IND vs PAK World Cup 2023 Tickets Selling for 57 Lakhs: వన్డే ప్రపంచకప్ 2023లో హై ఓల్టేజీ పోరు ఏదంటే.. ఎవరైనా ‘భారత్-పాకిస్థాన్’ మ్యాచ్ అని టక్కున చెప్పేస్తారు. ఇండో-పాక్ మ్యాచ్ అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లకు భారీ డిమాండ్ ఉంది. బుక్‌మైషో ఆగస్టు 29, సెప్టెంబర్ 3న టికెట్ల విక్రయాలు చేపట్టగా గంట వ్యవధిలోనే ‘సోల్డ్ ఔట్’ బోర్డులు కనిపించాయి. దాంతో చాలామంది అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సొంత గడ్డపై భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చూడాలనుకున్న వారికి నిరాశే ఎదురైంది.
ఇక భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లకు సెకండరీ మార్కెట్‌లో భారీ ఎత్తున డిమాండ్ ఏర్పడింది. సౌత్ ప్రీమియమ్ వెస్ట్ బే టికెట్ రేటు రూ. 19.5 లక్షలుగా ఉంది. అప్పర్ టైర్‌లోని రెండు టికెట్లు మాత్రమే ఉన్నాయని స్పోర్ట్స్ టికెట్ల ఎక్ఛ్సేంజ్, రీసేల్ వెబ్‌సైట్ ‘వయాగోగో’లో కనిపిస్తోంది. ఒక్కో టికెట్ ధర రూ. 57 లక్షలుగా ఉండటం గమనార్హం. ఇండో-పాక్ కాకుండా.. భారత్ ఆడనున్న మిగతా మ్యాచ్‌ల టికెట్ ధరలు కూడా సెకండరీ మార్కెట్‌లో భారీగా ఉన్నాయి.
Also Read: Asia Cup 2023: కోహ్లీ అభిమానులకు ‘మిడిల్ ఫింగర్’ చూపించిన బీజేపీ ఎంపీ.. అది తట్టుకోలేకపోయానంటూ..!
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల ధర రూ. 41 వేల నుంచి రూ. 3 లక్షల వరకు ఉంది. భారత్ -ఇంగ్లండ్ మ్యాచ్‌కు రూ. 2.3 లక్షల వరకూ టికెట్ల రేట్ ఉంది. ఈ రేట్స్ చూసి అభిమానులు కంగుతింటున్నారు. టికెట్స్ రేట్స్ చూసి బుక్‌మైషో, ఐసీసీ, బీసీసీఐలను ట్రోల్ చేస్తూ.. సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ‘భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చూడాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘వయాగోగో వెబ్‌సైట్‌లో ఇండో-పాక్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ధరలు చూస్తే మైండ్‌బ్లాకే’, ‘నిన్న ఒక టికెట్ రూ. 15 లక్షలు ఉంది. ఇప్పుడు అది కూడా లేదు’ అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
