ఇండియా-చైనా (India-China) సరిహద్దులోని తూర్పు సెక్టార్‌లో నిర్మించిన సేలా టన్నెల్ (Sela Tunnel)ను శనివారం ప్రధాని మోడీ ప్రారంభించారు. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్‌లో నిర్వహించిన ‘వికసిత్ భారత్- వికసిత్ నార్త్ ఈస్ట్’ కార్యక్రమంలో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ప్రపంచంలోనే పొడవైన రెండు వరుసల టన్నెల్‌గా ఇది గుర్తింపు పొందింది.
సేలా టన్నెల్‌ను సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో పర్వతాల మధ్య దీన్ని నిర్మించారు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా బాలిపారా-చారిదౌర్-తవాంగ్ రహదారిలో అనుసంధానం కోల్పోకుండా ఉండే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు.
సరిహద్దు రహదారుల సంస్థ ఈ రెండు వరుసల టన్నెల్‌ను నిర్మించింది. ఈ ప్రాజెక్టులో రెండు సొరంగాలు ఉన్నాయి. టన్నెల్-1 సింగిల్ ట్యూబ్‌తో 1,003 మీటర్ల పొడవుండగా.. టన్నెల్-2 రెండు సొరంగమార్గాలతో 1,595 మీటర్ల పొడవు కలిగి ఉంది. రెండింటిని కలిపే రోడ్డు పొడవు 1200 మీటర్లు. టన్నెల్-2 సొరంగమార్గాల్లో ఒకటి సాధారణ ట్రాఫిక్‌కు, మరొకటి ఎమర్జెన్సీ సర్వీసులకు కేటాయించారు.
పర్వతాల మధ్య సేలా పాస్‌కు 400 మీటర్ల దిగువన ఈ నిర్మాణం చేపట్టారు. ఈ టన్నెల్ వల్ల చలికాలంలో కూడా రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదు. భారత్-చైనా సరిహద్దులో ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా ఆయుధాలు, బలగాలను వేగంగా తరలించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. సరిహద్దు ప్రాంత ప్రజలకు సామాజిక-ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చనుంది.
అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ చైనా సరిహద్దుల్లో సేలా ఉంటుంది. ఈ సొరంగమార్గంతో అత్యవసర పరిస్థితుల్లో భారత దళాలు త్వరితంగా సరిహద్దులకు చేరుకునే అవకాశం ఉంటుంది. చైనా సరిహద్దులు ఎత్తుగా ఉండటంతో డ్రాగన్ బలగాలు సులభంగా భారత దళాల కదలికలను కనిపెట్టగలవు. అయితే సొరంగమార్గం అందుబాటులోకి రావడంతో వారికి ఆ అవకాశం మూసుకుపోయింది.
ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ శుక్రవారం అస్సాం రాష్ట్రానికి చేరుకున్నారు. శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ తేయాకు తోటల్లో సంచరించి.. వాటి విశిష్టతను తెలుసుకున్నారు. అనంతరం అరుణాచల్‌ప్రదేశ్ వెళ్లి సేలా టన్నెల్‌ను మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం పశ్చిమబెంగాల్‌లో పర్యటించి ముఖ్యమంత్రి మమత సర్కార్‌పై ధ్వజమెత్తారు.