Yadadri Temple: కార్తీక మాసం నేపథ్యంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ ఎప్పటిలాగే భారీ స్థాయిలో నమోదైంది. ఈ మాసంలో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 20 లక్షల 52 వేల దాటింది. భక్తుల సంఖ్య పెరగడంతో దేవాలయ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ఈ కార్తీక మాసంలో యాదాద్రికి వచ్చిన మొత్తం ఆదాయం రూ.17 కోట్లు 62 లక్షలు 33 వేల 331. గతేడాది ఇదే కాలంలో వచ్చిన ఆదాయం రూ. 14 కోట్లు 30 లక్షలు 69 వేల 481. అంటే ఈసారి గతేడాదితో పోలిస్తే రూ. 3 కోట్లు 31 లక్షలు 63 వేల 850 అదనపు ఆదాయం స్వామివారి దేవాలయానికి వచ్చింది. అధిక భక్తులు, సేవలు, విరాళాలు, ప్రాసాద అమ్మకాల కారణంగా ఆదాయం పెరిగిందని దేవస్థానం అధికారులు పేర్కొంటున్నారు. కార్తీక మాసంలో యాదాద్రి యాత్రకు భక్తుల విశ్వాసం, ఆసక్తి ఏ స్థాయిలో ఉందో ఈ సంఖ్యలు మరోసారి రుజువు చేస్తున్నాయి.
READ MORE: Nagachaithanya : నాగచైతన్య కొత్త మూవీ మేకింగ్ వీడియో.. పెద్ద ప్లానే చేశారుగా
ఆలయ స్థల పురాణం
యాదగిరి గుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. స్కాంద పురాణం ప్రకారం విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు. అతని కుమారుడు హాద ఋషి. అతనినే యాదర్షి అని కూడా అంటారు. అతను నరసింహ స్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయస్వామి అనుగ్రహంతో యాదర్షి తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహ మూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్షి కోరగా స్వామి వారు కరుణించి లక్ష్మి సమేతుడై దర్శన మిచ్చి “ఏం కావాలో కోరుకో” మంటే యాదర్షి స్వామి వారిని “శాంత మూర్తి రూపంలోనే కొలువై కొండపై ఉండి పొమ్మని కోరాడు. ఆ విధంగా లక్ష్మి నరసింహ స్వామి కొండపై అలా కొలువై ఉండి పోయాడు. కొన్నాళ్లకు స్వామివారిని వేర్వేరు రూపాల్లో చూడాలనిపించి యాదర్షి మరలా తపస్సు చేశాడు. యాదర్షి తపస్సుకు మెచ్చి స్వామి వారు జ్వాలా, యోగా, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అంటారు. యాదర్షి కోరిక మేరకు వెలసిన స్వామి కాబట్టి ఆయన పేరు మీదనే ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. అయితే ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ క్రింద వున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు.