YSRCP: ఏపీలో ఎన్నికల వేళ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగుదేశం పార్టీలో కొనసాగిన యనమల కృష్ణుడు నేడు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు ముఖ్యమంత్రి జగన్ వైసీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. యనమల కృష్ణుడితో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో టీడీపీ నేతలు పి. శేషగిరిరావు, పి. హరిక్రిష్ణ, ఎల్. భాస్కర్ చేరారు. ఈ కార్యక్రమానికి తుని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దాడిశెట్టి రాజా, కాకినాడ వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్ హాజరయ్యారు. కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్ నేతగా ఉన్న యనమల కృష్ణుడు వైసీపీలో చేరడంతో వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ.. టీడీపీలో డబ్బున్న వాళ్లకి, ఎన్నారైలకే టిక్కెట్లిచ్చారని.. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారిని మోసం చేశారని విమర్శించారు. టీడీపీలో 42 సంవత్సరాలగా ఉన్నానని.. చంద్రబాబు, యనమల మోసం వల్లే తనకు అన్యాయం జరిగిందన్నారు. చంద్రబాబు బీసీలని మోసం చేశారనడానికి తానే ఉదాహరణగా మిగిలానని ఆయన తెలిపారు. ప్రజలకి సేవ చేయడానికే రాజకీయాల్లో ఉన్నానన్నారు. “నాకు తుని టిక్కెట్ ఇవ్వకపోగా….నన్ను ఘోరంగా అవమానించారు. తునిలో ఏరోజూ యనమల రామకృష్ణుడు లేరు. 42 సంవత్సరాలగా ప్రజలమధ్య ఉన్నది నేనే. అయిదేళ్ల సీఎం వైఎస్ జగన్ పాలన చూసి వైఎస్సార్‌సీపీలో చేరా.. సీఎం వైఎస్ జగన్ ని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి కృషి చేస్తా. కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్….తునివెమ్మెల్యేగా దాడిశెట్టి రాజా గెలుపుకి కృషి చేస్తా” అని యనమల రామకృష్ణుడు అన్నారు.
Read Also: Malla Reddy: నువ్వే గెలుస్తావన్న మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్.. కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి
42 ఏళ్లు టీడీపీ కోసం పాటుపడ్డానని, తనను దూరం పెట్టాలని కొందరు దురుద్దేశంతో పనిచేశారని యనమల కృష్ణుడు అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ మారడం బాధగా ఉన్నా తప్పడంలేదని అన్నారు. జగన్ ఆహ్వానం మేరకు వైసీపీలోకి వెళుతున్నానని కృష్ణుడు వెల్లడించారు. కాకినాడ జిల్లాలో యనమల బ్రదర్స్ టీడీపీకి కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడికి, తమ్ముడు యనమల కృష్ణుడికి మధ్య విభేదాలు నెలకొన్నాయి. 2014, 2019 లో తుని నుంచి పోటీ చేసిన యనమల కృష్ణుడు ఓడిపోయారు. ఈసారి తుని టికెట్ ను టీడీపీ హైకమాండ్ యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే, కృష్ణుడు టీడీపీని వీడినట్టు తెలుస్తోంది.