెలిచి అసెంబ్లీకి వెళ్తా.. అక్కడ వైఎస్‌ జగన్‌ను కలుస్తానంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు యార్లగడ్డ వెంకట్రావు.