NTV Telugu Site icon

Team India: నాకు ఆడాలని అస్సలు లేదు.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్న టీమిండియా కీపర్!

Wriddhiman Saha

Wriddhiman Saha

టీమిండియా వెటరన్‌ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో ఆడటమూ కష్టమేనని ప్రకటించిన 40 ఏళ్ల సాహా.. రంజీ ట్రోఫీ 2024 తనకు చివరిదని చెప్పాడు. తాజాగా సాహా వీడ్కోలు గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. గతేడాదే రిటైర్‌మెంట్‌పై నిర్ణయం తీసుకున్నానని, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో మాట్లాడిన అనంతరం తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలిపాడు. గతేడాదే క్రికెట్‌ను ఆస్వాదించడం ఆపేశానని చెప్పుకొచ్చాడు. క్రిక్‌బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాహా పలు విషయాలపై స్పందించాడు.

‘నిజానికి నాకు రంజీ సీజన్‌ 2024 ఆడాలని అస్సలు లేదు. సౌరవ్ గంగూలీ, నా భార్య ఆడాలని పట్టుబట్టారు. చివరిసారిగా బెంగాల్ తరఫున బరిలోకి దిగమని సూచించారు. సొంత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఎప్పుడూ సంతోషమే. దాదాతో సంభాషణ నా మనస్సును మార్చింది. గతేడాది నా శరీరం పెద్దగా సహకరించలేదు. దాంతో క్రికెట్ ఆడేందుకు కష్టంగా అనిపించింది. మరోవైపు గాయాలు కూడా ఇబ్బంది పెట్టాయి. దీంతో అతికష్టంగా గతేడాది సీజన్‌ను ఆడాను. అయినా సీజన్ మొత్తం ఆడలేకపోయా. ఈ ఏడాది పూర్తి సీజన్ ఆడాలని నిర్ణయించుకున్నా. బెంగాల్ క్వాలిఫై అయితే.. సీజన్ మొత్తం ఆడతా. ఈడెన్‌ గార్డెన్స్‌లో నా చివరి మ్యాచ్‌ ఆడేందు ప్రయత్నిస్తా’ అని సాహా చెప్పాడు.

Also Read: Viral Video: గల్లీ క్రికెట్ మాదిరి.. అలిగి మైదానం వీడిన వెస్టిండీస్ బౌలర్ (వీడియో)!

‘దేశవాళీ క్రికెట్‌లో యువ క్రికెటర్లతో కలిసి ఆడాను. రిషబ్ పంత్‌, ధ్రువ్ జురెల్‌లో ఆడా. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇటీవల అవకాశాలు రాలేదనే బాధ నాకు లేదు. ఎందుకంటే.. క్రికెట్ అంటే ఇష్టంతో ఆడాను. గతేడాది మాత్రం ఆటను ఆస్వాదించలేకపోయా. అప్పుడే క్రికెట్‌ను వదిలేయాలని నిర్ణయం తీసుకున్నా. ఈ రంజీ సీజన్‌ తర్వాత క్రికెట్‌ ఆడటం ఆపేస్తా. ఇక జీవితంలో ముందుగు సాగాలి’ అని సాహా పేర్కొన్నాడు. భారత్‌ తరఫున 40 టెస్టులు, 9 వన్డేలు ఆడిన అతడు మొత్తంగా 1300లకు పైగా పరుగులు చేశాడు. 2010లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సాహా.. చివరిసారిగా 2021లో టెస్టు ఆడాడు.

Show comments