WTC Points Table 2025 Latest: కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఏకంగా ఐదో స్ధానం నుంచి టాప్ ప్లేస్‌కు చేరింది. భారత జట్టు పాయింట్ల శాతం 54.16గా ఉంది.
డబ్ల్యూటీసీ సైకిల్‌లో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాను అధిగమించి భారత్ టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లింది. తొలి టెస్టులో ఓటమి భారత్‌ను ఆరో స్థానానికి చేర్చగా.. రెండో టెస్ట్ విజయం అగ్రస్థానానికి తీసుకొచ్చింది. మరోవైపు ఘోర ఓటమి చవిచూసిన దక్షిణాఫ్రికా 50 శాతం పాయింట్లతో రెండో స్ధానానికి పడిపోయింది. న్యూజిలాండ్ (50.0), ఆస్ట్రేలియా (50.0), బంగ్లాదేశ్ (50.0), పాకిస్తాన్ (45.83) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. వెస్టిండీస్ (ఏడో), ఇంగ్లండ్ (ఎనిమిదో), శ్రీలంక (తొమ్మిదో) స్థానాల్లో ఉన్నాయి.
Also Read: Rohit Sharma: ఇకనైనా నోరుపారేసుకోవడం ఆపితే మంచిది.. విమర్శకులకు గట్టి కౌంటరిచ్చిన రోహిత్!
ప్రస్తుతం ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే రెండు టెస్టులను ఆసీస్ గెలిచింది. మూడో టెస్టు అనంతరం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మళ్లీ మార్పులు చోటుచేసుకోన్నాయి. ఒకవేళ మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే.. డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరే అవకాశం ఉంది. అప్పుడు భారత్ రెండో స్థానానికి చేరుకుంటుంది.