Yanamala Ramakrishnudu: బీసీలను నిర్లక్ష్యం చేస్తూ, వారికి అన్యాయం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పతనం తప్పదని వివిధ పార్టీలకు చెందిన బీసీ నాయకులు వ్యాఖ్యానించారు. రాజమండ్రి ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వివిధ పార్టీలు, వివిధ వర్గాలకు చెందిన నాయకులు హాజరైన ఈ సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దయిన ఆదరణ వంటి బిసి పథకాలన్నీ పునరుద్ధరిస్తామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.
Also Read: BJP Manifesto: తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో విడుదల.. కీలక హామీలు ఇవే..
తెలుగుదేశం పార్టీ ముందునుంచి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని గుర్తుచేశారు. బీసీలందరూ ఐక్యంగా ఉండాలన్నారు. సంఖ్యాపరంగా బీసీలు ఎక్కువగా ఉన్నప్పటికీ చదువు లేకపోవడం, ఆర్థికంగా బలంగా లేకపోవడం వంటి కారణాల వల్ల రాజకీయంగా ఎదగలేని పరిస్థితి నెలకొందని విశ్లేషించారు. రాజకీయంగా ఎదిగితే కోటీశ్వరుని కంటే పవర్ ఫుల్‌గా ఉండవచ్చని, అందుకే ఐక్యతగా ఉంటూ రాజకీయంగా ఎదగాలన్నారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ పుణ్యమా అని ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడిందని , ప్రజాస్వామ్యం ఖూనీ అయితే బడుగు బలహీన వర్గాలే నష్టపోతాయని యనమల చెబుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత బీసీలపై ఉందన్నారు. రిజర్వేషన్ 50శాతం మించకూడదన్న సుప్రీం కోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో రాజ్యాంగ సవరణ చేసైనా సరే ఈ నిబంధన తొలగించేలా చూడాలన్నారు.
Also Read: Bandi Sanjay : అధికారంలోకి రాగానే… ముథోల్ ను దత్తత తీసుకుంటా
పరిశీలకుడిగా వచ్చిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, శాసన మండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రి కేఎస్ జవహర్, జనసేన నాయకులు సీపీఐ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు మాట్లాడుతూ ఒక్కసారి ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ బీసీలను అణగదొక్కుతున్నారని విమర్శించారు. బీసీలు తలచుకుంటే జగన్ పాలన అంతం అవుతుందని ఆయన అన్నారు. జగన్ కుటుంబం మొదటి నుంచి బీసీ వ్యతిరేకులని బుద్ధా వెంకన్న అన్నారు. నా బీసీ, నా ఎస్సీ , నా ఎస్టీ అంటూ జగన్ చెప్పడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఇక్కడ నా అంటే నాశనం అని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ మొదటినుంచి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని గుర్తుచేశారు. యనమల రామకృష్ణుడు వంటి నేతలను బలహీన వర్గాలనుంచి తయారుచేసిన ఘనత తెలుగుదేశం పార్టీదన్నారు. అయితే ఇందుకు విరుద్ధంగా జగన్ ప్రభుత్వం బీసీలపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బుద్ధా వెంకన్న విమర్శించారు. బీసీల మధ్య చిచ్చుపెట్టడానికి జగన్ సర్కార్ చేస్తున్న కుట్రలను గుర్తించి బీసీ వర్గాలంతా ఐక్యంగా ఉండాలని ఆయన సూచించారు. సంపద సృష్టించడం తెలుగుదేశం చేసిందని ఫలితంగా బలహీన వర్గాలకు, పేదలకు మేలు చేకూరిందని అన్నారు. జగన్ ప్రభుత్వం సంపద సృష్టించడం మానేసి పేదలను దోచుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు. అరాచక పాలన, దోపిడీ పాలనను అంతం చేయడానికి బీసీలు సంఘటితం కావాలని పిలుపు నిచ్చారు.