Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!

Miyazaki Mango Ram Mandhir

Miyazaki Mango Ram Mandhir

Ayodhya Ram Mandir: అయోధ్యలోని శ్రీరామ మందిరంలో తొలిసారిగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండుగా పేరుగాంచిన జపాన్‌కు చెందిన ‘మియాజాకి మామిడి’ని శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పించారు. “ఎగ్ ఆఫ్ ది సన్” (Egg of the Sun)గా ప్రసిద్ధి చెందిన ఈ అరుదైన మామిడి పండు అంతర్జాతీయ మార్కెట్‌లో కిలోకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ధర పలుకుతోంది.

అయోధ్య రైతు సాగుచేసిన అరుదైన మామిడి:

ఈ ప్రత్యేక మామిడి పండును అయోధ్యకు చెందిన రైతు ఓంప్రకాశ్ సింగ్ తన తోటలో సాగు చేశారు. సుమారు రెండేళ్ల క్రితం అయోధ్య వాతావరణంలో ఈ జపాన్ రకం మామిడి పెరుగుతుందా లేదా అన్న విషయాన్ని పరీక్షించేందుకు ఆయన ఈ మొక్కను నాటారు. స్థానిక వాతావరణానికి అనుగుణంగా చెట్టు పెరిగి, ఈ ఏడాది దాదాపు డజను పండ్లను ఇచ్చిందని ఆయన తెలిపారు.

×
×
Ad

ఒక్క మామిడి ధర లక్ష రూపాయలు:

మియాజాకి మామిడి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి రకంగా గుర్తింపు పొందింది. ఒక్కో పండు బరువు 150 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు ఉండగా.. ఒక్క పండు విలువ సుమారు రూ.1 లక్ష వరకు ఉంటుందని అంచనా. అధిక తీపి, పీచు పదార్థం, విటమిన్లు సమృద్ధిగా ఉండటం ఈ పండుకు ప్రత్యేకత.

మొదటి పండును రాముడికి సమర్పించిన రైతు:

భారతీయ సంప్రదాయం ప్రకారం తొలి పంటను భగవంతుడికి అర్పించడం ఆనవాయితీ. అదే సంప్రదాయాన్ని పాటిస్తూ చెట్టుకు వచ్చిన తొలి పండిన మియాజాకి మామిడిని తులసి దళంతో కలిసి శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా రైతు ఓంప్రకాశ్ సింగ్ మాట్లాడుతూ.. “ఈ మామిడి ఇతర రకాల కంటే ఎక్కువ తీపిగా ఉంటుంది. ఇందులో పీచు పదార్థం, పోషకాలు అధికంగా ఉంటాయి. అయోధ్యలో ఇది విజయవంతంగా పండడం ఆనందంగా ఉంది” అని తెలిపారు.

ఓంప్రకాశ్ సింగ్ తోటలో మియాజాకి మాత్రమే కాకుండా థాయ్‌లాండ్‌కు చెందిన బనానా మామిడి, ఆస్ట్రేలియాకు చెందిన R2E2 రకం, అలాగే భారతీయ ప్రముఖ రకాలైన చౌంసా, దసేరి వంటి మామిడి చెట్లు కూడా ఉన్నాయి. వీటితో పాటు పలు స్థానిక మామిడి రకాలను కూడా ఆయన సాగు చేస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత మియాజాకి మామిడి అయోధ్యలో విజయవంతంగా పండడం వ్యవసాయ రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఈ అరుదైన మామిడి సాగు ఉద్యానవన ప్రేమికులు, రైతులు, భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. అయోధ్యలో తొలిసారిగా పండిన ఈ అత్యంత ఖరీదైన మామిడి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.